సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేసే ప్రసక్తే లేదని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. గోదావరి నదికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. 50 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుందని అధ్యయనం ద్వారా అంచనా వేసినట్టు గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మించక ముందు వరద నీటిమట్టం ఏ స్థాయిలో ఉంటుందో.. ప్రాజెక్టు నిర్మించాక కూడా అంతే ఉంటుందని ఆ అధ్యయనంలో వెల్లడైందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు ముంపుతోపాటు ఇతర సాంకేతిక అంశాలపై సందేహాలను నివృత్తి చేయడానికి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ సర్కార్‌లతో ఇప్పటికే రెండుసార్లు కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాయి. ఈ క్రమంలో సోమవారం సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా అధ్యక్షతన ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఒడిశా వాదనతో ఏకీభవించని సీడబ్ల్యూసీ
గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని.. దాన్ని పరిగణలోకి తీసుకుని పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా ఈఎన్‌సీ అశుతోష్ దాస్ చేసిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా తోసిపుచ్చారు. గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనడానికి ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఊహాజనితంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు.
ఎఫ్‌ఆర్‌ఎల్ చూపడానికి రెడీ
గత ఏడాది గోదావరికి జూలైలో వచ్చిన వరదలకు కిన్నెరసాని, ముర్రేడువాగు తదితర 30 వాగుల్లోకి పోలవరం బ్యాక్ వాటర్ ఎగదన్నడం వల్ల భద్రాచలం, మణుగూరు భారజల కర్మాగారం, 809 ఎకరాల భూమి ముంపునకు గురైందని తెలంగాణ ఈఎన్‌సీ నాగేంద్రరావు చెప్పడాన్ని ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఖండించారు. ప్రాజెక్టే ఇంకా పూర్తి కాలేదని.. నీటిని నిల్వ చేయకుండానే బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపునకు గురైందని ఊహాజనితంగా చెప్పడం సరైంది కాదన్నారు.
ఏపీ ఈఎన్‌సీ వాదనతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ ఛైర్మన్ వోరా గోదావరి ట్రిబ్యునల్ ఆమోదించిన మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు. గతేడాది జూలైలో వచ్చిన వరదలకు భద్రాచలం ముంపునకు గురైందని.. రక్షణ గోడలు నిర్మించాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరడంపై ఏపీ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 45.72 స్థాయిలో నీటిని నిల్వ చేస్తే.. ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని గుర్తిస్తూ సర్వే రాళ్లు వేశామని.. వాటి పరిధిలోకి భద్రాచలం, మణుగూరు రావని స్పష్టం చేశారు. కావాలంటే క్షేత్ర స్థాయిలో ఎఫ్‌ఆర్‌ఎల్ సర్వే రాళ్లు చూపించడానికి సంయుక్త సర్వేకు తాము సిద్ధమని తేల్చి చెప్పారు. కిన్నెరసాని, ముర్రేడువాగుతోపాటు మరో నాలుగు వాగులపై బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని తెలంగాణ ఈఎన్‌సీ చేసిన ప్రతిపాదనను ఏపీ ఈఎన్‌సీ తోసిపుచ్చారు.
పీపీఏ నేతృత్వంలో భేటీ
పోలవరం ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్ ముంపుపై ఏపీ, తెలంగాణ అధికారులతో ఈ నెల 10న సమావేశమై తెలంగాణ సందేహాలను నివృత్తి చేయాలని పీపీఏ చైర్మన్ శివనంద్‌కుమార్‌ను సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. రెండు రాష్ట్రాల అధికారులు ఎఫ్‌ఆర్‌ఎల్, ముంపుపై నివేదికలు సిద్ధం చేసి పరస్పరం మార్పిడి చేసుకుని చర్చించాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ అధికారుల సందేహాలు నివృత్తి కాకుంటే ఎఫ్‌ఆర్‌ఎల్ రాళ్లు గుర్తించడానికి సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని
ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment