back water
-
వాటర్ మెట్రో వచ్చేస్తోంది
కొచ్చి: నీళ్లల్లో రయ్‌మని దూసుకువెళ్లే మెట్రో వచ్చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో కేరళలో ప్రారంభం కానుంది. కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్‌తో నిండి ఉండే రాష్ట్రం. అక్కడ ప్రయాణాలంటే రోడ్లు, రైలు, ఆకాశ మార్గాలతో పాటు గమ్యస్థానం చేరుకోవడానికి నీళ్లలో కూడా ప్రయాణం తప్పనిసరి. అందుకే ఒక దీవి నుంచి మరో దీవికి చేరుకోవడానికి అన్ని హంగులతో కూడిన ఎలక్ట్రిక్ హైబ్రిడ్ పడవల్ని ప్రవేశపెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కొచ్చిలో ఈ వాటర్ మెట్రోని ప్రారంభిస్తారు. ఈ మెట్రో కొచ్చి రవాణా రంగంలో ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుంది. కొచ్చి చుట్టుపక్కల పది దీవుల మధ్య వాటర్ మెట్రో ప్రయాణిస్తుంది. కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ మొత్తం ఎనిమిది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్స్‌ని తయారు చేసింది. వాటర్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈ మెట్రోతో విప్లవాత్మక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. రవాణా, పర్యాటక రంగాలకు ఈ మెట్రో ఊతమిస్తుందని అన్నారు. జర్మనీ ఫండింగ్ ఏజెన్సీ కేఎఫ్‌డబ్ల్యూ, కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ.1,137 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. -
పోలవరం ముంపుపై 10న కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ (వెనుక జలాలు) ముంపుపై మూడు రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనెల 10న కేంద్రం మరో కీలక సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో హాజరుకావాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అదే రోజు (ఈనెల 10న) హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ అధికారులతో నిర్వహించాల్సిన భేటీని పీపీఏ సీఈవో శివ్‌నంద్‌కుమార్ రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు సమస్య ఉత్పన్నమవుతోందని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్ లీల్ పిటిషన్) దాఖలు చేసిన విషయం విదితమే. ఈ నేసథ్యంలో సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు మరోసారి భేటీ అవుతున్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఇచ్చే నివేదిక ఆధారంగా నాలుగు రాష్ట్రాల సీఎంలతో మంత్రి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. -
ఇక అధ్యయనంతో పని లేదు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేసే ప్రసక్తే లేదని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. గోదావరి నదికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. 50 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుందని అధ్యయనం ద్వారా అంచనా వేసినట్టు గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మించక ముందు వరద నీటిమట్టం ఏ స్థాయిలో ఉంటుందో.. ప్రాజెక్టు నిర్మించాక కూడా అంతే ఉంటుందని ఆ అధ్యయనంలో వెల్లడైందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు ముంపుతోపాటు ఇతర సాంకేతిక అంశాలపై సందేహాలను నివృత్తి చేయడానికి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ సర్కార్లతో ఇప్పటికే రెండుసార్లు కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాయి. ఈ క్రమంలో సోమవారం సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా అధ్యక్షతన ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒడిశా వాదనతో ఏకీభవించని సీడబ్ల్యూసీ గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని.. దాన్ని పరిగణలోకి తీసుకుని పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా ఈఎన్సీ అశుతోష్ దాస్ చేసిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా తోసిపుచ్చారు. గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనడానికి ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఊహాజనితంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. ఎఫ్ఆర్ఎల్ చూపడానికి రెడీ గత ఏడాది గోదావరికి జూలైలో వచ్చిన వరదలకు కిన్నెరసాని, ముర్రేడువాగు తదితర 30 వాగుల్లోకి పోలవరం బ్యాక్ వాటర్ ఎగదన్నడం వల్ల భద్రాచలం, మణుగూరు భారజల కర్మాగారం, 809 ఎకరాల భూమి ముంపునకు గురైందని తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు చెప్పడాన్ని ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఖండించారు. ప్రాజెక్టే ఇంకా పూర్తి కాలేదని.. నీటిని నిల్వ చేయకుండానే బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపునకు గురైందని ఊహాజనితంగా చెప్పడం సరైంది కాదన్నారు. ఏపీ ఈఎన్సీ వాదనతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ ఛైర్మన్ వోరా గోదావరి ట్రిబ్యునల్ ఆమోదించిన మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు. గతేడాది జూలైలో వచ్చిన వరదలకు భద్రాచలం ముంపునకు గురైందని.. రక్షణ గోడలు నిర్మించాలని తెలంగాణ ఈఎన్సీ కోరడంపై ఏపీ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టం (ఎఫ్ఆర్ఎల్) 45.72 స్థాయిలో నీటిని నిల్వ చేస్తే.. ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని గుర్తిస్తూ సర్వే రాళ్లు వేశామని.. వాటి పరిధిలోకి భద్రాచలం, మణుగూరు రావని స్పష్టం చేశారు. కావాలంటే క్షేత్ర స్థాయిలో ఎఫ్ఆర్ఎల్ సర్వే రాళ్లు చూపించడానికి సంయుక్త సర్వేకు తాము సిద్ధమని తేల్చి చెప్పారు. కిన్నెరసాని, ముర్రేడువాగుతోపాటు మరో నాలుగు వాగులపై బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని తెలంగాణ ఈఎన్సీ చేసిన ప్రతిపాదనను ఏపీ ఈఎన్సీ తోసిపుచ్చారు. పీపీఏ నేతృత్వంలో భేటీ పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ ముంపుపై ఏపీ, తెలంగాణ అధికారులతో ఈ నెల 10న సమావేశమై తెలంగాణ సందేహాలను నివృత్తి చేయాలని పీపీఏ చైర్మన్ శివనంద్కుమార్ను సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. రెండు రాష్ట్రాల అధికారులు ఎఫ్ఆర్ఎల్, ముంపుపై నివేదికలు సిద్ధం చేసి పరస్పరం మార్పిడి చేసుకుని చర్చించాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ అధికారుల సందేహాలు నివృత్తి కాకుంటే ఎఫ్ఆర్ఎల్ రాళ్లు గుర్తించడానికి సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. -
ఉమ్మడి సర్వే జరపాల్సిందే!.. పోలవరం అథారిటీ భేటీలో వాడీవేడి చర్చ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నిల్వ సామర్థ్యం 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేస్తే రాష్ట్రంలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ పునరుద్ఘాటించింది. పోలవరం బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు గోదావరికి ఇరువైపులా తెలంగాణ పరిధిలో 892 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టుగా తమ ఇంజనీర్లు తేల్చారని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉమ్మడి సర్వేను.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు పరిమితం చేయకుండా 892 ఎకరాల్లో చేపట్టాలని డిమాండ్ చేసింది. బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) భేటీలో పోలవరం ముంపు ప్రభావంపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్‌కుమార్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. వాగుల ప్రవాహానికి బ్యాక్‌వాటర్ అడ్డంకి పోలవరంతో తెలంగాణలో 300ఎకరాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని, దీనిపై అధ్యయనం జరిపి నివా రణ చర్యలు తీసుకుంటామని 2020 జనవరిలో జరిగిన 11వ పీపీఏ భేటీలో ఏపీ కూడా ఒప్పుకుందని మురళీధర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే కోసం ఇటీవల క్షేత్రస్థాయి పర్య టనకు వచ్చిన ఏపీ అధికారులు.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఉండనున్న ప్రభావంపైనే అధ్యయనం చేస్తామ న్నారని తెలిపారు. 892 ఎకరాల ముంపుపై అధ్యయనం చేయాలని తాము కోరగా, ఏపీ ప్రభుత్వ అనుమతి తీసు కుని మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారని వివరించారు. తెలంగాణలోని 35 వాగుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్‌వాటర్ అడ్డంకిగా మారడంతో పరిసర ప్రాంతాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం జరిగిందన్నారు. గత జూలైలో వచ్చిన వరదలతో 103 గ్రామాలు ప్రభావితం కాగా, 40,446 ఎకరాలు ముంపునకు గుర య్యాయని చెప్పారు. పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మరో 46 గ్రామాల పరిధిలోని 9,389 ఎకరాలు ముంపునకు గురి అవుతాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం అధ్యయనం చేయించాలని కోరారు. భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని వరద జలాలను గోదావరిలోకి పంపింగ్ చేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదని, దీనికి ఎవరూ అంగీకరించలేదని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర, తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అన్ని రాష్ట్రాల తో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని మాత్రమే సూ చించిందని చెప్పారు. అయితే రెండు సమావేశాల్లో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని, ఇందుకోసం త్వరలోనే కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ సీఎంలతో సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం పేర్కొందని తెలిపారు. తెలంగాణకు నచ్చినట్టుగా నివేదికలు వచ్చేవరకు అధ్యయనం చేయాలా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం.. తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం -
పోలవరం బ్యాక్ వాటర్ వివాదం పై CWC కీలక నిర్ణయం
-
ప్రకృతి కాంత హోయలు.. రెండు హరివిల్లులు
సాధారణంగా ఆకాశంలో ఇంద్రధనస్సు ఒక సమయంలో ఒకటే ఏర్పడుతుంది. అయితే ఆదివారం నిజామాబాద్ జిల్లా నందిపేట్ గ్రామ శివారులో రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడ్డాయి. సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షం కురిసిన అనంతరం రంగుల హరివిల్లు ఇలా వెల్లివిరిసింది. –ఇందూరు(నిజామాబాద్ అర్బన్) పంటలను ముంచిన బ్యాక్‌వాటర్ మహదేవపూర్: మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అబట్పల్లి వద్ద మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్లో 79 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో బ్యాక్‌వాటర్‌తో కొంగలవాగు, పెద్దంపేట వాగు ఉప్పొంగి సూరారం, పెద్దంపేట గ్రామాల్లోని దాదాపు 300 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నష్టం అంచనా వేసి సాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బ్యారేజీలో 94.80 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉందని, ప్రస్తుతం కురిసిన వర్షానికి 25,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు. -
ముంపు..ముప్పు..
మణుగూరు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారగా, తెలంగాణాకు శాపమైంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద సుమారు రూ.50వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మూలంగా ఇరు రాష్ట్రాల్లోని వేల ఎకరాల సాగుభూమి, వందల కిలో మీటర్ల మేర అడవులు ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 50 లక్షల క్యూసెక్కులుగా డిజైన్ మార్చి, ఎత్తు 160 మీటర్లకు పెంచడంతో ముంపు ప్రభావం తెలంగాణాపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్రంలోని భారీ పరిశ్రమలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇరిగేషన్ శాఖా ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో అంచనాలు తయారు చేసి కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్యాక్ వాటర్ ప్రభావం 124 కిలోమీటర్లు... పోలవరం ప్రాజెక్టు మూలంగా తెలంగాణలోని 124 కిలోమీటర్ల మేర బ్యాక్‌వాటర్ ప్రవహిస్తుందని జలవనరుల అధికారులు అంచనాకు వచ్చారు. ప్రాజెక్టు డిజైన్ మార్పుతో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ముంపు ప్రభావం పడనుంది. భద్రాద్రి జిల్లాలో ఎక్కువ భాగం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన వేల ఎకరాల సాగుభూములు బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురి కానున్నాయి. జిల్లాలోని అశ్వాపురంలో గల మణుగూరు భారజల కర్మాగారం, బూర్గంపాడు మండలం సారపాక వద్ద గల ఐటీసీ, మణుగూరు మండల పరిధిలోని బొగ్గు బావుల వరకు బ్యాంక్ వాటర్ ప్రభావం పడుతుందని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లాలోని సుమారు 100 గ్రామాలు ముంపునకు గురవుతాయని, దేశవ్యాప్తంగా పేరున్న కర్మాగారాలు ముంపు బారిన పడనుండడంతో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి అంతరాష్ట్ర జలవనరుల విభాగం సమావేశంలో ప్రత్యేక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యం గల నీటిని స్టోరేజీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వద్ద అనుమతి పొందిన ఏపీ.. ఇప్పుడు డిజైన్ మార్చి 50 లక్షల క్యూసెక్కుల నీటిని స్టోరేజీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పునరధ్యయనం చేయాలి... పోలవరం ప్రాజెక్టు నిర్మాణ డిజైన్ మార్పుతో పాటు డ్యామ్ ఎత్తు పెంచి 50 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో నిర్మాణం చేపడితే బ్యాక్ వాటర్ ప్రవాహంతో భద్రాద్రి జిల్లాలోని అధిక మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని రెండు మండలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సర్వే ఆఫ్ ఇండియా వద్ద గల మ్యాప్‌ల ఆధారంగా ఈ రెండు జిల్లాల పరిధిలో సాధారణ వర్షపాత నమోదు, బ్యాక్ వాటర్ ప్రవాహం మూలంగా లోతట్టున గల మండలాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై పునరధ్యయనం చేయాలని కోరింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో బ్యాక్ వాటర్ గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ముంపు ప్రాంతాల సమాచారం ఇరిగేషన్ శాఖాధికారుల వద్ద ఉంది. ముంపునకు గురయ్యే రెవెన్యూ గ్రామాలను ఇంకా గుర్తించలేదు. –రాంకిషన్, జేసీ పోలవరం ఎత్తు తగ్గించాలి పోలవరం ఎత్తు తగ్గించి నిర్మించాలి. ఎత్తు పెంచితే బ్యాక్‌వాటర్‌తో రాష్ట్రంలోని గిరిజన గ్రామాలు మునిగిపోతాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద 130 మీటర్ల ఎత్తుకు అనుమతులు పొంది, ఇప్పుడు 160 మీటర్ల ఎత్తులో నిర్మించే ప్రయత్నం చేయడం తగదు. – చందా లింగయ్య దొర,జాతీయ ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్ -
‘గవ్వలసరి’ అయ్యేనా..?
పొగిళ్ల..చందంపేట మండలంలోని ఓ మారుమూల పల్లె. అక్కడ అంతా గిరిజనులే. భూమి ఉంది..పక్కనే కృష్ణానది జల సవ్వడులు. కానీ సాగునీరు లేదు. తాగేందుకూ దొరకని పరిస్థితి. దీనిని అధిగమించేందుకు బ్యాక్‌వాటర్‌నుంచి నీటిని తీసుకునేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టే గవ్వలసరి. కానీ ఇది ప్రతిపాదనలకే పరిమితం కావడంతో గిరిజనులు వలసబాట పడుతున్నారు. – చందంపేట చందంపేట (దేవరకొండ) : చుట్టూ ఆకుపచ్చని వర్ణం... పక్కనే కృష్ణమ్మ పరవళ్లు... గిరిజన సంస్కృతి... ఇవన్నీ గవ్వలసరి గ్రామం సొంతం... కానీ ఈ ప్రాంతంలో వలసలు తప్పడం లేదు... ఉన్న ఇళ్లు, పొలా లను వదులుకొని ఇతర ప్రాంతాలకు గిరిజనులు వలసపోతున్నారు. ఇందుకు కారణం సాగు, తాగునీరు అందకపోవడమే. జిల్లాలోనే మారుమూల గిరిజన ప్రాంతం చందంపేట. సు మారు 90 శాతం మంది గిరిజనులే ఉన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులంతా వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం సాగిస్తుం టారు. వ్యవసాయ సాగుకు నీరు లేకపోవడం, వర్షాలు సంవృద్ధిగా కురువకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మళ్లీ అప్పులు చేయలేక పొట్ట చేతపట్టుకొని వలసబాటపడుతున్నారు. నాగార్జునసాగర్ వెనుక జలాలను ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో సాగు, తాగు నీరు అందకపోవడంతో ఒక్కో రైతు సుమారు పదికి పైగా బోర్లు వేసి నీరు పడకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాడు. దీనికి ప్రత్యామ్నాయ మార్గమైన గవ్వలసరి ప్రాజెక్టును నిర్మిస్తే మూడు వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నా రు. గత ఏడాది ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పొగి ళ్ల స రిహద్దుల్లోని నాగార్జునసాగర్ వెనుక జలాల్లో మరబోటులో ప్ర యాణించి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. గవ్వలసరియే ప్రత్యామ్నాయం పొగిళ్ల గ్రామ సమీపంలోని లోతట్టు ప్రాంతంలో గవ్వలసరి వద్ద కృష్ణా బ్యాక్ వాటర్ ప్రవహిస్తుంది. ఏడాది పొడవునా ఈ ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలోనే గవ్వలసరి ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనలుఉన్నాయి. గవ్వలసరి ప్రాజెక్టు నుంచి పొగిళ్ల, రేకులవలయం, ఉస్మాన్‌కుంట, కంబాలపల్లి, గువ్వలగుట్ట, మంగళితండా, సర్కిల్‌తండా, చౌటుట్ల, చాపలగేటు, యల్మలమంద, దేవరచర్ల, యాపలపాయతండా, రేకులగడ్డ, నేరుట్ల, మంగళితండా, పెద్దమ్మగడ్డతం డా, బిల్డింగ్‌తండా, కాచరాజుపల్లి గ్రామాల్లోని ఆయా చెరువులకు నీటిని అందించి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న కరువును పారదోలేందుకు గవ్వలసరి ప్రాజెక్టు ఒక్కటే ప్రత్యామ్నాయం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావన ఇదే విషయమై గత శీతాకాల సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరిశ్‌రావు దృష్టికి కూడా ఎమ్మెల్యే తీసుకెళ్లారు. వారు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారని పలు సభల్లో, సమావేశల్లో కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉంది గవ్వలసరి ప్రాజెక్టు కోసం నా శాయశక్తులా కృషి చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగు నీటికి ఇబ్బందులు తీరతాయి. వ్యవసాయన్నే నమ్మకున్న రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రభుత్వం కూడా గవ్వలసరి ప్రాజెక్టు పట్ల సానుకూలంగా ఉంది. – రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్యే -
వారంలోగా కేసీకి బ్యాక్‌వాటర్
నందికొట్కూరు: వారం రోజుల్లోగా కేసీ కెనాల్‌కు శ్రీశైలం బ్యాక్ వాటర్ విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. శనివారం ఆయన మండల పరిధిలోని మల్యాల వద్ద కేసీ కెనాల్‌కు నీరిచ్చేందుకు చేపట్టిన పనులను ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అశోకరత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ ఆయకట్టు రైతులకు నీటి సమస్య తలెత్తకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వచ్చే శనివారంలోగా నీటిని విడుదల చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పనుల పరిశీనలో ఎంపీపీ ప్రసాదరెడ్డి, కౌన్సిలర్లు మరియమ్మ, ముర్తుజావలి, సత్తార్‌మియ్యా, టీడీపీ నాయకులు పలచాని మహేశ్వరరెడ్డి, గిరీష్‌రెడ్డి తదితరులున్నారు. -
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో మునిగిన పుష్కర రోడ్డు
రూ. 1.50 కోట్ల ప్రజా ధనం వృథా నెహ్రూనగర్(పగిడ్యాల): కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన నెహ్రూనగర్ పుష్కర రోడ్డు శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో మునిగి కొట్టుకుపోయింది. నెహ్రూనగర్ క్రాస్ రోడ్డు నుంచి మూర్వకొండ బురుజులు నది ప్రదేశం వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో బీటీ రోడ్డు, మట్టి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం రూ. 1.50 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులు పూర్తి చేయించారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి కష్ణానదికి వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం డ్యాంకు భారీగా నీరు వచ్చి చేరుకుంది. డ్యాం నుంచి విస్తరించిన బ్యాక్‌వాటర్ గోకరాజు కుంట మీదుగా బురుజుల వరకు వేసిన మట్టిరోడ్డుకు తగిలింది. ఉద్ధతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహానికి రోడ్డు కోతకు గురైంది. అధికారులు అనాలోచితంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి నీటి మునక ప్రదేశంలో రోడ్లు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. -
మునిగిన భూములు
అందని పరిహారం పట్టించుకోని భూసేకరణ అధికారులు అధికారి తప్పిదం..రైతులకు శిక్ష ఎనిమిదేళ్లుగా జాడలేని రీసర్వే వెల్గటూరు : పరిహారం అందకుండానే వ్యవసాయభూములు నీట మునిగాయి. కొన్ని భూములు మునకుండా కనిపిస్తున్నా చుట్టూ నీరు చేరడంతో వెళ్లేందుకు దారి లేదు. దీంతో సాగు చేసుకోలేక, పరిహారం రాక మండలంలోని కోటిలింగాల, ముక్కట్రావుపేట రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క అధికారి తప్పిదంతో దాదాపు 31 మంది రైతులు అయోమయంలో పడ్డారు. రీసర్వే చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పరిహార ం అందక, సాగు చేసుకోలేక దిక్కులు చూస్తున్నారు. చిన్న పొరపాటు మండలంలోని వెల్గటూరు, ముక్కట్రావుపేట, పాషిగాం కోటిలింగాల గ్రామాలకు చెందిన రైతుల భూములు వెల్గటూరు, ముక్కట్రావుపేట శివారులో ఉన్నాయి. వెల్గటూరు శివారులో సుమారుగా 25 ఎకరాల వరకు పట్టా భూములు ఉన్నాయి. ఈపట్టా భూములను ఎనిమిదేళ్ల క్రితం అప్పటి సర్వేయర్ రామాచారి కొలతలు వేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ భూముల్లో నుంచి కోటిలింగాలకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు ఉంది. ఈ రోడ్డుకు పోయిన ప్రభుత్వ భూమిని తీసి వేయకుండానే సర్వే చేసి పంపారు. తప్పు గమనించిన ఉన్నతాధికారులు పరిహారం చెల్లించకుండా ఫైల్ నిలిపేశారు. తిరిగి సర్వే చేసి పంపించాల్సిన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి దీని గురించి పట్టించుకున్న వారు లేరు. ఫలితంగా రైతులు దిక్కులు చూస్తున్నారు. పెద్దవాగు తీరం వెంబడి 31 మంది రైతులకు సుమారు 31 ఎకరాల పరంపోగు భూమి ఉంది. వీటిని ఇప్పటికీ అధికారులు సర్వే చేయలేదు. ఈ భూములు ప్రస్తుతం జలగర్భంలో కలిసిపోయాయి. పరిహారం విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపానపోలేదు. ఉన్న కొద్దిపాటి భూమి ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌లో పోయిందని.. తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూనీరు మధ్యలో భూమి బ్యాక్‌వాటర్ పల్లపు ప్రాంతాల నుంచి వచ్చి వ్యవసాయ భూములను ముంచి వేస్తుంది. కోటిలింగాల గ్రామంలో కొన్ని చోట్ల భూమి మునకుండా కనిపిస్తుంది. దీనికి పరిహారం ఇవ్వలేదు. సాగుచేసుకుందామంటే అటు చుట్టూ నీరు చేరింది. ఆ భూమిని కూడా ప్రభుత్వం సేకరించి పరిహారం చెల్లించాలని రైతులు రాపాక శ్రీనివాస్, దాసరి పోచయ్య కోరుతున్నారు. రెండెకరాలు మునిగింది నాకున్న రెండెకరాలు నీటిలో మునిగిపోయింది. పైసలు రాలేదు. అధికారులు రెండుసార్లు వచ్చి సర్వే చేసిండ్రు. మా బాధను ఎవరికీ చెప్పినా పట్టించుకుంటలేరు. – తిరుపతి, వెల్గటూరు -
కోటిలింగాలలో పెరిగిన వరద ఉధృతి
భయం గుప్పిట్లో నిర్వాసితులు వెల్గటూరు : మండలంలోని కోటిలంగాలను ఎల్లంపల్లి వరద ఉధృతి ముంచెత్తుతోంది. రోజురోజుకు నీటిమట్టం పెరుగుతుండడంతో నిర్వాసితులు భయంగుప్పిట్లో గడుపుతున్నారు. ఎప్పుడు ఏ విష పురుగులు ఇళ్లలోకి చేరుకుంటాయోనని భయాందోళన చెందుతున్నారు. కొందరు స్వయంగా ఇళ్లను వదిలి వెల్గటూర్‌లో అద్దెకుంటున్నారు. నదీతీరంలోని ఆలయం ఎదుట విద్యుత్ స్తంభానికి వేసిన 146 ఎఫ్ఆర్ఎల్ స్థాయికి వరద నీరు చేరుకుంటోంది. పుష్కరఘాట్లు మునిగిపోయాయి. వరద ప్లాట్‌ఫాంపైన బట్టలు మార్చుకునే గదులను ముంచెత్తి ఆలయ సమీపంలోకి చేరుకుంది. పెద్దవాగులో బ్యాక్ వాటర్ పెరిగి పంట పొలాలను ముంచెత్తింది. ఊరు చుట్టూ ఉన్న పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. గ్రామంలోకి వచ్చే ప్రధాన రహదారిపై ఉన్న అలుగు ఒర్రె వంతెన ఈ రాత్రికి మునిగిపోయేలా ఉంది. ఈ వంతెన మునిగితే గ్రామంలోకి రాకపోకలు స్తంభించిపోతాయి. ఇలాగే ఉంటే గ్రామంలో కలరా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అధికారులు మాత్రం ఐదు ఇళ్లు మాత్రమే ప్రమాదపుటంచున్న ఉన్నాయని ఆ కుటుంబాలనే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం అందరినీ తరలించాలని కోరుతున్నారు. -
భయం.. భయంగా..
పాశిగామ... గోదావరి తీరంలో చిన్న గ్రామం. 1994లో వచ్చిన గోదావరి వరదలతో పంటలు, ఇళ్లు మునిగిపోయాయి. ఆ బాధ ఇప్పటికీ వాళ్ల క ళ్ల ముందు కదలాడుతూనే ఉంది.. ఆ చేదు జ్ఞాపకాలనుంచి తేరుకోకముందే మళ్లీ ఎల్లంపెల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ రూపంలో భయపెడుతోంది. ప్రాజెక్టు నిండినప్పుడు 500 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. తమను ముంపు గ్రామం జాబితాలోకి చేర్చాలంటూ ధర్మపురి మండలం పాశిగామ గ్రామస్తులు కొన్నాళ్లుగా కోరుతున్నారు. వారి బాధలు తెలుసుకోవడానికి ప్రభుత్వ చీఫ్ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొప్పుల ఈశ్వర్ : అందరికీ నమస్కారం.. మీ ఊళ్లో ఉన్న సమస్యలేంటి? అత్తె వెంకన్న : ఎల్లంపెల్లి ప్రాజెక్టు నీళ్లు చేరి మా గ్రా మం మునిగిపోతుందని సర్వేలు చేసిండ్రు. సుమారు 500 ఎకరాలు ముంపులో పోతున్నయ్. ఈ ఊరు మొత్తాన్ని ముంపు కింద తీసుకుని ఆదుకోవాలి. కొప్పుల ఈశ్వర్ : అమ్మా.. నీపేరేంటి ? నీ బాధ ఏంటి చెప్పమ్మా? కంటెం లక్ష్మి : మూణ్ణెళ్ల నుంచి మంచి నీళ్లు దొరకక క ట్టపడుతున్నం. ఊళ్లె చేద బావులు, బోరింగులు ఎం డిపోయాయి. మంచినీళ్లు దొరకక బాధపడుతున్నం. గ్రామపంచాయతీ వాళ్లు ఇస్తున్న నీళ్లు సగం ఊరికి కూడా సరిపోతలేవు. బోరింగ్ వేసి ఆదుకోవాలి. కొప్పుల ఈశ్వర్ : తాతా.. నీకు పింఛన్ అత్తుందా? శంకరయ్య : పింఛన్ అత్తలేదు బాంచెన్. మా ఊళ్లె నాతోటోళ్లకు పింఛన్ అత్తుంది. నాకు అత్తలేదు. నాకు పింఛన్ ఇప్పియ్యాలె సారు. కొప్పుల ఈశ్వర్ :అవ్వా.. నీ సమస్యేంటి ? లక్ష్మీనర్సవ్వ : ఎల్లంపెల్లి నీళ్లు మా ఊరికి దగ్గరగా అచ్చినయి. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నం. పాములు, తేళ్లు ఇండ్లళ్లకు చేరుతున్నయ్. పాములు కుట్టి ఇప్పటికి నలుగురు మనుషులు, ఎడ్లు, బర్రెలు సచ్చిపోతున్నయ్. ముంపుకింద మా ఊరును తీసుకోవాలె బాంచెన్. కొప్పుల ఈశ్వర్ : ఏం.. ఎంపీటీసీ బాగున్నావా .. మీ ఊరు సమస్యలేంటి ? ఈర్ల మొండయ్య, ఎంపీటీసీ : ఇంతకుముందు ప్రభుత్వాలు మా గ్రామాన్ని పట్టించుకోలేదు. అందుకే ఎండాకాలం రాక ముందే నీళ్లకు క ట్టపడుతున్నాం. రోడ్లు లేవు. ఇన్ని రోజులు కరెంటు గురించి పట్టించుకునేటోళ్లు లేరు. తెలంగాణా గవర్నమెంటులోనైనా ప్రజల బాధలను పట్టించుకోవాలె. కొప్పుల ఈశ్వర్ : బాబూ.. ఏం పని చేస్తన్నవ్? నీ సమస్యేంటి? కంటెం తిరుపతి : మాఊర్లో కరెంటు వైర్లతో భయంగా ఉంది. ఇండ్లమీది నుంచి పెద్ద లైను పోయింది. దాంతో దినదినం భయంగా ఉంది. గాలి బాగా వచ్చినప్పుడు తీగలు తెగి మా ఇండ్ల పైన పడేట్టు ఉన్నయ్. లైను ఊరి నుంచి పక్కకు మార్చాలి. కొప్పుల ఈశ్వర్ : రోడ్ల వసతులు ఎట్లున్నయ్? కంటెం మల్లయ్య : గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి రావాంటే నరక యాతన పడుతున్నం. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. పెద్దరోడ్డు నుంచి కోటిలింగాల ఎక్స్‌రోడ్డు వరకు పంట పొలాల్లో నుంచి రోడ్డును మంజూరు చేయాలె. కొప్పుల ఈశ్వర్ : మేడమ్.. పాఠశాలలో సమస్యలున్నాయా ? రమాదేవి, ప్రభుత్వ టీచర్ : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీలేదు. పలువురు స్కూల్ పరిసరాల్లోకి మూత్రవిసర్జన చేస్తున్నారు. బోధనకు ఇబ్బంది అవుతోంది. కంపౌండ్ వాల్‌కు నిధులు మంజూరు చేయాలి. కంపౌండ్ లేక పాఠశాలలో మద్యం సేవిస్తూ ఇబ్బందులు కల్గిస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ : బాబూ... నీబాధేంటి ? ఎంబటి శంకరయ్య : మా గ్రామాన్ని ముంపుకింద చేర్చుతామని, నష్టపరిహారం ఇప్పిస్తామని కొందరు ఇంటికి పదివేల నుంచి ముప్పై వేల రూపాయలు దాకా వసూల్ చేసిండ్రు. ఆరు నెలల్లో పనవుతుందన్నారు. వసూలు చేసి రెండేండ్లరుుతంది. పైసలు ఇత్తలేరు. పని జేత్తలేరు. మా పైసలు మాకు ఇప్పించాలి. మమ్మల్ని ముంపు గ్రామం కింద చేర్చాలె. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా.. అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్న పాశిగామను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. గత పాలకుల నిరంకుశ నిర్లక్ష్యపు ధోరణి తో నేడు చాలా గ్రామాలు తాగునీ టికి అల్లాడుతున్నాయి. స్థానికులు మూడునెలలు గా అవస్థలు పడుతున్నారు. సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసరమైన చోట బోర్‌వెల్స్ వేసి తాగునీటి అవసరాన్ని తీరుస్తాం. గ్రామంలో ఎల్లంపెల్లిప్రాజెక్టు కింద 400ఎకరాల భూమి ము ంపునకు గురై ప్రజలు ఉపాధిని కోల్పోయి ఇబ్బం దులు పడుతున్నారు. వారి సమస్యలు తీరుస్తా. ఎల్లంపెల్లి నీటితో ముంపునకు గురవుతున్నందున ముంపు గ్రామాల జాబితాలో చేర్చడానికి కృషిచేస్తా. జాతీయరహదారి నుంచి గ్రామంలోకి రోడ్డు సౌకర్యం కల్పిస్తా. తాగునీటి వసతుల కోసం సత్వరం బోరింగులు ఏర్పాటు చేసి తాగునీరందిస్తాం. అర్హులందరికీ పింఛన్లు అందించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతా. -
మన్నెం.. చిన్నాభిన్నం
చింతూరు: పోలవరం ముంపులో భాగంగా మండలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడంతో చింతూరు కేంద్రంగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల అనుసంధానమెలా అనేదానిపై స్పష్టత కొరవడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దులు బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురవుతాయి. ఇప్పటివరకు ఈ రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న రహదారులు సైతం ముంపునకుగురై కనుమరుగు కానున్నాయి. ఇందులో విజయవాడ, జగ్దల్పూర్ జాతీయ రహదారి-30, ఎర్రంపేట, మల్కనగిరి జాతీయ రహదారి-360తో పాటు చట్టి, రాజమండ్రి ఆర్అండ్బీ రహదారులున్నాయి. {పస్తుతం చింతూరు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో ఆంధ్రకు చిడుమూరు, తెలంగాణకు భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌కు కుంట, ఒడిశాకు మోటులు సరిహద్దులు అవుతాయి. నెల్లిపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ప్రజలు వ్యాపారలావాదేవీలతో పాటు ఇతర పనుల నిమిత్తం చింతూరు మీదుగానే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లాలి. ప్రస్తుతం రాకపోకలు సాగుతున్న ఈ రహదారులన్నీ బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా రహదారులను అనుసంధానం (కనెక్టివిటీ) చేయాలి. తెలంగాణ నుంచి రహదారి అనుసంధానానికి చింతూరు మండలం సింగన్నగూడెం నుంచి చింతూరు శబరినది వంతెనను కలుపతూ ఎర్రంపేటకు బ్యాక్‌వాటర్‌పై రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి రహదారి అనుసంధానానికి ఆ రాష్ట్రంలోని వింజరం నుంచి చింతూరు శబరినది వంతెన వరకు రహదారి నిర్మించాలి. ఒడిశా నుంచి రహదారి అనుసంధానానికి మోటు, కల్లేరు మీదుగా ఎర్రంపేటకు రహదారి ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతాలన్నీ పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురవుతుండటంతో రహదారులు ఎలా నిర్మిస్తారనే అనే దానిపై సందిగ్ధత నెలకొంది. బ్యాక్‌వాటర్ నీటి పైనుంచి ఫ్లైఓవర్లు నిర్మిస్తేనే రహదారులను అనుసంధానం చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి అనునిత్యం వందలాది వాహనాలు చింతూరు మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. బ్యాక్‌వాటర్‌పై రహదారుల అనుసంధానం చేయకపోతే రవాణా వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని వాహనదారులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ చింతూరు మండలం కల్లేరు, మల్కనగిరి జిల్లా మోటుల నడుమ నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణం ఇంతవరకు ప్రారంభం కాలేదు. రూ.11 కోట్ల ఎల్‌డబ్ల్యూఈఏ నిధులతో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి డిజైన్ అప్రూవల్ ఆలస్యం కావడంతో ఇప్పటికే కాలపరిమితి తీరిపోయినా వంతెన నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. ఇక్కడ ప్రస్తుత డిజైన్‌తో వంతెన నిర్మాణం చేపట్టినా పోలవరం ముంపనకు గురయ్యే అవకాశముండటంతో వంతెన ఎత్తు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. కదలిక లేని అధికారులు? చింతూరు మండలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కలవడంతో ఇకపై ఈ మండలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. ఈ మండలం తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లడంతో ఆ జిల్లా అధికారులు రహదారుల అనుసంధానంపై సర్వే చేపట్టి నివేదికలు ఇవ్వాలి. కానీ ఇంతవరకు అలాంటి ప్రయత్నాలు ఎక్కడా జరగలేదు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందే రహదారుల నిర్మాణం జరగాలని లేదంటే బ్యాక్‌వాటర్‌తో ప్రస్తుత రహదారులు ముంపునకు గురయ్యే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే రవాణాపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రజలు వాపోతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించి రహదారుల అనుసంధానంపై సర్వేలు చేపట్టి త్వరితగతిన నిర్మించాలని కోరుతున్నారు. -
ఫి(ని)ష్!
ఇది అక్రమ వేటగాళ్ల నుంచి మత్స్య శాఖ అధికారుల వరకూ అందరికీ తెలిసి సాగుతున్న ‘పచ్చి’ అక్రమ వ్యాపారం. కళ్లెదుటే సాగుతున్న ఈ దందాను అధికారులు చూసీచూడనట్లున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వేటగాళ్లను రప్పించి యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగించడం కొందరు ‘దొంగ’ వ్యాపారులకు నిత్యకృత్యమైంది. సాక్షి, కడప: ఒంటిమిట్ట మండలం కుడమలూరు బ్యాక్‌వాటర్‌లో చేపలవేట సాగుతోంది. కొందరు సొసైటీగా ఏర్పడి హైకోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకుని చేపల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ కొందరు నిబంధనలకు విరుద్ధంగా చేపల అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నిబంధనల మేరకు అలివి వలతో చేపలు పట్టకూడదు. ఈ వలతో పడితే చిన్నచేపలు చిక్కుతాయి. దీంతో చేపల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అందువల్ల అలివి వలను ప్రభుత్వం నిషేధించింది. అయితే ఇక్కడ కొందరు అక్రమ వ్యాపారులు అలివి వలను ఉపయోగించి వేటను సాగిస్తున్నారు. చిన్నచేపలను వదలకుండా వాటిని ఎండబెట్టి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో వ్యాపారం: కుడమలూరు బ్యాక్‌వాటర్‌లో చేపలను పట్టేందుకు కాకినాడ, వైజాగ్, కలువాయి తదితర ప్రాంతాల నుంచి జాలర్లను రప్పిస్తారు. రోజూ 2-3 టన్నుల చేపలను పట్టి ఎగుమతులు చేస్తారు. సొసైటీ సభ్యుల నుంచి కిలో 30-60రూపాయల(రకాలను బట్టి)కు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు మాత్రం కిలో 100-200 రూపాయల వరకూ విక్రయిస్తారు. ఇలా రోజూ రెండు లక్షల రూపాయల వ్యాపారం ఇక్కడ సాగుతోంది. అలివి వలతో పట్టడం వల్ల దొరికే చిన్నచేపలను ఎండబెడతారు. పచ్చిచేపలను కలకత్తాకు, ఎండుచేపలను విజయవాడకు ఎగుమతి చేస్తారు. రొయ్యలైతే నెల్లూరుకు సరఫరా చేస్తారు. ఈ వ్యవహారం సొసైటీ సభ్యులకు సంబంధం లేకుండా కొందరు రాజకీయ నేతల అండతో సాగిస్తున్నారు. దీంతో తాము కూడా నిబంధనలను బేఖాతరు చేస్తే ఏంటని కొందరు సొసైటీ సభ్యులు కూడా అలివి వలను వినియోగిస్తున్నట్లు తెలిసింది. అధికారులకు తెలిసే తతంగం: అక్కడ జరిగే అక్రమ చేపల వ్యాపారం ఓ చేపల అభివృద్ధి అధికారి కనుసన్నల్లోనే జరుగుతోందని తెలుస్తోంది. వ్యాపారుల నుంచి ఈయనకు ప్రతి నెలా మామూళ్లు అందుతాయని, అందుకే అతను ఈ ప్రాంతంలో ఏం జరిగినా పట్టించుకోరనే విమర్శలున్నాయి. ఇటీవల కొంత మొత్తం తీసుకున్నారనే ఆరోపణలపై ఇతనిపై విచారణ కూడా నడుస్తోందని సమాచారం. చేపల అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులే అక్రమ వ్యాపారానికి అండగా నిలిస్తే ఎలా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇక్కడ చేపల తూకానికి పాతరకం రాళ్లను వినియోగిస్తున్నారు. తూనికలు, కొలతలశాఖ ఆమోదంతో ఉన్నవి కాదు. సొసైటీ సభ్యులకు అన్యాయం జరుగుతోంది. నివారిస్తాం...: హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని చేపలు పడుతున్నారు. అయితే అలివి వలను వినియోగించడం, చిన్నచేపలను పట్టడం నిషేధం. ఇటీవల నేను వెళ్లి పరిశీలించి వచ్చాను. నాకు అలివి వలలు కనపడలేదు. నాకు ముడుపులు అందుతున్నాయనేది వాస్తవం కాదు. అక్రమవేట నివారణకు చర్యలు తీసుకుంటాం. రెడ్డయ్య, ఎఫ్డీఓ(చేపల అభివృద్ధి అధికారి) తక్షణ చర్యలు తీసుకుంటాం: అలివి వలల వినియోగం, చిన్నచేపలు పట్టడం, అక్రమ జాలర్లు రావడం నా దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. అక్రమ వ్యాపారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తక్షణ నివారణ చర్యలు తీసుకుంటాం. -హీరానాయక్, ఏడీ, మత్స్యశాఖ. -
పెరుగుతున్న వెనుక జలాలు
రాజంపేట, న్యూస్‌లైన్ : జిల్లాలో సోమశిల బ్యాక్ వాటర్ తాకిడి క్రమక్రమేణా పెరుగుతూ వస్తోంది. ముంపు గ్రామాల సమీప ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మొన్నటి వరకు వెనుకజలాలు బాగా తగ్గిపోయాయి. కృష్ణజలాలు విడుదలైన క్రమంలో పెన్నానదిలో నీటి ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. దీంతో గుండ్లమడ వద్దకు చేరుకొని చెయ్యేరునదిలోకి కూడా వెనుకజలాలు, పెన్నా వాటర్ మిళితమై వెనక్కి వస్తున్నాయి. కృష్ణజలాలు విడుదలైన తొలిరోజుల్లో 269 కాంటూరు వద్ద జలాలు ఉన్నాయి. ఇప్పుడు వెనుకజలాలు పెరుగుతుండటంతో 303 కాంటూరు లెవల్‌కు చేరుకుంది. జలాశయాన్ని పూర్తి సామర్థ్యంతో నింపితే జిల్లాలో 340 కాంటూరు వరకు వెనుకజలాలు చేరుకుంటాయి. వర్షాలతో సోమశిలకు వరదనీరు రాయలసీమ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సోమశిల జలాశయం వరద ప్రవాహం పెరుగుతోంది. శనివారం కన్నా మంగళవారం సాయంత్రం ఇన్‌ఫ్లో పెరిగింది. జలాశయం నుంచి అవుట్‌ఫ్లో 4,113 క్యూసెక్కులు తెలుగుగంగకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 34.290 టీఎంసీలకు చేరుకున్నట్లు సమాచారం. జలాశయం ఎగువ భాగం ఉన్న నంద్యాల సమీపంలో రాజోలు బండ వద్ద కుందూ నది 4వేల క్యూసెక్కుల వంతున ప్రవాహిస్తోంది. ఆదినిమ్మాయపల్లె వద్ద 8000 క్యూసెక్కులు నీరు విడుదల జరుగుతోంది. చెన్నూరు గేజి వద్ద సాయంత్రానికి 8, 500 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. బద్వేలు సమీపంలోని సగిలేరులో 300 క్యూసెక్కులు నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలో ప్రస్తుతం 92.750 నీటిమట్టం వద్ద నీరు ఉంది. ముంపుగ్రామాల సమీపాల్లోకి వెనుకజలాలు జిల్లాలో ముంపుగ్రామాల సమీప ప్రాంతాల్లో వెనుకజలాలు తిష్టవేశాయి. నందలూరు మండలం కోనాపురం రాళ్లరేవు వద్దకు వెనుకజలాలు చేరుకున్నాయి. కొండమాచుపల్లె పంచాయతీ పరిధిలో కృష్ణమ్మ చెరువులోకి నీళ్లు వచ్చి చేరుకుంటున్నాయి. ఒంటిమిట్ట మండలం పాతమాధవరం, బోయనపల్లె, ఉప్పరపల్లె, కోటపాడు ప్రాంతాల్లోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు సోమశిల ముంపుగ్రామాల సమీపాల్లో జలకళ ఉట్టిపడుతోంది.