నేవీ విన్యాసాలతో యుద్ధ రంగాన్నితలపించిన విశాఖ ఆర్కే బీచ్
అబ్బురపరిచిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకల పాటవం
ఒళ్లు గగుర్పొడిచేలా నౌకాదళం, మెరైన్ కమాండోల సాహసోపేత విన్యాసాలు
ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఆర్‌కె బీచ్ వేదికగా తూర్పు నౌకాదళం సత్తా చాటింది. శనివారం సాయంత్రం బీచ్ వద్ద నౌకాదళం చేసిన విన్యాసాలు నౌకా దళం పటిష్టతను, ప్రతిభా పాటవాలను చాటి చెప్పాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గంటన్నర పాటు భారత నావికా దళ సంపత్తిని ప్రస్ఫుటం చేస్తూ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు చేసిన యుద్ధ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.
నౌకాదళం, మెరైన్ కమాండోలు ఒళ్లు గగుర్పొడిచేలా సాహసోపేతమైన విన్యాసాలు చేశారు. యుద్ధ సమయంలో నేవీ కమాండ్ స్పందించే విధానం చూపరుల్ని ఆకట్టుకుంది. ఆయిల్ రిగ్‌ను పేల్చివేయడం, 8 వేల అడుగుల నుంచి పారాచూట్‌లతో నిర్దేశిత ప్రాంతంలో మెరైన్ కమాండోలు దిగడం వంటివి ఆకట్టుకున్నాయి.
డార్నియర్ హెలికాప్టర్, హాక్ జెట్ ఫైటర్లు, నౌకలపై నుంచి జరిపే ఫైరింగ్‌తో పాటు దేశీయంగా అభివృధ్ధి చేసిన హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం చివరలో నిర్వహించిన లేజర్, డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. సముద్రంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో అందరినీ ఆకట్టుకున్నాయి.
8న పీఎంచే రైల్వే జోన్‌కు శంకుస్థాపన: చంద్రబాబు
నావికాదళం ధైర్యం, సామర్థ్యాలను, దక్షతకు నిదర్శనంగా ఈ విన్యాసాలు నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రైల్వేజోన్‌కి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఎన్‌టీపీసీ–జెన్‌కో సంయుక్తంగా దేశంలోని తొలి భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.
విశాఖలో త్వరలో టీసీఎస్ ఏర్పాటు కానుందని, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు వస్తాయని, వచ్చే సంవత్సరం విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు.
నేవీకి నగర ప్రజల సహకారం మరువలేనిది: తూర్పు నావికా దళాధిపతి
ఎటువంటి సవాళ్లనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ చెప్పారు. విశాఖ వేదికగా గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సామాజిక సేవ, పర్యావరణ కార్యక్రమాలలో తూర్పు నావికాదళం భాగమవుతోందని అన్నారు.
ఇటీవల నిర్వహించిన నేవీ మారథాన్‌లో 14 వేల మందికి పైగా ప్రజలు, 9 దేశాలకు చెందిన వారు పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చారని చెప్పారు. తూర్పు నావికాదళానికి విశాఖ ప్రజలు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు మంత్రులు, అధికారులు, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment