మణుగూరు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారగా, తెలంగాణాకు శాపమైంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద సుమారు రూ.50వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మూలంగా ఇరు రాష్ట్రాల్లోని వేల ఎకరాల సాగుభూమి, వందల కిలో మీటర్ల మేర అడవులు ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 50 లక్షల క్యూసెక్కులుగా డిజైన్ మార్చి, ఎత్తు 160 మీటర్లకు పెంచడంతో ముంపు ప్రభావం తెలంగాణాపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్రంలోని భారీ పరిశ్రమలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇరిగేషన్ శాఖా ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో అంచనాలు తయారు చేసి కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
బ్యాక్ వాటర్ ప్రభావం 124 కిలోమీటర్లు...
పోలవరం ప్రాజెక్టు మూలంగా తెలంగాణలోని 124 కిలోమీటర్ల మేర బ్యాక్‌వాటర్ ప్రవహిస్తుందని జలవనరుల అధికారులు అంచనాకు వచ్చారు. ప్రాజెక్టు డిజైన్ మార్పుతో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ముంపు ప్రభావం పడనుంది. భద్రాద్రి జిల్లాలో ఎక్కువ భాగం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన వేల ఎకరాల సాగుభూములు బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురి కానున్నాయి. జిల్లాలోని అశ్వాపురంలో గల మణుగూరు భారజల కర్మాగారం, బూర్గంపాడు మండలం సారపాక వద్ద గల ఐటీసీ, మణుగూరు మండల పరిధిలోని బొగ్గు బావుల వరకు బ్యాంక్ వాటర్ ప్రభావం పడుతుందని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లాలోని సుమారు 100 గ్రామాలు ముంపునకు గురవుతాయని, దేశవ్యాప్తంగా పేరున్న కర్మాగారాలు ముంపు బారిన పడనుండడంతో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి అంతరాష్ట్ర జలవనరుల విభాగం సమావేశంలో ప్రత్యేక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యం గల నీటిని స్టోరేజీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వద్ద అనుమతి పొందిన ఏపీ.. ఇప్పుడు డిజైన్ మార్చి 50 లక్షల క్యూసెక్కుల నీటిని స్టోరేజీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పునరధ్యయనం చేయాలి...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ డిజైన్ మార్పుతో పాటు డ్యామ్ ఎత్తు పెంచి 50 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో నిర్మాణం చేపడితే బ్యాక్ వాటర్ ప్రవాహంతో భద్రాద్రి జిల్లాలోని అధిక మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని రెండు మండలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సర్వే ఆఫ్ ఇండియా వద్ద గల మ్యాప్‌ల ఆధారంగా ఈ రెండు జిల్లాల పరిధిలో సాధారణ వర్షపాత నమోదు, బ్యాక్ వాటర్ ప్రవాహం మూలంగా లోతట్టున గల మండలాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై పునరధ్యయనం చేయాలని కోరింది.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో బ్యాక్ వాటర్ గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ముంపు ప్రాంతాల సమాచారం ఇరిగేషన్ శాఖాధికారుల వద్ద ఉంది. ముంపునకు గురయ్యే రెవెన్యూ గ్రామాలను ఇంకా గుర్తించలేదు. –రాంకిషన్, జేసీ
పోలవరం ఎత్తు తగ్గించాలి
పోలవరం ఎత్తు తగ్గించి నిర్మించాలి. ఎత్తు పెంచితే బ్యాక్‌వాటర్‌తో రాష్ట్రంలోని గిరిజన గ్రామాలు మునిగిపోతాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద 130 మీటర్ల ఎత్తుకు అనుమతులు పొంది, ఇప్పుడు 160 మీటర్ల ఎత్తులో నిర్మించే ప్రయత్నం చేయడం తగదు. – చందా లింగయ్య దొర,జాతీయ ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment