
డేటా సైన్స్, ఏఐలో గేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాదినేని నిఖిల్
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రణాళిక మార్చినట్లు వెల్లడి
ఎంబీబీఎస్, ఏఐ నైపుణ్యాల కలయికతో ఉజ్వల భవిష్యత్తు!
హెల్త్‌కేర్‌లో ఏఐపై పరిశోధన చేయడమే లక్ష్యం
సాక్షి, ఎడ్యుకేషన్: ‘ఎంబీబీఎస్ పూర్తయ్యాక నచ్చిన స్పెషలైజేషన్‌లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదవడం. ఆ వృత్తిలో కొనసాగడం.. సాధారణంగా.. ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రణాళిక ఇదే. కానీ.. మారుతున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హెల్త్‌కేర్ సెక్టార్‌లో కీలకంగా నిలుస్తుందని.. ఇందులో నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఎంబీబీఎస్, ఏఐ నైపుణ్యాల కలయికతో మరింత ఉన్నతంగా ఎదగొచ్చని భావించా.
అందుకే ఎంబీబీఎస్ తర్వాత బీఎస్ డేటా సైన్స్‌లో చేరాను. ఏఐలో ఎంటెక్ చేయడం, హెల్త్‌కేర్‌లో ఏఐపై రీసెర్చ్ చేయడమే లక్ష్యం..’అంటున్నారు.. గేట్–2025లో డేటా సైన్స్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌లో 96.33 మార్కులతో.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన..ఏపీలోని నెల్లూరు జిల్లా ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ చౌదరి. పదో తరగతి నుంచి తాజాగా గేట్ ర్యాంకు వరకు అన్నిటా ముందు నిలిచిన నిఖిల్ చౌదరి.. ప్రస్తుతం ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే హెల్త్‌కేర్ ఏఐ సంస్థలో ఇన్ఫర్మాటిక్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్
ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక.. 2017లో ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నీట్–యూజీ రెండింటికీ హాజరయ్యా. ఎయిమ్స్ ఎంట్రన్స్‌లో 22వ ర్యాంకు, నీట్–యూజీలో 57వ ర్యాంకు వచ్చాయి. ఎయిమ్స్ వైపు మొగ్గుచూపి ఢిల్లీలో ఎంబీబీఎస్‌లో చేరా. చదువు పూర్తయ్యాక 2023లో ఆరు నెలల పాటు ఎయిమ్స్‌లోనే తాత్కాలిక ప్రాతిపదికన డాక్టర్‌గా విధులు నిర్వర్తించా.
అప్పుడే బీఎస్ డేటా సైన్స్
ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే.. డేటా సైన్స్.. హెల్త్‌కేర్ సెక్టార్‌లో దాని ప్రాధాన్యంపై అవగాహన ఏర్పడింది. ఆ కోర్సు చదవాలని భావించా. ఐఐటీ– చెన్నైలో ఆన్‌లైన్ విధానంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) ఇన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుని అందులో చేరా. 2021 నుంచి 2024 వరకు ఆన్‌లైన్‌లో ఈ కోర్సు చదివి సరిఫికెట్ సొంతం చేసుకున్నా. ఇప్పుడు ఇదే అర్హతతో గేట్‌లో డేటా సైన్స్ / ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌కు హాజరయ్యా.
హెల్త్‌కేర్ రంగంలో కీలకంగా ఏఐ
ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగంలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో కీలకంగా నిలుస్తోంది. ఎంఆర్‌ఐ, కోడింగ్, మెడికల్ ఇమేజెస్ వంటి వాటిని కచ్చితత్వంతో విశ్లేషించడానికి ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదం చేస్తుంది. అంతేకాకుండా మెడికల్ కోడింగ్, బిల్లింగ్ వంటి ఇతర హెల్త్‌కేర్ సంబంధ వ్యవహారాల్లో కూడా ఏఐ టూల్స్ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి.
ఏఐలో ఎంటెక్.. తర్వాత రీసెర్చ్
గేట్‌లో వచ్చిన ర్యాంకుతో ఐఐటీలో ఎంటెక్ ఏఐ స్పెషలైజేషన్‌లో చేరతా. ఆ తర్వాత ఈ రంగానికే చెందిన సంస్థల్లో ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నా. భవిష్యత్తులో అవకాశం ఉంటే స్టార్టప్ నెలకొల్పడంపై దృష్టి సారిస్తా. కానీ హెల్త్‌కేర్ ఏఐలో రీసెర్చ్ చేయడమే నా మొదటి ప్రాధాన్యం.
గేట్ అంటే భయపడక్కర్లేదు.. నేను ఉద్యోగం చేస్తూనే..
సిలబస్‌ను ఆసాంతం నిశితంగా పరిశీలించి బీటెక్ అకడమిక్స్‌పై పట్టు సాధిస్తే గేట్‌లో విజయం సులభమే. నేను బీఎస్ డేటా సైన్స్‌లో చదివిన అంశాలను సిలబస్‌తో బేరీజు వేసుకుంటూ చదివా. ప్రాక్టీస్ టెస్టులు, మోడల్ టెస్టులకు హాజరయ్యా. ప్రస్తుతం ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో ఇన్ఫర్మాటిక్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నా.
ఒకవైపు ఉద్యోగం చేస్తూనే గేట్‌కు ప్రిపరేషన్ సాగించా. ప్రతీరోజు 3 నుంచి 4 గంటలు.. సెలవు రోజుల్లో ఏడెనిమిది గంటలు కేటాయించా. కొన్ని ఆన్‌లైన్ క్లాస్‌లకు కూడా హాజరయ్యా. ఇందులో ముఖ్యమైన అంశం టైమ్ మేనేజ్‌మెంట్. పరీక్ష రోజు మనకు అందుబాటులో ఉండే సమయాన్ని గుర్తుంచుకుని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ దశ నుంచే ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది.
నిఖిల్ అన్నింటిలోనూ టాపరే..
⇒ పదో తరగతి: 9.8 జీపీఏ
⇒ ఇంటర్మిడియెట్: 986 మార్కులు
⇒ ఎయిమ్స్ ఎంట్రన్స్ – 2017, ర్యాంకు: 22
⇒ నీట్ – 2017 ర్యాంకు: 57
⇒ 2017–2023: ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్
⇒ 2024: బీఎస్ డేటా సైన్స్ (ఐఐటీ – చెన్నై) 9.95 జీపీఏ
⇒ గేట్–2025లో డేటా సైన్స్, ఏఐ పేపర్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్
Comments
Please login to add a commentAdd a comment