
ఏపీ, తెలంగాణతో జరిగిన సమన్వయ సమావేశంలో పీపీఏ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) మేరకు నీటిని నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై స్వతంత్ర నిపుణులతో అధ్యయనం చేయించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోయినా సమగ్ర సర్వే చేయిస్తామని పీపీఏ సీఈఓ అతుల్‌జైన్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుతో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై మంగళవారం హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ అధికారులతో పీపీఏ నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పోలవరం బ్యాక్‌వాటర్‌తో కిన్నెరసాని, మున్నేరువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై మాత్రమే అధ్యయనం చేయాలని ఎన్జీటీ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకే నిర్వహిస్తామని ఈ సమావేశంలో ఏపీ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ అధ్యయనాలు పూర్తయిన నేపథ్యంలో ముంపునకు గురికానున్న ప్రాంతాలను గుర్తించడానికి డీమార్కింగ్ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపు ప్రభావంపై సైతం ఏకకాలంలో అధ్యయనం చేయాలని సమావేశంలో తెలంగాణ పట్టుబడగా, ఏపీ నిరాకరించింది.
పోలవరం బ్యాక్‌వాటర్ విషయంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఆందోళనలన్నింటినీ పరిష్కరించాలని ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ ఎత్తిచూపింది. ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చిన నేపథ్యంలో దీనిపై ఉన్న కేసు మూసివేయాలని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసిందని, ఇప్పుడు అధ్యయనం చేయకపోతే ఎలా అని ప్రశ్నించింది.
దీంతో పీపీఏ సీఈఓ అతుల్‌జైన్ కలగజేసుకొని మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపు ప్రభావంపై పీపీఏ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణులతో అధ్యయనం చేయిస్తా మని ప్రకటించారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారు దల శాఖ ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్, భద్రాచలం ఎస్‌ఈ రవికుమార్, ఏపీ తరఫున పోలవరం ప్రాజెక్టు సీఈ కె.నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవిభాగం సీఈ సుగుణాకర్ పాల్గొన్నారు.
పోలవరం ఎత్తు కుదించాం..ఆందోళన వద్దు : ఏపీ
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 135 మీటర్లకు కుదించి తొలిదశ కింద పనులు నిర్వహిస్తున్నామని, ఈ పనులు పూర్తి కావడానికి ఇంకా రెండేళ్లు పడుతుందని ఏపీ అధికారులు తెలియజేశారు. రెండో దశ పనులను ఎప్పుడు ప్రారంభిస్తారో ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఈ నేపథ్యంలో 150 మీటర్ల గరిష్ట నీటిమట్టంతో ఉండనున్న ముంపు ప్రభావం విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని తెలంగాణకు సూచించారు.
150 మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిచ్చిన నేపథ్యంలో ఆ మేరకు నీటి నిల్వలతో ఉండనున్న ముంపు ప్రభావంపై సర్వే చేయాల్సిందేనని తెలంగాణ అధికారులు వాదించారు. పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముర్రెడువాగు, కిన్నెరసానితో పాటు మిగిలిన 5 వాగులు, భద్రాచలం పట్టణానికి ఉండనున్న ముంపు ప్రభావాన్ని నిర్థారించి రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రెండు వాగులకు ఉన్న ముంపు ప్రభావాన్ని డీమార్కింగ్ చేసిన తర్వాత ఆ మేరకు భూసేకరణ నిర్వహించాలా? లేక రక్షణ చర్యలు తీసుకోవాలా? అని ఏపీ అధికారులు ఈ సమావేశంలో తెలంగాణ అధికారులను ప్రశ్నించారు. సర్వే నివేదిక అందిన తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ అధికారులు బదులిచ్చారు.
బనకచర్ల ప్రాజెక్టుపై మళ్లీ అభ్యంతరం తెలిపిన తెలంగాణ
పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా గోదావరి–బనక చర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టుతున్నారని ఈ సమా వేశంలో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో పీపీఏకి ఎలాంటి సంబంధం లేదని సీఈఓ స్పష్టం చేయగా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు అనుగణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిన బాధ్యత పీపీఏపై ఉందని తెలంగాణ అధికారులు గుర్తు చేశారు. ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించి నిర్మాణాలు చేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పీపీఏపై ఉందని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా జిల్లాల తాగునీటి అవసరాల పేరుతో పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి 18 టీఎంసీలను తరలించడానికి ఏపీ అక్రమ ప్రాజెక్టును చేపట్టిందని సమావేశంలో తెలంగాణ అభ్యంతరం తెలిపింది. దీనిని అడ్డుకోవాలని పీపీఏని కోరింది.