సాఫ్ట్‌వేర్ యంత్రం.. ఫ్యాషన్ మంత్రం..
సాఫ్ట్‌వేర్ యంత్రం.. ఫ్యాషన్ మంత్రం..
Published Thu, Aug 8 2013 12:58 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
‘కంప్యూటర్ ముందు యంత్రంలా చేసే పనికన్నా మనసుపెట్టి చేసే ఆవిష్కరణలు ఎంతో సంతృప్తినిస్తాయి’అంటారు ఫ్యాషన్ డిజైనర్ శశి. బంజారాహిల్స్‌లో ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ పేరుతో నెలకొల్పిన తన బొటిక్‌లో ఆమె నిరంతరం సృజనత్మాక ఆలోచనల్లో మునిగితేలుతూ కనిపిస్తారు. రూ.50 వేలు ఉద్యోగం వచ్చే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శశి.. ఫ్యాషన్ డిజైనర్‌గా మారే క్రమంలో పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ‘‘సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి కాని, దుస్తులు కుడతావంటే ఎవరూ రారని అమ్మ, నాన్న వద్దన్నారు.
వారిని ఒప్పించలేక ఇంటి నుంచి బయటకు వచ్చి బంజారాహిల్స్‌లోని స్లమ్ ఏరియాలో రూ.2,500కు గది అద్దెకు తీసుకున్నా. దాచుకున్న డబ్బు పెట్టి ఎంబ్రాయిడరీ మిషన్, మగ్గం కొన్నాను. విడి విడిగా క్లాత్‌లు తీసుకొచ్చి కాంబినేషన్స్ చూసుకునే దాన్ని. తొమ్మిది నెలల పాటు భిన్న ప్రయోగాలు చేసి ఆరు ప్రత్యేకమైన లంగా ఓణీలను రూపొందించాను. అవి అందరికీ బాగా నచ్చాయి. అవి నచ్చిన వారు ఇంట్లో వేడుకలకు ఆర్డర్లు ఇవ్వడం మొద లుపెట్టారు. అలా మొదలై ఇలా ఈ రోజు 30 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోగలిగాను. ‘రిపోర్టర్’ అనే తెలుగు సినిమాకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాను.
‘మా అమ్మాయి డిజైనర్, అందంగా దుస్తులను రూపొందిస్తుంది. ఎందరికో ఉపాధి కల్పిస్తోంది’ అని ఇప్పుడు అమ్మనాన్న పదిమందికీ చెబుతున్నారు. స్నేహితులు అభినందిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’కి యాభై వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఐదుగురు నిరుపేద అమ్మాయిలకు ఉచితంగా కుట్లు, డిజైనింగ్ పనిలో మెలకువలు నేర్పుతున్నాను. ఇంకా పేదపిల్లలకు చదువుకోసం డొనేట్ చేస్తున్నాను’’ అంటూ వివరిస్తారు శశి. ఉద్యోగంతో ఆగిపోతే ఇవన్నీ సాధ్యమయేవా? అని ప్రశ్నిస్తారామె.
Advertisement
Advertisement