
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ (వెనుక జలాలు) ముంపుపై మూడు రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనెల 10న కేంద్రం మరో కీలక సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో హాజరుకావాలని కేంద్రం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో అదే రోజు (ఈనెల 10న) హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ అధికారులతో నిర్వహించాల్సిన భేటీని పీపీఏ సీఈవో శివ్‌నంద్‌కుమార్ రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు సమస్య ఉత్పన్నమవుతోందని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్ లీల్ పిటిషన్) దాఖలు చేసిన విషయం విదితమే. ఈ నేసథ్యంలో సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు మరోసారి భేటీ అవుతున్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఇచ్చే నివేదిక ఆధారంగా నాలుగు రాష్ట్రాల సీఎంలతో మంత్రి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment