‘వెన్ను’ దన్ను ఏదీ?
ఏటా లక్ష మంది నడుం నొప్పి బాధితులు
అత్యధికులు ద్విచక్ర వాహనదారులే..
దక్షిణాది మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ
ట్విన్‌సిటీస్ ఆర్థోపెడిక్, స్పైనల్ డాక్టర్స్ అసోసియేషన్ అంచనా
గంటల తరబడి కంప్యూటర్లతో కుస్తీ... బయటకు వెళ్లేందుకు వాహనాలతో దోస్తీ... గతుకుల బస్తీ... వెరసి వెన్నుపూసకు సుస్తీ. అదీ 30 ఏళ్లలోపే. ఇటీవల కాలంలో అందరికీ ’వెన్ను’లో వణుకు పుటిస్తున్న వాస్తవమిది. చిన్నవయసులోనే వందలాది మంది వెన్ను నొప్పితో బాధ పడుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. వీరిలో 65 శాతం ద్విచక్ర వాహనదారులు ఉంటే... 35 శాతం ఐటీ, అనుబంధ రంగాల నిపుణులు... వైద్యులు... వ్యాపారులు ఉంటున్నారు. ట్విన్‌సిటీస్ ఆర్థోపెడిక్, స్పైనల్ డాక్టర్స్ అసోసియేషన్ సర్వే ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లోని చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, కొచ్చిన్ తదితర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువగా వెన్ను నొప్పి బాధితులు ఉన్నట్టు తేలడం...పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది.
కాసేపు నిలబడనీయదు...నడవనివ్వదు. కూర్చొని ప్రయాణం చేయాలన్నా కష్టమే. పగలంతా తిరిగొస్తే రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. పడుకుని లేస్తే కలుక్కుమంటుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వెన్ను నొప్పి, నడుము నొప్పి బాధితుల ఆవేదన ఇది. ఇదేదో అరవై ఏళ్లు నిండిన వారి గురించి చెబుతున్నది కాదు... నిండా ముప్ఫై ఏళ్లు లేని యువజనుల సంగతి. నగరంలో సుమారు 41 లక్షల వాహనాలు ఉండగా... వీటిలో 30 లక్షల ద్విచక్ర వాహనాలు, 8 లక్షల కార్లు, మరో మూడు లక్షల ఆటోలు, ఇతర వాహనాలు ఉంటాయి. అదేపనిగా వాహనాలపై ప్రయాణించడం, ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చోవడం వల్ల నగరంలో ఏటా లక్ష మంది నడుం నొప్పి బారిన పడుతున్నారు. వీరిలో 65 శాతం మంది ద్విచక్ర వాహనదారులే. మరో 35 శాతం మంది ఐటీ, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారు, వైద్యులు ఉన్నారు.
- సాక్షి, సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6 వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో ప్రధాన రహదారుల పరిధిలో 3 వేలకు పైగా గోతులు ఏర్పడుతున్నాయి. ఒక్కో ద్విచక్ర వాహనదారుడు రోజూ సగటున 15-20 కిలోమీటర్లు ఈ దారుల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. ఈ గోతులే జనాన్ని ముంచేస్తున్నాయి. మన శరీర భాగాల్లో వెన్నుపూసది కీలక పాత్ర. వెన్నుకు సంబంధించి మెడలో ఉన్న సి4-సి5, సి5-సి6 భాగాలు, నడుము చివరలో ఉన్న ఎల్4-ఎల్5, ఎల్5-ఎస్1 భాగాలు అత్యంత కీలకమైనవి. గతుకుల రోడ్లలో ఒక్కసారిగా ఎగిరి దూకడం వల్ల ఎల్5-ఎస్1 భాగాలు దెబ్బ తింటున్నాయి. దీనివల్ల నడుము నొప్పి రావడం, తర్వాత ఒక కాలు, ఒక చెయ్యి జాలుగా నొప్పి వస్తుంది. ఈ ప్రభావం మెడలో ఉన్న సి4-సి5 భాగంలోనూ పడుతోంది. పదే పదే ఆ భాగాలపై ఒత్తిడి వల్ల అవి అరుగుదలకు గురవుతున్నట్టు వైద్యులు అంచనా వేశారు.
ఏటా 10 వేల సర్జరీలు
నగరంలో నడుం నొప్పి బాధితులకు శస్త్రచికిత్సలు విపరీతంగా జరుగుతున్నాయి. 2002-2007 మధ్య కాలంలో జంట నగరాల్లో 5 వేల శస్త్రచికిత్సలు జరగ్గా... 2012-13లో సుమారు 10 వేల శస్త్రచికిత్సలు జరిగినట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. గంటకు 40 మంది నడుం నొప్పి బాధితులు నమోదవుతున్నట్టు తేలింది. 2005 తర్వాత సర్జరీల సంఖ్య 50 శాతం పెరిగాయి. జిల్లాలతో పోలిస్తే శస్త్రచికిత్సలు జంట నగరాల్లో 80 శాతం అధికం.
ఒకే పొజిషన్‌లో కూర్చోవడం వల్లే..
జంట నగరాల్లో వెన్నునొప్పి బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. క్యాన్సర్, హృద్రోగాల తర్వాత అత్యంత ఎక్కువగా న మోదవుతున్న కేసులు ఇవే. ఎటూ కదలకుండా ఆరు గంటల పాటు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం, గతుకుల రోడ్లపై రెస్ట్ లేకుండా 15-20 కిలోమీటర్లు ప్రయాణించడంతో డిస్కులు దెబ్బతింటున్నాయి. అతిగా మద్యం తాగడం..సిగరెట్‌లు కాల్చడం కూడా ఎముకల అరుగుదలకు మరో కారణం. 98 శాతం మందికి మందులు, ఫిజియోథెరపి వంటి వాటితోనే నయమయ్యేలా చూస్తాం. తప్పని పరిస్థితుల్లోనే సర్జరీ చేస్తాం.
- డాక్టర్ జె.నరేష్‌బాబు, స్పైన్ సర్జన్