రోడ్డెక్కితే నడ్డి విరిగినట్టే..
రోడ్డెక్కితే నడ్డి విరిగినట్టే..
Published Thu, Aug 8 2013 12:30 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘వెన్ను’కు దన్నులేకుండాపోతోంది. వెన్నుపూసకు పెద్ద ఆపదొచ్చింది. క్షణమైనా నిలబడనీయదు. కాసేపు నడవనివ్వదు. ఇక ప్రయాణమంటే గగనమే. పగలంతా తిరిగొస్తే రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. పడుకుని లేస్తే కలుక్కు.. కూర్చోవాలంటే నరకం. ఇదేదో అరవై ఏళ్లు నిండిన వారి వ్యధ కాదు.. నిండా ముప్ఫై కూడా పూర్తికాని యువత వెత. నడుము నొప్పి అని చెప్పుకోలేక.. తిరగనూ లేక ఎలాగో నెట్టుకొస్తున్న పరిస్థితి. కొనితెచ్చుకున్న జబ్బు కాదు. వెన్ను కలుక్కుమందంటే లక్షలకు లక్షలు వదుల్చుకోవాల్సిందే. జీవనశైలి, విధి నిర్వహణలోని తీరుతెన్నులు ఈ పరిస్థితికి ఒక కారణమైతే నగర రోడ్లు మరో ముఖ్య కారణం. రోడెక్కితే చాలు నడ్డి విరుగుతోందన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. నగరంలో నడుమునొప్పి బాధితులు పెరుగుతున్నారు. ఏటా దాదాపు 3 లక్షల కేసులు కొత్తగా నమోదవుతున్నాయని జంటనగరాల ఆర్థోపెడిక్ అండ్ స్పైనల్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రాథమికంగా అంచనా వేసింది.
గతుకుల రోడ్లే వెన్ను విరుస్తున్నాయి..
నగరంలో దాదాపు 25 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏటా రెండున్నర లక్షలమంది వెన్ను నొప్పికి గురవుతుండగా, వారిలో ద్విచక్ర వాహన దారులే 80 శాతం మంది ఉన్నారు. మిగతా వారిలో ఐటీ, ప్రభుత్వోద్యోగులు, ప్రమాద బాధితులు, జన్యుపర లోపాలతో బాధపడుతున్న వారు ఉన్నట్టు తేలింది. ద్విచక్ర వాహనచోదకులు ప్రస్తుతం నగర రోడ్లలో రోజూ 20 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తే చాలు రెండేళ్లలో వెన్నునొప్పికి గురయ్యే ప్రమాదమున్నట్టు వైద్యులు గుర్తించారు. గతుకుల రోడ్లలో ఒక్కసారి పడితే చాలు వెన్ను తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా ఎక్కువ మంది వెన్నునొప్పికి గురవుతున్నారు.
మూడువేల గోతులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6వేల కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. ఇందులో ప్రతి వర్షాకాలంలోనూ ఇవి దెబ్బతింటున్నాయి. ఏటా ప్రధాన రహదారులపై 3 వేలకుపైగా గోతులు ఏర్పడుతున్నాయి. ఒక్కో వాహనచోదకుడు రోజూ సరాసరిన 15 కి.మీ. మేర గోతుల రోడ్లపైనే ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్లపై ప్రయాణంతో ఆటో, బస్సు డ్రైవర్లూ ఎక్కువగా వెన్నునొప్పికి గురవుతున్నట్టు తేలింది.
వెన్నునొప్పికి ఎలా గురవుతున్నారంటే..
ప్రతి ఒక్కరిలో వెన్నుపూస కీలకం. వెన్నుకు సంబంధించి మెడ భాగంలోని సీ4-సీ5, సీ5-సి6 భాగాలు, నడుము చివర భాగంలో ఉన్న ఎల్4-ఎల్5, ఎల్5-ఎస్1 భాగాలు అత్యంత కీలకమైనవి. గతుకుల రోడ్లలో వాహనాలు ఒక్కసారిగా కుదుపునకు గురవటం వల్ల ముఖ్యంగా ఎల్5-ఎస్1 భాగాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల నడుమునొప్పి రావడం, తర్వాత ఒక కాలు, ఒక చెయ్యి జాలుగా నొప్పి వస్తుంది.. ఈ ప్రభావం మెడ భాగంలో ఉన్న సీ4-సీ5 భాగంలోనూ పడుతోంది. పదేపదే ఆయా భాగాలపై ఒత్తిడి కారణంగా అవి ఎక్కువ అరుగుదలకు గురవుతున్నట్టు వైద్యుల అంచనా.
ఏటా 10 వేలకు పైగా సర్జరీలు
నగరంలో నడుమునొప్పి శస్త్రచికిత్సలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. 2002-2007 మధ్య జంటనగరాల్లో 5 వేల శస్త్రచికిత్సలు జరగ్గా, 2011-12 మధ్య ఒకే ఏడాదిలో సుమారు 10వేల శస్త్రచికిత్సలు జరిగినట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. మరికొన్ని
ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే...
గంటకు 40 మంది నడుమునొప్పి బాధితులు నమోదవుతున్నారు
2005 తర్వాత సర్జరీల సంఖ్య 50 శాతంపైనే పెరిగాయి
బ్యాక్‌పెయిన్ శస్త్రచికిత్సలకు ఏటా కనీసం రూ.130 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు
జిల్లాలతో పోలిస్తే శస్త్రచికిత్సలు జంటనగరాల్లో 80 శాతం ఎక్కువ
జంటనగరాల్లో ఆర్థోపెడిక్, స్పైనల్ సర్జన్‌లు 200 మందిపైనే ఉన్నా 30 మంది మాత్రమే
ఎక్కువగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, కొచ్చిన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువమంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు
తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్జరీ
జంట నగరాల్లో వెన్నునొప్పి బాధితులు పెరుగుతున్నారు. గతుకుల రోడ్లు దీనికి ప్రధాన కారణం. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి కూడా ఈ బాధితులు ఉన్నారు. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం, గతుకుల కారణంగా వెన్నుపై ఒత్తిడి పెరిగి ఆపై నొప్పిరావడం తొలిదశ. రెండో దశలో ఒత్తిడి ఉన్న భాగాల అరుగుదల మొదలవుతుంది. కొద్ది రోజులకు డిస్కులు జారిపోవడం జరుగుతుంది. దీంతో నడుమునొప్పితో పాటు ఒక కాలు, ఒక చేయికి నొప్పి రావడం మొదలవుతుంది. 90 శాతం మందికి మందులు, ఫిజియోథెరపీతోనే నయమయ్యేలా చూస్తాం. తప్పనిసరైతేనే సర్జరీకి వెళతాం. సర్జరీ అనంతరం జీవనశైలి మార్చుకోవాలి. గతుకుల రోడ్లలో ప్రయాణించరాదు. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి.
- డాక్టర్ నరేష్‌బాబు, వెన్నుపూస వైద్య
నిపుణులు, మెడిసిటీ ఆస్పత్రి
(జంటనగరాల ఆర్థోపెడిక్, స్పైనల్ వైద్యుల అసోసియేషన్ సభ్యులు)
Advertisement