Water Train
-
వాటర్ మెట్రో వచ్చేస్తోంది
కొచ్చి: నీళ్లల్లో రయ్‌మని దూసుకువెళ్లే మెట్రో వచ్చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో కేరళలో ప్రారంభం కానుంది. కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్‌తో నిండి ఉండే రాష్ట్రం. అక్కడ ప్రయాణాలంటే రోడ్లు, రైలు, ఆకాశ మార్గాలతో పాటు గమ్యస్థానం చేరుకోవడానికి నీళ్లలో కూడా ప్రయాణం తప్పనిసరి. అందుకే ఒక దీవి నుంచి మరో దీవికి చేరుకోవడానికి అన్ని హంగులతో కూడిన ఎలక్ట్రిక్ హైబ్రిడ్ పడవల్ని ప్రవేశపెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కొచ్చిలో ఈ వాటర్ మెట్రోని ప్రారంభిస్తారు. ఈ మెట్రో కొచ్చి రవాణా రంగంలో ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుంది. కొచ్చి చుట్టుపక్కల పది దీవుల మధ్య వాటర్ మెట్రో ప్రయాణిస్తుంది. కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ మొత్తం ఎనిమిది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్స్‌ని తయారు చేసింది. వాటర్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈ మెట్రోతో విప్లవాత్మక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. రవాణా, పర్యాటక రంగాలకు ఈ మెట్రో ఊతమిస్తుందని అన్నారు. జర్మనీ ఫండింగ్ ఏజెన్సీ కేఎఫ్‌డబ్ల్యూ, కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ.1,137 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. -
ముఖం చాటేసిన నైరుతి
వర్షాకాలం వచ్చేసింది. రైతు దుక్కి దున్ని ఆకాశంలోకి ఆశగా చూస్తున్నాడు. కానీ ఒక్క మబ్బు తునక కనిపించడం లేదు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సీజన్ వృథాయేనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దక్షిణ భారతంలో రైతులకు జులై నెల అత్యంత కీలకం. ఈ నెలలో వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంటోంది. ‘నైరుతి రుతు పవనాలు బలహీనపడి పోతున్నాయి. వచ్చే రెండు వారాల్లో మధ్య, దక్షిణ భారతంలో ఎక్కడా వానలు కురిసే అవకాశాల్లేవు’ అని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశం మొత్తమ్మీద చూస్తే 12 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో వానలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య భారతాల్లోని కొన్ని ప్రాంతాలు, గంగా పరీవాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బిహార్, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కశ్యపి పేర్కొన్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని ఆయన వివరించారు. మధ్య భారతంలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించిన తర్వాత తొలిసారిగా ఈ వారంలో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలో గత 50 ఏళ్ల సగటు తీసుకుంటే 28 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సోయాబీన్, పత్తి అధికంగా పండించే మధ్యభారతంలో 38 శాతం అధిక వర్షాలు కురిస్తే, వరి పండించే దక్షిణాదిన 20శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తీవ్రమవుతున్న నీటి సమస్య ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ బోర్లు బావురుమంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం దిగువకి పడిపోయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఒక్క వారం ఆలస్యంగా రావడంతో పాటు అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుఫాన్ ప్రభావం రుతుపవనాలపై పడింది. ఫలితంగా గత ఏడాదితో పోల్చి చూస్తే 27 శాతం వరకు విస్తీర్ణంలో పంటలు వేయడం తగ్గిపోయింది. ‘మన దేశంలో బంగారు పంటలు పండాలంటే వచ్చే రెండు, మూడు వారాల్లో అధికంగా వానలు కురవాలి. అప్పుడే జూన్‌లో తగ్గిన లోటు వర్షపాతం భర్తీ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదు’ అని భారత వాతావరణ శాఖకు చెందిన భారతి చెప్పారు. ఈ ఏడాది సరిగ్గా వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసే ప్రైవేటు సంస్థ స్కైమెట్ మే నెలలోనే ప్రకటించింది. చెన్నై చేరిన నీళ్ల రైలు చెన్నై: వెల్లూరులోని జోలార్‌పేటై నుంచి 25 లక్షల లీటర్ల నీటిని మోసుకుంటూ ఓ రైలు చెన్నైలోని విల్లివక్కమ్‌కు చేరుకుంది. ఈ రైల్లో మొత్తం 50 వ్యాగన్లు ఉండగా, ఒక్కో వ్యాగన్ సామర్థ్యం 50 వేల లీటర్లు. నీటిని శుభ్రపరిచేందుకు దాదాపు 100 పైపులను అమర్చి ప్లాంటుకు తరలిస్తున్నారు. శుద్ధి చేశాక పంపిణీ చేస్తామని చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు తెలిపారు. ఈ పంపిణీ ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాలు రావడానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది. దక్షిణ మెట్రోపోలీస్ నుంచి జోలార్‌పేటై 217 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీటి కొరతతో అల్లాడుతున్న చెన్నైకి నీటిని తరలించేందుకు సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వం రైల్వేను కోరిన నేపథ్యంలో ఈ రైలు వెల్లూరు జిల్లా నుంచి నీటితో చెన్నై చేరుకుంది. జోలార్‌పేటై నుంచి నీటిని తెచ్చి, కొరతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి రూ.65 కోట్లను కేటాయించారు. నీటి పంపిణీని తమిళనాడు మంత్రులు ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. చెన్నై నగరానికి రోజుకు 20 కోట్ల లీటర్లు నీరు అవసరం కాగా ఆ నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిన సంగతి తెలిసిందే. -
సీఎంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అహంకార దోరణితో వ్యవహరిస్తున్నారని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతి విమర్శించారు. తాగునీటి సరఫరా విషయంలో ఆమె యువ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. కేంద్రం ఈ మధ్య రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ నుంచి గురువారం ఓ రైలు నీటిని తీసుకెళ్తుండగా ఝాన్సీ ప్రాంతంలో నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర జోక్యం అనవసరమని, వారి ప్రమేయం ఎందుకంటూ అఖిలేశ్ వ్యాఖ్యానించడంపై ఉమా భారతి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాలు చేసేందుకు ఇవి తగిన అంశాలు కావని హితవు పలికారు. సీఎం అఖిలేశ్ చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, యూపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. నీళ్లు, ఆహారం లాంటి విషయాల్లో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టంచేశారు. వాటర్ తో రైలు రావడం, అడ్డగించడం విషయంపై తమ వద్ద సరైన సమాచారం లేదని జిల్లా కలెక్టర్ అజయ్ శుక్లా పేర్కొన్నారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీల నేతలు రాజకీయాలు మొదలుపెట్టారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
'ఛా.. దీన్ని కూడా వాడేసుకుంటున్నారు!'
లాతూర్: ఒకడి కష్టం మరొకడికి సంపాదన, పేరు ప్రతిష్టలు అంటే ఇదేనేమో. ప్రతి అంశాన్ని తమ ఎదుగుదలకు వాడుకోవడంలో రాజకీయ రంగానికి మించిన పరిశ్రమ మరొకటి లేదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ పక్క తీవ్రనీటి ఎద్దడి, కరువు, దాహార్తి విలయతాండవంలో లాతూర్ మునిగి ఉండగా అక్కడ రాజకీయం మాత్రం పచ్చగా కళకళలాడుతోంది. ఈ విషయం ఎంతో స్పష్టంగా కళ్లకు దర్శనమిచ్చింది. లాతూర్ నెలకొన్న కరువు నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ప్రత్యేక రైల్వే ట్యాంకర్లను నీటితో నింపి తరలించిన విషయం తెలిసిందే. ఈ రైలు కూడా సురక్షితంగా విజయవంతంగా ఆ ప్రాంతాన్ని చేరుకుంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా తమకు నీళ్లొచ్చాయండోయ్ అని సంబంరాల్లో మునిగి ఉండగా కొంతమంది మాత్రం తమ రాజకీయాలు తాము చేసుకుపోయారు. రైలు వ్యాగన్ అలా వచ్చి ఆగిందో లేదో వెంటనే బీజేపీ కార్యకర్తలు రైలు నీళ్ల ట్యాంకర్లపైకి ఎక్కి వాటికి ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో కూడా పోస్టర్లను అంటించి పార్టీ జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా తామేం తక్కువ కాదని లాతూర్ ప్రాంతంలోని తమ నాయకుల ఒత్తిడి వల్లే ఇది సాధ్యమైందని, తమ నాయకుల పోరాటం వల్లే ట్యాంకర్ల ద్వారా నేడు నీళ్లు వచ్చాయని బీజేపీకన్నా వేగంగా పోటీపడి ప్రచారం చేసుకుంటున్నాయి. ఏదేమైన కరువులు చేస్తున్న సాయాన్ని కూడా తమ క్రెడిట్ లోకి వేసుకోవాలని పార్టీలు ప్రయత్నించడం ఛీ కొట్టేలా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ట్యాంకర్లో 50 వేల లీటర్ల నీటిని నింపడం ద్వారా మొత్తం 50 లక్షల లీటర్ల నీటిని లాతూర్కు పది రైలు ట్యాంకర్లతో తరలించిన విషయం తెలిసిందే. పశ్చిమ మహారాష్ట్రలోని మిరాజ్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన ఈ రైలు మంగళవారం ఉదయం చేరుకుంది. -
లాతూర్ చేరుకున్న వాటర్ ట్రైన్
ముంబై: మరఠ్వాడ ప్రజలకు 50 లక్షల లీటర్ల నీటితో బయల్దేరిన వాటర్ ట్రయిన్ మంగళవారం ఉదయం లాతూర్ చేరుకుంది. తీవ్ర కరువు, నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న మరఠ్వాడలోని లాతూర్కు నీరు అందించేందుకు ఈ రైలు పశ్చిమ మహారాష్ట్రలోని మిరాజ్ రైల్వేస్టేషన్ నుంచి నిన్న బయల్దేరింది. పది వ్యాగన్లతో చేరుకున్న ఈ రైలును చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు లాతూర్కు తరలివచ్చారు. రైలులో చేరుకున్న నీటిని పైప్ లైన్ల ద్వారా తరలిస్తున్నారు. అక్కడి నుంచి త్వరలోనే నీటిని లాతూర్కు పంపిణీ చేయనున్నారు. కాగా భయంకర నీటి ఎద్దడిని పారదోలేందుకు మహారాష్ట్ర సర్కార్ నడుం బిగించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని కోట ప్రాంతం నుంచి కేంద్ర రైల్వేశాఖ సహాయంతో రైళ్లలో నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అక్కడ నుంచి 50 వ్యాగన్ల రైలు ఆదివారం మిరాజ్ కు చేరుకుంది. మరో 50 వ్యాగన్లతో కూడిన రెండో రైలు ఈ నెల 15న మిరాజ్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. మహారాష్ట్ర మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. ఇటు ముంబైలోనూ నీటి ఎద్దడి కొనసాగుతోంది. -
మహా దుర్భిక్షం: రైళ్ల ద్వారా మంచినీటి సరఫరా
తినడానికి గింజలులేవు.. కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా దొరకటంలేదు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వచ్చిన పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. పరిస్థితి విషమించి ఆసుపత్రులకు తీసుకెళితే డాక్టర్లు సైతం చేతులెత్తేసే పరిస్థితి. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క ఆసుపత్రిలోనూ నీళ్లు లేవు. అత్యవసర ఆపరేషన్లను సైతం వైద్యులు వాయిదావేస్తున్నారు. గడిచిన 100 ఏళ్లలో తీవ్ర దుర్భిక్షంగా భావిస్తోన్న మహారాష్ట్ర కరువుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి. వాస్తవ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మంచినీరు అందించేందుకు బృహత్ కార్యక్రమం చేపట్టింది మహారాష్ట్ర సర్కారు. రాజస్థాన్ లోని ఒక డ్యామ్ నుంచి రైలుద్వారా నీళ్లను తరలించేందుకు భారీ సన్నాహాలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా నీటి రవాణాకు వినియోగించే 60 బోగీల(ట్యాంకుల) రైలును ఏర్పాటుచేశారు రైల్వే అధికారులు. రాజస్థాన్ లోని మిరాజ్ డ్యామ్ నీళ్లను మోటార్ల ద్వారా ట్యాంకుల్లో నింపి కరువు కేంద్రం లాతూర్ పట్టణానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే డ్యామ్ నుంచి నీళ్లను నింపటం ఆసత్యమవుతున్నందున తొలి విడతగా 10 బోగీ(ట్యాంకు)లతో కూడిన రైలు ఆదివారం సాయంత్రం లాతూర్ కు బయలుదేరింది. శుక్రవారంలోగా మిగిలిన 50 బోగీల నీటిని కూడా తరలిస్తామని అధికారులు చెప్పారు. రైలు ద్వారా మొత్తం 5 లక్షల లీటర్ల నీటిని కరువు ప్రాంతానికి చేరవేయనున్నారు. మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్రదుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. ఇటు ముంబైలోనూ నీటి ఎద్దడి కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటివారానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక మే నెలలో అధికం కానున్న ఎండలకు ఎలా తట్టుకోవాలా? అని జనం బెంబేలెత్తిపోతున్నారు.