ఇళ్ల చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్టు
ఇళ్ల చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్టు
Published Thu, Aug 8 2013 12:49 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఇళ్ల చోరీ కేసుల్లో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 24 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ ఈ.శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్డునెం.62లోని ప్లాట్‌నెం.1245లో ఇరవై రోజుల క్రితం చోరీ జరిగింది. ఇంటి యజమాని ఊరెళ్లగా.. వంట మనిషి దేవరాజ్ (23) ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలో ఉన్న రూ.5.14 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే బంగారు నగలు అపహరించకొని తన స్వస్థలం బీహార్‌లోని మధుమణి గ్రామానికి పారిపోయాడు.
ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, డీఐ సుమన్‌కుమార్ కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించారు. వంట మనిషి దేవరాజ్ కుడిచేయికి ఆరు వేళ్లు ఉంటాయని యజమాని చెప్పడంతో పోలీసులు ఆ ఒక్క ఆధారంతో మిస్టరీ ఛేదించారు. నగరంలోని బీహార్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. నిందితుడు దేవరాజ్ చోరీ సొత్తును ఒరిస్సాలోని రూర్కెలాలో విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.
ఆధారాలు దొరక్కుండా కారం పొడి చల్లి..
చోరీకి పాల్పడటం... ఘటన స్థలంలో కారం పొడి చల్లి పోలీసులకు ఆధారాలు దొరక్కుం డా చేసి తప్పించుకోవడం. ఇలా రెచ్చిపోతున్న పాతనేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ అలియా స్ రాము అలియాస్ అభిరామ్ (24)తో పాటు అతని సోదరి బొట్టిపల్లి భాగ్యమ్మ అలియాస్ బేబీ(36)ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 21 తులాల బంగారంతో పాటు వెండి ఆభరణాలు, 3 ల్యాప్‌టాప్‌లు, 3 సెల్‌ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు.
ఏసీపీ శంకర్‌రెడ్డి కథనం ప్రకారం... ఫిలింనగర్ అంబేద్కర్‌నగర్ వాసి రామకృష్ణ గతంలో సనత్‌నగర్, గోల్కొండ, ఎస్సార్‌నగర్, రాయదుర్గం, బం జారాహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఇతను అర్ధరాత్రి పూట అపార్టుమెంట్‌లోని డ్రైనేజీ, వాటర్ పైపులైన్‌లపై పాకుతూ టార్గెట్ చేసిన ఫ్లాట్‌కు చేరుకుంటాడు. ఆ ఫ్లాట్ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడతాడు. డాగ్‌స్క్వాడ్ తనను పట్టుకోకుండా ఉండేం దుకు చోరీ చేసిన ప్రాంతంలో కారంపొడి చల్లుతాడు. చోరీ సొత్తును తన సోదరి భాగ్యమ్మ ద్వారా విక్రయిస్తాడు.
ఇటీవల బంజారాహిల్స్ రోడ్డునెం.12లోని సాయిశారదా అపార్ట్‌మెంట్స్, ఫిలింనగర్‌లోని పోర్ట్‌వ్యూ అపార్ట్‌మెంట్స్‌లో చోరీలకు పాల్పడ్డాడు. ఈ కేసులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామకృష్ణతో పాటు అతని సోదరి భాగ్యమ్మను అరెస్టు చేసి రూ.9 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఈ కేసుల మిస్టరీని ఛేదించిన బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ పి.మురళీకృష్ణ, డీఐ కె.కిరణ్‌ను ఏసీపీ అభినందించారు.
Advertisement
Advertisement