'ఛా.. దీన్ని కూడా వాడేసుకుంటున్నారు!'
లాతూర్: ఒకడి కష్టం మరొకడికి సంపాదన, పేరు ప్రతిష్టలు అంటే ఇదేనేమో. ప్రతి అంశాన్ని తమ ఎదుగుదలకు వాడుకోవడంలో రాజకీయ రంగానికి మించిన పరిశ్రమ మరొకటి లేదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ పక్క తీవ్రనీటి ఎద్దడి, కరువు, దాహార్తి విలయతాండవంలో లాతూర్ మునిగి ఉండగా అక్కడ రాజకీయం మాత్రం పచ్చగా కళకళలాడుతోంది. ఈ విషయం ఎంతో స్పష్టంగా కళ్లకు దర్శనమిచ్చింది. లాతూర్ నెలకొన్న కరువు నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ప్రత్యేక రైల్వే ట్యాంకర్లను నీటితో నింపి తరలించిన విషయం తెలిసిందే.
ఈ రైలు కూడా సురక్షితంగా విజయవంతంగా ఆ ప్రాంతాన్ని చేరుకుంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా తమకు నీళ్లొచ్చాయండోయ్ అని సంబంరాల్లో మునిగి ఉండగా కొంతమంది మాత్రం తమ రాజకీయాలు తాము చేసుకుపోయారు. రైలు వ్యాగన్ అలా వచ్చి ఆగిందో లేదో వెంటనే బీజేపీ కార్యకర్తలు రైలు నీళ్ల ట్యాంకర్లపైకి ఎక్కి వాటికి ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో కూడా పోస్టర్లను అంటించి పార్టీ జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కూడా తామేం తక్కువ కాదని లాతూర్ ప్రాంతంలోని తమ నాయకుల ఒత్తిడి వల్లే ఇది సాధ్యమైందని, తమ నాయకుల పోరాటం వల్లే ట్యాంకర్ల ద్వారా నేడు నీళ్లు వచ్చాయని బీజేపీకన్నా వేగంగా పోటీపడి ప్రచారం చేసుకుంటున్నాయి. ఏదేమైన కరువులు చేస్తున్న సాయాన్ని కూడా తమ క్రెడిట్ లోకి వేసుకోవాలని పార్టీలు ప్రయత్నించడం ఛీ కొట్టేలా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ట్యాంకర్లో 50 వేల లీటర్ల నీటిని నింపడం ద్వారా మొత్తం 50 లక్షల లీటర్ల నీటిని లాతూర్కు పది రైలు ట్యాంకర్లతో తరలించిన విషయం తెలిసిందే. పశ్చిమ మహారాష్ట్రలోని మిరాజ్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన ఈ రైలు మంగళవారం ఉదయం చేరుకుంది.