
రూ.860 కోట్ల పనులకు ప్రచార కక్కుర్తి
సీఎం చంద్రబాబు తీరుపై సర్వత్రా విస్మయం
నాలుగేళ్లలో రూ.43 వేల కోట్లు ఖర్చుపెట్టినా.. డబ్బా కొట్టుకోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కొత్త పుంతలు తొక్కుతోంది. చేసేది గోరంత.. ప్రచారం కొండంత అన్నట్లుగా ఆయన హైడ్రామా సాగిస్తుండటం అందరినీ విస్మయపరుస్తోంది. కేవలం రూ.860 కోట్లతో రోడ్ల మీద గుంతలు పూడ్చే పనులకు చంద్రబాబు పత్రికలు, టీవీ చానళ్లతోపాటు సోషల్ మీడియాలో చేసుకుంటున్న విపరీత ప్రచారం వెర్రితలలు వేస్తోంది. ఏదో సాగునీటి ప్రాజెక్టును నిర్మించి ప్రారంభోత్సవం చేసినంత స్థాయిలో ఆయన తెగ హడావుడి చేస్తున్నారు.
గుంతలు పూడ్చే కార్యక్రమానికి కూడా ప్రారంభోత్సవం అంటూ జేసీబీలు ఎక్కి మరీ ఫొటోలకు ఫోజులు ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంతో విజయవాడను వరదలు ముంచేస్తే.. తీరిగ్గా మేల్కొన్న చంద్రబాబు సహాయక చర్యల పేరిట మీడియాలో ప్రచారం కోసం కక్కుర్తిపడ్డారు. ఆ ప్రచార హైడ్రామాను కొనసాగింపుగా రోడ్ల గుంతలు పూడ్చే పనులకు కూడా ఆయన ప్రచారం చేసుకుంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, అమరావతి
పబ్లిసిటీ లేకుండానే నాలుగేళ్లలో రూ.43 వేల కోట్ల పనులు..
నిజానికి.. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి భారీస్థాయిలో నిధులు వెచ్చించినా ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు పోలేదు. రోడ్ల గుంతలు పూడ్చటం మాత్రమే కాదు.. వాటితోపాటు పెద్ద సంఖ్యలో జగన్ సర్కారు కొత్త రోడ్లను నిర్మించింది. కోవిడ్ ప్రభావంతో దేశంలో ఏడాదికి పైగా అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
దాంతో రోడ్ల నిర్మాణం కూడా ఒక ఏడాదిపాటు నిలిచిపోయింది. కానీ, అందుబాటులో ఉన్న నాలుగేళ్లలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల కోసమే రూ.4,648 కోట్లు ఖర్చుచేయగా.. కొత్త రోడ్ల నిర్మాణంతో సహ మొత్తం రూ.43వేల కోట్లు వెచ్చించింది. అయినాసరే.. నాటి సీఎం వైఎస్ జగన్ ఎలాంటి ప్రచారం కోరుకోలేదు. అది ప్రభుత్వ బాధ్యతగానే ఆయన భావించారు.
అప్పట్లో బాబు వెచ్చించింది రూ.23వేల కోట్లే..
ఇక రోడ్ల గురించి గప్పాలు కొట్టుకునే చంద్రబాబు 2014–19 మధ్య చేసింది అంతంతమాత్రమే. ఆ ఐదేళ్లలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చుచేసింది కేవలం రూ.24వేల కోట్లే. అంతేకాదు.. రోడ్ల నిర్మాణం కోసం తీసుకున్న రూ.3వేల కోట్ల రుణాన్ని 2019 ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించింది. కానీ, రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లుగా బిల్డప్ ఇస్తూ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంది.
ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా ఈ నాలుగు నెలల్లో రోడ్ల నిర్మాణానికి చేసింది సున్నానే. గుంతలు పూడ్చడానికి కేవలం రూ.860 కోట్లు కేటాయించింది. ఇక కొత్త రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది. పీపీపీ విధానంలోనే కొత్త రోడ్లను నిర్మిస్తామని ప్రకటించింది. తద్వారా వాహనదారుల నుంచి భారీగా టోలు ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధంచేసింది. ఆ ముసుగులో టీడీపీ పెద్దలే కాంట్రాక్టర్లుగా మారి టోలు బాదుడుకు సిద్ధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment