
పొరుగు రాష్ట్రాన్నీ వదలని తెలుగుదేశం నేతలు
హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని రూ.3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఏపీ ఎమ్మెల్యే పాగా
బై నంబర్‌తో రికార్డులు సృష్టించి 39 ఎకరాలు ఆక్రమించిన వసంత కృష్ణప్రసాద్
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే నిర్మాణాలు
19 ఎకరాల్లో విల్లాలు, 20 ఎకరాల్లో షెడ్లు, కార్యాలయాల నిర్మాణం
ఇటీవలి పలు ఫిర్యాదుల నేపథ్యంలో కదిలిన హైడ్రా
షెడ్లు, ఇతర నిర్మాణాల కూల్చివేత..మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు
గచ్చిబౌలి/హఫీజ్‌పేట్ (హైదరాబాద్): స్వరాష్ట్రమే కాదు..పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జాల పర్వం కొనసాగిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను చెరబడుతున్నారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.3 వేల కోట్లు పలికే ప్రభుత్వ స్థలానికి ఎసరు పెట్టారు. నకిలీ డాక్యుమెంట్లతో దొడ్డిదారిన యాజమాన్య హక్కులు పొందారు.
దీనిపై ఒకవైపు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. ఫాంహౌస్, విల్లాలు నిర్మిస్తూ విలువైన భూమిలో పాగా వేశారు. షెడ్లు, కార్యాలయాలు నిర్మించారు. దీనిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులుండగా, ఇటీవలి మరికొన్ని ఫిర్యాదులు సైతం రావడంతో హైడ్రా కదిలింది. ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలపై కొరడా ఝళిపించింది. హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79లో ఎమ్మెల్యే, మరికొందరు కలిసి అక్రమంగా చేపట్టిన నిర్మాణాల్లో కొన్నిటిని కూల్చివేసింది.
39 ఎకరాలు దర్జాగా కబ్జా
హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79కి సంబంధించిన రికార్డులలో 39.06 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే బై నంబర్‌తో రికార్డులు సృష్టించిన వసంత కృష్ణప్రసాద్, మరి కొంతమంది ఆ భూమిని ఆక్రమించారు. చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ భూమిపై ఎన్నో ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ (సీఎస్ 14/58) పెండింగ్‌లో ఉంది. స్టేటస్‌కో పాటించాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయినా పట్టించుకోకుండా ఏళ్ల క్రితమే నిర్మాణాలు ప్రారంభించి 19 ఎకరాలలో విల్లాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించారు.
మిగతా 20 ఎకరాలలో షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చారు. పలు కార్యాలయాలు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ భూమిపై కేసులు ఉన్నప్పుడు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. కాగా అటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు కానీ ఈ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోయారనే విమర్శలు ఉన్నాయి. ఫైనల్ డిక్రీ రాకుండానే ఈ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని ఈ పిటిషన్ విచారణ క్రమంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలోనే భూముల కబ్జాపై గత మూడు నెలలుగా మరిన్ని ఫిర్యాదులు అందడంతో శనివారం పోలీస్ బందోబస్తుతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ భూమిలోని షెడ్లు, కార్యాలయాలతో కూడిన నిర్మాణాలను కూల్చివేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే శిక్షార్హులని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులపై మియాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
నిషేధిత జాబితా కింద ఉన్నప్పటికీ..
హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79లోని 39 ఎకరాలు రెవెన్యూ రికార్డులలో నిషేధిత జాబితా కింద ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలానికి 79/1 బై నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద స్థలంలో విల్లాలకు అనుమతులు ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు చేయడంలో అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 39.08 ఎకరాలు రెవెన్యూ రికార్డులలో ఇప్పటికీ ప్రభుత్వభూమి (పోరంబోకు)గానే ఉండటం గమనార్హం.

రాయదుర్గంలోనూ హైడ్రా కొరడా
తాము రోజూ ఆడుకునే స్థలంలోకి రానివ్వడంలేదని, అక్కడ చెరువు కూడా మాయమైందని, రహదారుల నిర్మాణం చేపడుతున్నారని క్రికెట్ ఆడే కొందరు యువకులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు. శనివారం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నంబర్ 5/2లోని ఆ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అది ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అందులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఓ చోట ప్రహరీ గోడను కూల్చివేశారు. ఈ భూమిపై ఆక్రమణ కేసులు ఉన్నట్లుగా అక్కడ బోర్డులు ఉన్నప్పటికీ, ప్లాట్ల కొనుగోలుకు తమను సంప్రదించాలంటూ కొందరు (నార్నే ఎస్టేట్స్) ఫోన్ నంబర్లతో సహా ఏర్పాటు చేసిన బోర్డులు హైడ్రా అధికారులు గుర్తించారు.