
ఈసారి 92 పర్సంటైల్ ఉండొచ్చని అంచనా
జేఈఈ–మెయిన్ పరీక్షలు రెండు సెషన్లూ క్లిష్టంగానే..
జనవరితో పోలిస్తే ఏప్రిల్ సెషన్‌లో ఉపశమనం
ముగిసిన రెండో సెషన్ పరీక్షలు
సాక్షి, ఎడ్యుకేషన్: జాతీయస్థాయిలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్–2025లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్ కొంత తగ్గే అవకాశం ఉంది. 2024లో జేఈఈ మెయిన్స్‌లో పర్సంటైల్ 94 ఉండగా, ఈసారి అది 92 ఉండొచ్చని సబ్జెక్ట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన రెండు సెషన్లలోనూ ప్రశ్నలు కాసింత క్లిష్టంగా ఉండటమే కారణమని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో.. 19 షిఫ్ట్‌లలో నిర్వహించిన జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. దాదాపు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 90 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది అభ్యర్థులు ఉంటారని అంచనా.
పర్సంటైల్ అంచనా..: ఈసారి మ్యాథమెటిక్స్‌లో 20 మార్కులతో; ఫిజిక్స్‌లో 50 మార్కులతో; కెమిస్ట్రీలో 35 మార్కులతో 92 పర్సంటైల్ ఉండొచ్చని చెబుతున్నారు. అదేవిధంగా మ్యాథమెటి క్స్‌లో 35 మార్కులు; ఫిజిక్స్‌లో 45 మార్కులు; కెమిస్ట్రీలో 65 మార్కులతో 99 పర్సంటైల్‌ను ఆశించొచ్చని అంటున్నారు. చివరి రోజు కాస్త కఠినం: జేఈఈ–మెయిన్ చివరి రోజు ప్రశ్నపత్రం ఓ మోస్తరు క్లిష్టంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెప్పారు. మ్యాథమెటిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయని, కెమిస్ట్రీ ప్రశ్నలు సుదీర్ఘ కసరత్తు చేసేలా ఉన్నాయన్నారు.
ఫిజిక్స్‌లో కూడా ఓ మాదిరి కఠినంగానే ప్రశ్నలు అడిగారని తెలిపారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలకు ఎక్కువ వెయిటేజీ కల్పించారని, అదేవిధంగా ప్రశ్నలు మెమొరీ బేస్డ్‌గా ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. ఫిజిక్స్‌లో కాన్సెప్ట్స, కాలిక్యులేషన్స్ అవసరమైన ప్రశ్నలు అడగడంతో కొంత సమయాభావం ఎదురైంది. మ్యాథమెటిక్స్‌లో కాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జీబ్రాలకు వెయిటేజీ కల్పించారు.
నేడు పేపర్–2ఎ, 2బి పరీక్షలు: ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతగా నిలిచే పేప ర్–2ఎ(బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్), పేపర్–2బి (బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్) పేపర్ల పరీక్షలను బుధవారం నిర్వహించనున్నారు.
ఈఏపీసెట్, అడ్వాన్స్‌డ్ రెండింటికీ ఇలా..
జేఈఈ మెయిన్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో విద్యార్థుల దృష్టి ఈఏపీసెట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌పై ఉంటుంది. ఈ రెండింటికీ ఉమ్మడిగా ప్రిపరేషన్ సాగించాలని భావిస్తారు. కానీ, జేఈఈ–మెయిన్‌లో కటాఫ్ అంచనా కంటే కనీసం పది మార్కులు ఎక్కువ సాధిస్తామనే నమ్మకం ఉంటేనే ఉమ్మడి ప్రిపరేషన్ దిశగా కదలాలి. లేదంటే ముందుగా ఈఏపీసెట్ ప్రిపరేషన్‌కు పదును పెట్టుకోవాలి. ఎందుకంటే ఈఏపీసెట్‌లో వేగం, కచ్చితత్వం అత్యంత ఆవశ్యకం. మూడు గంటల్లో 160 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ను విశ్లేషిస్తే సాగదీత ప్రశ్నలు, న్యూమరికల్ ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులకు సమయం సమస్యగా మారింది. –ఎంఎన్ రావు, జేఈఈ శిక్షణ నిపుణుడు