కొచ్చి: నీళ్లల్లో రయ్‌మని దూసుకువెళ్లే మెట్రో వచ్చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో కేరళలో ప్రారంభం కానుంది. కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్‌తో నిండి ఉండే రాష్ట్రం. అక్కడ ప్రయాణాలంటే రోడ్లు, రైలు, ఆకాశ మార్గాలతో పాటు గమ్యస్థానం చేరుకోవడానికి నీళ్లలో కూడా ప్రయాణం తప్పనిసరి. అందుకే ఒక దీవి నుంచి మరో దీవికి చేరుకోవడానికి అన్ని హంగులతో కూడిన ఎలక్ట్రిక్ హైబ్రిడ్ పడవల్ని ప్రవేశపెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కొచ్చిలో ఈ వాటర్ మెట్రోని ప్రారంభిస్తారు.
ఈ మెట్రో కొచ్చి రవాణా రంగంలో ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుంది. కొచ్చి చుట్టుపక్కల పది దీవుల మధ్య వాటర్ మెట్రో ప్రయాణిస్తుంది. కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ మొత్తం ఎనిమిది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్స్‌ని తయారు చేసింది. వాటర్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఈ మెట్రోతో విప్లవాత్మక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. రవాణా, పర్యాటక రంగాలకు ఈ మెట్రో ఊతమిస్తుందని అన్నారు. జర్మనీ ఫండింగ్ ఏజెన్సీ కేఎఫ్‌డబ్ల్యూ, కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ.1,137 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment