సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిల్వ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే ఉండనున్న ముంపు ప్రభావాన్ని సూచించే ఎఫ్‌ఆర్‌ఎల్ సర్వే రాళ్లను గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న తెలంగాణ, ఏపీతో సమావేశం నిర్వహించాలని పీపీఏను ఆదేశించింది.
ముంపుపై ఇరు రాష్ట్రాలు గతంలో చేపట్టిన అధ్యయనాలు, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ అధికారుల సందేహాలు నివృత్తి కాకుంటే ఎఫ్‌ఆర్‌ఎల్ రాళ్లు గుర్తించడానికి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశించింది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేసే ప్రసక్తే లేదని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. గోదావరి నదికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. 50 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుందని అధ్యయనం ద్వారా అంచనా వేసినట్లు గుర్తుచేసింది.
సీడబ్ల్యూసీ చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన అన్ని రాష్ట్రాలతో సోమవారం మూడో సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ నీటిపారదుల శాఖ ఈఎన్‌సీ నాగేంద్రరావు, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, తెలంగాణ ఇంటర్ స్టేట్ బోర్డు గోదావరి డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్, ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి హాజరైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సైతం ముంపు ప్రభావంపై గోపాలకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పాయి. కొత్తగా అధ్యయనం చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి.
సమావేశంలో తెలంగాణ వాదనలు ఇవీ..
► ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం మేరకు నీటిని నిల్వ చేసినప్పుడు తెలంగాణ భూభాగంలో ముంపును గుర్తించాలి.
► డ్రైనేజీ, స్థానిక ప్రవాహాలు నిలిచిపోవడం వల్ల ఏర్పడే ప్రభావాలతోపాటు జూలై 2022లో వచ్చిన వరదలపై తాజాగా ఉమ్మడి అధ్యయనం చేపట్టాలి.
► మణుగూరు భార జల కేంద్రం, భద్రాచలం ఆలయ రక్షణకు చర్యలు చేపట్టాలి.
► కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. భ్రదాచలం పట్టణంలో 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్‌ల స్థాయిలను ధ్రువీకరించాలి.
► కిన్నెరసాని, ముర్రేడువాగుల్లోని వరద ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్‌వాటర్ అడ్డుపడడంతో స్థానికంగా ఏర్పడుతున్న ముంపు ప్రభావంపై ఎన్జీటీ ఉత్తర్వుల మేరకు సర్వే జరపాలి. వీటితో పాటు మరో ఏడు ఇతర పెద్దవాగులపై సర్వే చేయాలి.
► ఛత్తీస్‌గఢ్ తరహాలో ఏదైనా ఏజెన్సీతో పీపీఏ జాయింట్ సర్వేను తక్షణమే చేపట్టాలి. పూడిక ప్రభావం సహా నది క్రాస్–సెక్షన్లను కొత్తగా తీసుకొని ఉమ్మడి సర్వే చేసి ముంపును అంచనా వేయాలి.
► పోలవరం ప్రాజెక్టు కారణంగా 2022 జూలైలో తెలంగాణలో సంభవించిన వరదల ప్రభావాన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడం లేదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఆపరేషన్ షెడ్యూల్ నిబంధనలకు కట్టుబడి ప్రాజెక్టు పూర్తయ్యాక ఆ ప్రభావం ఉండదని వాదిస్తోంది. పోలవరం బ్యాక్‌వాటర్‌తో వరద ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే తర్వాత పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్, ఇతర నిపుణులతో వీలైనంత త్వరగా సంబంధిత మోడల్ అధ్యయనాలను చేయించాలి.
► ఆలోగా పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం, నిర్వహించడం చేపట్టకూడదు.
పోలవరం ముంపుపై 10న సమావేశం
Published Tue, Apr 4 2023 4:41 AM | Last Updated on Tue, Apr 4 2023 4:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment