
సాక్షి, హైదరాబాద్: ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ తగిలింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.
కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా.. వసంత కృష్ణ ప్రసాద్ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది.
ఈ క్రమంలో వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్‌తో పాటు భారీ షెడ్లను తొలగించారు. హఫీజ్‌పేటలో రూ.2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా పెట్టినట్లు తేలింది. అలాగే.. మాదాపూర్‌లోని 20 ఎకరాల భూమిని వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది.
