latur
-
కరోనా వైరస్: ఆ ఒక్కరి వల్ల..
సాక్షి, ముంబై: లాక్డౌన్ సమయంలో హరియానా నుంచి తిరిగొస్తూ మహారాష్ట్రలోని లాతూరు జిల్లా నీలంగాలో ఓ ప్రార్థన మందిరంలో పట్టుబడిన కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంత వాసులు 12 మందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరినీ లాతూరు సివిల్ ఆసుపత్రిలో క్వారంటైన్లో ఉంచారు. కోవిడ్ సోకిన వారికి అక్కడే చికిత్స అందజేస్తున్నారు. వారు చికిత్సకు సహకరిస్తున్నారని, కాకపోతే ప్రస్తుత పరిస్థితుల వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలుగు వారైన లాతూరు జిల్లా కలెక్టర్ జి.శ్రీకాంత్ ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యంగా వీరిలో ఒక్కరు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ఉండడంతో మిగతా వారికి కూడా కరోనా సోకిందని సమాచారం. ఈ 12 మంది గత ఏడాది డిసెంబరు 15న నంద్యాల నుంచి బయలుదేరి ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని పలు ప్రార్థనామందిరాలను సందర్శించారు. చివరకు హరియానాకు చేరుకున్నారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ నహూ జిల్లా ఫిరోజ్పూర్లో అధికారుల నుంచి పాస్ తీసుకుని రెండు వాహనాలలో ముందుకు సాగారు. ఈ నెల ఒకటవ తేదీ అర్ధరాత్రి లాతూరు జిల్లా నీలంగాలోని ప్రార్థనామందిరానికి చేరుకున్నారు. వీరి గురించి చుట్టుపక్కల వారు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. ఎనిమిది మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో అందరినీ ఆసుపత్రికి తరలించారు. లాతూరులోనే అడ్డుకోనట్టయితే నంద్యాల ప్రాంతంలో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండేది. -
వారి బాధలు అన్నీ ఇన్నీ కావు!
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని లాథూరు జిల్లాకు చెందిన కమలాభాయి దాల్వే ఆరు నెలల క్రి తం భర్తతో కలిసి తమ రెండు ఎకరాల పొలానికి వెళ్లింది. సాయంత్రం పూట ఇంటికెళ్లి కొన్ని బక్రీలు (మహారాష్ట్ర, గుజరాత్, గోవాలో ఎక్కువగా తినే ఒక రకమైన దిబ్బ రొట్టెలు) తీసుకరావాల్సిందిగా ఆమెను ఆమె భర్త కోరారు. ఆమె అలాగే ఇంటికెళ్లి అప్పటికప్పుడు దిబ్బ రొట్టెలు చేసి తీసుకొచ్చింది. ఈలోగా ఊహించని ఘోరం జరిగిపోయింది. పురుగుల మందు తాగి ఆమె భర్త చనిపోయి ఉన్నాడు. ‘కనీసం నాకు చనిపోవాలనిపిస్తోంది’ అని ఆయన నాతో ఏనాడు అనలేదు. గత రెండేళ్లుగా తమ పొలం ద్వారా ఎలాంటి రాబడి రాలేదని, తీసుకున్న రుణాలు రెండు, మూడు లక్షల రూపాయలకు పెరిగిపోయిందని ఆమె తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా ముంబై నగరానికి బుధవారం తరలివచ్చిన వేలాది మంది రైతుల్లో కమలాభాయి దాల్వే ఒకరు. మరాఠా, విదర్భ ప్రాంతాల నుంచి వచ్చిన 80 మంది వితంతువుల్లో కమలాభాయి ఒకరు. వారంతా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలు. రైతులను ఆదుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతూ వస్తోంది. ప్రతి ఏటా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 1995 నుంచి 2015 వరకు 65 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రాష్ట్రంలోని వితంతు మహిళలందరికి నెలకు 600 రూపాయలు పింఛను అందాల్సి ఉండగా, 34 శాతం మంది వితంతువులకు మాత్రమే పింఛను అందుతోంది. 33 శాతం మందికి ఈ పింఛను గురించి తెలియక దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకున్నా 26 శాతం మందికి అధికారులు కుంటి సాకులతో పింఛను తిరస్కరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పదేళ్ల క్రితం ప్రకటించిన లక్ష రూపాయల పరిహారమే ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణలో ఐదు లక్షల వరకు ఆంధ్రలో మూడున్నర లక్షల వరకు ఇలాంటి పరిహారాన్ని చెల్లిస్తున్న విషయం తెల్సిందే. మహారాష్ట్రలో బాధితులకు లక్ష రూపాయల పరిహారం కూడా సంక్రమంగా అందడం లేదు. భర్తఆత్మహత్య చేసుకున్నందుకు నష్టపరిహారంగా రెండు నెలల క్రితం తన బ్యాంకు ఖాతాలో 30 వేల రూపాయలు వచ్చి పడ్డాయని, ఇదేమిటని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పేవారే లేరని అన్నారు. ర్యాలీకి వచ్చిన 80 మంది వితంతువుల్లో 29 శాతం మందికి పొలాలు తమ పేర్ల మీద బదిలీ కాలేదు. వారిలో 43 శాతం మందికి చిన్నపాటి ఇళ్ల యాజమాన్య హక్కులు బదిలీ కాలేదు. వారిలో ఒక్కొక్కరి ఒక్కో సమస్య. ‘నా భర్త చనిపోయాక, నీవు కూడా పురుగుల మందు తాగి చనిపో లేదా పుట్టింటికి వెళ్లిపో’ అంటూ తన అత్తింటి వారు తరిమేశారని విదర్భ నుంచి మరో వితంతువు మీడియాకు తెలిపారు. వితంతు మహిళల తరఫున ప్రత్యేకంగా పోరాడుతున్న ‘మహిళా కిసాన్ అధికారి మంచ్’ వారిని ఇక్కడకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా 2012 నుంచి 2018 మధ్య ఆత్మహత్యలకు పాల్పడిన 505 మంది రైతుల భార్యలను ఇంటర్వూ చేసి రూపొందించిన ఓ నివేదికను కూడా మంచ్ ఇక్కడ విలేకరుల సమక్షంలో ఆవిష్కరించారు. -
బాలికతో బర్రె పెండ తినిపించారు..
లాతూర్: తాంత్రిక పూజల్లో భాగంగా బాలికతో బర్రె పెండ తినిపించిన సంఘటన కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో చోటుచేసుకున్న ఈ దుశ్చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాతూర్కు చెందిన 17 ఏళ్ల బాలిక కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె కుటుంబీకులు వైద్యుడికి చూపించాల్సిందిపోయి.. మంత్రగాళ్లను ఆశ్రయించారు. బాలికకు దెయ్యం పట్టిందని నిర్ధారించిన భూతవైద్యులు.. చికిత్సలో భాగంగా ఆమెచేత బలవంతంగా బర్రె పెండ తినిపించారు. గతవారం జరిగిన ఈ ఉదంతం మీడియా ద్వారా బహిర్గతం కావడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదుచేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. -
మృత్యుంజయ ముఖ్యమంత్రి
మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు తప్పిన ముప్పు ► ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ ► విద్యుత్ తీగలకు తగిలి గుడిసెపై కూలిపోయిన చాపర్ ► లాతూర్ జిల్లాలోని నీలాంగ పట్టణంలో ఘటన ► ఫడ్నవీస్ సహా ఆరుగురూ సురక్షితం సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లాతూర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ఫడ్నవిస్‌లో పాటు హెలికాప్టర్లో ఉన్న ఆరుగురూ సురక్షితంగా బయటపడ్డారు. రైతుల కోసం బీజేపీ చేపట్టిన ‘శివార్ సంవాద్ సభ’ కార్యక్రమంలో భాగంగా ఫడ్నవిస్ గురువారం లాతూర్ జిల్లాలోని నీలాంగ పట్టణానికి వచ్చారు. కార్యక్రమం ముగించుకుని 11.45 గంటలకు ముంబైకి బయలుదేరేందుకు హెలికాప్టర్లో కూర్చున్నారు. 11.58 నిమిషాలకు హెలికా ప్టర్ టేకాఫ్ అయ్యింది. టేకాఫ్ అయిన 50 సెకన్లలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు యత్నించా రు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న విద్యుత్ వైరుకు హెలికాప్టర్ బ్లేడ్లు తగిలి మంటలు లేచాయి. ఏం జరిగిందో తెలుసు కునేలోపే 50–60 అడుగుల ఎత్తు నుంచి దూసుకొచ్చిన చాపర్.. ఓ రేకుల గుడిసె, ఆ పక్కనే ఉన్న ట్రక్కుపై కూలింది. ఈ ఘటనలో గుడిసెలో ఉన్న ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. హెలికాప్టర్లో ఉన్నవారం తా క్షేమంగా బయటపడ్డారు. హెలికాప్టర్ ఎక్కువ ఎత్తులో లేకపోవడంతో పెను ప్రమా దం తప్పింది. ఈ ఘటనలో హెలికాప్టర్ దెబ్బతిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. దీనిపై పౌరవిమాన యాన శాఖ అధీనంలోని విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఐబీ) విచారణ చేపట్టనుంది. దేశంలో జరిగే విమాన ప్రమాదాలు, తీవ్ర ఘటనలకు సంబంధించిన కేసులను ఏఐబీ దర్యాప్తు చేస్తుంది. ప్రమాదంపై ఫడ్నవిస్ ట్వీట్..: ‘‘మేము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాతూర్‌లో ప్రమాదానికి గురైంది. నేను.. మా బృందం సురక్షితంగా ఉన్నాం. ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని సీఎం ఫడ్నవిస్ ప్రమాదం అనంతరం ట్వీటర్లో పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి రోడ్డు మార్గంలో లాతూర్కు చేరుకున్న ఫడ్నవిస్ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఫడ్నవిస్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ పర్దేశీ, వ్యక్తిగత సహాయకుడు అభిమన్యు పవార్, మీడియా సలహాదారు కేతన్ పాఠక్ ఉన్నారు. ‘‘11 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజల ఆశీస్సులతో నేను సురక్షితంగా బయట పడ్డా. ప్రజలు వదంతులు నమ్మొద్దు. ఎవరికీ ఏమీ కాలేదు. ఈ ఘటనపై పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తాం’’ అని ఫడ్నవిస్ విలేకరులకు చెప్పారు. ఇటీవలే విదర్భ ప్రాంతంలోని గచ్చిరోలి పర్యటన సందర్భం గా ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన రోడ్డు మార్గంలో నాగ్‌పూర్ చేరుకు న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చెన్నైలో ఉన్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు,శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతోపాటు పలువురు ప్రముఖులు ఫడ్నవిస్‌కు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఫడ్నవిస్‌కు కేసీఆర్ పరామర్శ సాక్షి, హైదరాబాద్: ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఫడ్నవిస్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా రు. ఈ ఘటన గురించి తెలియగానే కలవరపాటుకు గురయ్యానని, అందరూ క్షేమంగా ఉండటం సంతోషకరమని కేసీఆర్ అన్నారు. -
సీఎం హెలికాప్టర్ క్రాష్
-
పిట్టలు రాలిపోయాయి
పిట్టల్లా రాలిపోవడం అని ఒక సామెత వాడుతుంటాం. అదేమిటో తెలిపేలా ఉంది ఈ దృశ్యం. నీటి చుక్క లేక దప్పికతో పిట్టలు మృత్యువాతపడ్డాయి. ఎండుటాకులు నేల రాలినట్లున్న ఈ దృశ్యం మహారాష్ట్రలోని లాతూర్‌లోనిది. హృదయవిదారకమైన ఈ దృశ్యాన్ని సమీపంలోని ప్రజలు చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి నీటి ఎద్దడి పరిస్థితి ఎలా ఉందో ఈ చిత్రం చేస్తే అర్థమవుతుంది. -
హిందీ భాషను అభివృద్ధి చేయాలి
బీజేపీ ఎంపీ బలిరామ్ గైక్వాడ్ నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్రంలో హిందీభాషను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాజ్బాషా (హిందీ) హైపవర్ కమిటీ సభ్యులు, మహారాష్ట్రలోని లాధూర్ నియోజకవర్గ బీజేపీ పార్లమెంటు సభ్యులు సునీల్ బలిరామ్ గైక్వాడ్ అన్నారు. హిందీభాష పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయంపై రెండు రోజుల నెల్లూరు పర్యటనకు ఆయన బుధవారం విచ్చేశారు. ఎంపీ మాట్లాడుతూ హిందీని కేంద్ర కార్యాలయాల్లో తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ వెంట పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీలో మరో లాతూర్..!
దొనకొండ: లాతూర్... కరువు కోరల్లో చిక్కిన ప్రాంతం. ఈ పేరు విన్నా.. అక్కడి పరిస్థితులు గుర్తుతెచ్చుకున్నా ఒళ్లు గగుర్పొడుస్తుంది. అక్కడి ప్రజల వ్యథను చూసి మహారాష్ట్ర ప్రభుత్వం రైళ్లలో నీళ్లు సరఫరా చేయడంతో పాటు కర్ఫ్యూ విధించిన పరిస్థితులు మనం చూశాం. ఆ స్థాయిలో కాకపోయినా దొనకొండ ప్రాంతం మరో లాతూరును తలపిస్తోంది. చందవరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అడుగంటడంతో ప్రజలు నీళ్లు తెచ్చుకునేందుకు రైళ్లలో 20 కిలోమీటర్లు ప్రయాణించి గజ్జలకొండకు వెళ్తున్నారు. 20 రోజులుగా దొనకొండలో ఇదే పరిస్థితి. గ్రామస్తులు ఉదయాన్నే వచ్చే గుంటూరు-కాచీగూడ, తెనాలి-మార్కాపురం రైళ్లలో ప్రయాణించి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. అడుగంటిన చందవరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రైలులో నీళ్లు తెచ్చుకుంటున్న దొనకొండ ప్రజలు -
నాన్నా.. నువ్వు చచ్చిపోవద్దు!
'నాన్న రోజులా లేడు. అప్పుడప్పుడు ఆయన బాధపడటం చూశాను గానీ ఆరోజు మాత్రం కచ్చితమైన తేడా కనిపించింది. అంతసేపూ కూర్చుని దీర్ఘంగా ఆలోచించినవాడు కాస్తా వడివడిగా బయటికి నడిచాడు. ఎప్పుడూ ఆయన వెంట తీసుకెళ్లే సెల్ ఫోన్ గానీ, పనిముట్ల సంచి గానీ లేకుండా పొలం ఉన్నదిక్కుకు పరుగులాంటి నడకతో వెళుతున్నాడు. నాలో తెలియని భయం మొదలైంది. వెంటనే లేచి నేనూ పొలానికి పరుగుపెట్టా.. పొలానికి మూలన ఉన్న చెట్టు దగ్గర నాన్న కనిపించాడు. అప్పటికే ఉరికొయ్య పేనడం పూర్తయింది. తాడు మెడలో వేసుకుని కళ్లు మూసుకున్నాడు. నాన్న ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఎలా పరుగెత్తానో నాకే గుర్తులేదు. మరుక్షణంలో నాన్న దగ్గరికి వెళ్లి మెడకు బిగుసుకున్న ఉరితాడును తీసేసే ప్రయత్నం చేశాను. కళ్లు తెరిచి నన్ను చూసిన నాన్న ఏడవటం మొదలుపెట్టాడు. 'నాన్నా నువ్వు చనిపోతే మాకు దిక్కెవరు?' గట్టిగా నాన్నను పట్టుకుని నేనూ ఏడ్చాను. కొద్దిసేపటికి ఇద్దరం కలిసి ఇంటికొచ్చాం. జరిగిన సంగతి అమ్మా, అక్కలకు చెప్పా. వాళ్లకైతే గుండె ఆగినంత పనైంది' అంటూ మూడు రోజుల కిందట జరిగిన సంఘటనను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు 14 ఏళ్ల పృథ్వీరాజ్ షిండే. మహారాష్ట్రలోని లాతూర్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న దుర్భిక్షం ఎంత తీవ్రంగా ఉందో తెలిపే వాస్తవగాథ ఇది. శిరూర్ అనంతపాల్ గ్రామానికి చెందిన ధన్ రాజ్ షిండేకు మూడెకరాల పొలం ఉంది. ఆరుగురు సంతానం. అందులో పృథ్వీ తప్ప మిగతా ఐదుగురూ అమ్మాయిలే. మూడేళ్ల కిందట తమ పొలంలో దానిమ్మతోట వేయడంతో ధన్ రాజ్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. పంట చేతికొచ్చే సమయానికి గాలివాన బీభత్సం సృష్టించింది. దాంతో నష్టాల పంరంపర మొదలైంది. గతేడాది వర్షాలు పడకపోవడంతో ఒక్క గింజా పండించలేకపోయాడు, ఈ ఏడాది సాగు సంగతి పక్కన పెడితే కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి. ఈ క్రమంలో దాదాపు రూ.15 లక్షలు అప్పుచేసిన ధన్ రాజ్.. అప్పుచెల్లించలేననే భయంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కరువుకు తోడు కూతురికి రావాల్సిన ఉద్యోగం ఆలస్యమవుతుండటం కూడా ఆయన చనిపోవాలనుకోవడానికి మరో కారణం. ధన్ రాజ్ పెద్దకూతురు అర్చన (26) సంస్కృతంలో మంచి మార్కులు తెచ్చుకుని రాష్ట్రపతి అవార్డును సాధించింది. ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు వైర్ లెస్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో నియామకం ఆలస్యమవుతోంది. కూతురికి ఉద్యోగం వస్తేనన్నా కొద్దిగా ఆసరా అవుతుందనుకున్న ధన్ రాజ్ అదికాస్తా ఆలస్యం అవుతుండటంతో ఇంకా కలతచెందాడు. అతని రెండో కూతురు సోనాలి (22) గ్రూప్ వన్ పరీక్షలు రాయాలనుకుంటోంది కానీ పరిస్థితుల ప్రభావంతో ఆగిపోయింది. సైన్స్ ఒలింపియాడ్ లో పాల్గొన్న పృథ్వీ ఐఏఎస్ కావడమే తన లక్ష్యమంటున్నాడు. మిగతా ఇద్దరమ్మాయిలు కూడా చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. 'నా పిల్లల్ని సరస్వతీదేవి కరుణించింది గానీ మాకు లక్ష్మీదేవి కటాక్షం దొరకలేదు. ఇప్పటికీ చెబుతున్నా.. మంచి వర్షాలు కురిస్తే ఒక్క పంటతోనే అప్పులన్నీ తీర్చేయగల సత్తా నాకుంది. కానీ దేవుడు కనికరించట్లేదు. ఆ రోజు నా కొడుకు అడ్డుపడకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తోంది. ఇక నేను చావను. ఎన్ని కష్టాలెదురైనాసరే నా పిల్లల్ని బాగా చదివిస్తా' అని చెబుతున్నాడు ఆత్మహత్యకు యత్నించి కొడుకు అడ్డుకోవడంతో బతికున్న ధన్ రాజ్ షిండే. -
గొంతు తడిపితేనే గొప్ప!
సమకాలీనం మంజీరా నది గర్భం తవ్వి 3 మీటర్ల అదనపు లోతు, గట్లు జరిపి 80 మీటర్ల వెడల్పు చేసే కార్యాచరణ ప్రారంభించారు. మే మాసాంతానికి పూర్తి చేయాలని తలపోస్తున్నారు. ఇందుకయ్యే రూ. 7.5 కోట్ల నిధుల్ని విరాళాల రూపంలో సమీకరిస్తున్నారు. ఇప్పటికి రూ. 3.5 కోట్లు జమైంది. ఈ పని పూర్తయితే, జూన్‌లో కురిసే తొలకరి వర్షాల్లోనే, కనీసం 100 మి.మీ. వర్షం కురిసినా...18 ఎంసీఎం నీరు నిలవుంటుంది. అంటే, 5 లక్షల మందికి ఏడాది పొడుగునా ప్రతి మనిషికి సగటున వంద లీటర్ల నీరిచ్చే సామర్థ్యం నెలకొంటుంది. నీటిని నిర్లక్ష్యం చేయడమనే మానవ తప్పిదం మనిషి ప్రాణాల మీదకే తెస్తోంది. మూడో ప్రపంచ యుద్దమంటూ వస్తే అది నీటి తగాదాల వల్లే అని ఎవరన్నారో కానీ అక్షర సత్యమనిపిస్తుంది. యుద్ధం సంగతెలా ఉన్నా, మున్ముందు మహా మానవ వినాశమంటూ జరిగితే నిశ్చయంగా అది నీటి వల్లేనేమోనన్న అనుమానం క్రమంగా బలపడుతోంది. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న, మూడో ప్రపంచ దేశాల్లో, మరీ ముఖ్యంగా మన దేశంలో సాగు-తాగునీటి సమస్య గగుర్పాటుకు గురిచేస్తోంది. అందుకు మహారాష్ట్ర లోని లాతూరు ఒక ఉదాహరణ మాత్రమే! లాతూరే కాకుండా మొత్తం మరా ఠ్వాడా, విదర్భ, రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని అత్యధిక ప్రాంతాలు ఈరోజు తాగునీటి కోసం యాతన పడుతున్నాయి. పశువులు అల్లాడి అసువులు బాస్తున్నాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 254 జిల్లాలు, 2.56 లక్షల గ్రామాల్లోని 33 కోట్ల భారతీయులు, అంటే.... దేశ జనాభాలో దాదాపు మూడో వంతు కరువు రక్కసి కౌగిట్లో విలవిల్లాడుతు న్నారు. ఇది ఏ విపక్షమో, మీడియానో చేస్తున్న విమర్శ కాదు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభత్వం సమర్పించిన నివేదికలోని కఠోర వాస్తవాలు. మన సౌరమండలంలో ఇతర గ్రహాల కన్నా భిన్నంగా ఒక్క భూమి మీదే జీవరాశి ఉండటానికి కారణం నీరేనని ఇప్పటివరకు ధ్రువపడిన ఆధారాల్ని బట్టి స్పష్టమౌతోంది. భూగోళంపై ఉన్నది మూడొంతులు నీరే అయినా... అత్యధికం సముద్రజలమే! తాగు-సాగు నీటి నిర్వహణ, వినియోగం సవ్యంగా లేకపోవడం నీటి ఎద్దడికి దారి తీసి తీరని జీవన్మరణ సమస్యగా పరిణమిస్తోంది. ఎప్పటిలాగే ఈ రోజు ధరిత్రిదినం పాటిస్తున్న మనం, నీటి నిర్వహణ, వినియోగం, సంరక్షణ విషయంలో ఏ మేరకు వాస్తవికంగా ఉండగలుగుతున్నాం అన్నది కోటి రూకల ప్రశ్న! 'లాతూరు' దారి చూపే ఓ లాంతరయ్యేనా? మరాఠ్వాడా 8 జిల్లాల్లో ఒకటైన లాతూరు ఈ రోజు తీవ్ర నీటి ఎద్దడితో నలుగుతోంది. 342 కి.మీ. దూరంలోని సాంగ్లీ జిల్లా మిరాజ్ నుంచి రైల్వే వ్యాగన్లలో తెచ్చే నీటి కోసం జనం కళ్లల్లో వత్తులేసుకొని నిరీక్షిస్తున్నారు. ట్రిప్పుకు 5 లక్షల లీటర్ల చొప్పున వచ్చే నీరు, 5 లక్షల జనాభా ఉన్న లాతూరు పట్టణంలో సగటున మనిషికొక లీటరు చొప్పున లభిస్తోంది. మామూలుగా అయితే ఏడాది పొడుగునా మనిషికి రోజూ వందలీటర్ల సగటు నీటి సరఫరా ఉండేదక్కడ. అరుదుగా లభించే నీటి కోసం జనం ఎగబడుతున్న తీరుకు జడిసిన అధికార యంత్రాంగం, ఒకే చోట అయిదుగురు, అంతకు మించి గుమికూడవద్దనే నిషేదాజ్ఞల్ని (144-సీఆర్పీసీ) లాతూరు, పర్బనీ జిల్లాల్లో విధించింది. మత ఘర్షణలో, వర్గ వైషమ్యాలో తలెత్తినపుడు విధించే నిషే ధాస్త్రాన్ని నీరడుగుతున్న సామాన్యులపై ప్రయోగించడాన్ని వింతగా చూస్తున్నారక్కడి జనం. అంతకంటే వింతగా, ‘భారత్‌లో ఇదీ... తాగునీటి పరిస్థితి’అని అంతర్జాతీయ మీడియా (పత్రికలు, టీవీలు)చేస్తున్న ‘లాతూరు’ ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా మనదేశం సిగ్గుపడేలా చేస్తోంది. పౌర సమాజం చేతనతో ఏర్పడ్డ ఒక ప్రయివేటు ట్రస్టుకున్న పాటి నిబద్ధత కూడా ప్రభు త్వానికి లేకపోయిందనే విమర్శ బలంగా ఉంది. ‘‘జలయుక్త లాతూర్’’ అని ప్రచారం చేస్తున్న ఓ ట్రస్టు శాశ్వత పరిష్కారానికి పూనుకుంది. అక్కడి మంజీరా నది గర్భం తవ్వి 3 మీటర్ల అదనపు లోతు, గట్లు జరిపి 80 మీటర్ల అదనపు వెడల్పు చేసే కార్యాచరణ (18 కి.మీ. నిడివి) ప్రారంభించారు. మే మాసాంతానికి పూర్తి చేయాలని తలపోస్తున్నారు. ఇందుకయ్యే రూ. 7.5 కోట్ల నిధుల్ని వారు విరాళాలుగా సమీకరిస్తున్నారు. ఇప్పటికి రూ. 3.5 కోట్లు జమయింది. ఈ పని పూర్తయితే, జూన్‌లో కురిసే తొలకరి వర్షాల్లోనే, కనీసం 100 మి.మీ. వర్షం కురిసినా..... 18 ఎంసీఎం నీరు నిలవుంటుంది. అంటే, 5 లక్షల మందికి ఏడాది పొడుగునా రోజూ ప్రతి మనిషికి వంద లీటర్ల సగటున నీరివ్వగలిగిన సామర్థ్యం నెలకొంటుంది. మరి ప్రభుత్వాలెందుకు పూను కోవు? నిధులు లేకా? అదో అబద్దం! ఎందుకంటే, తాగునీటి అవసరాలకు, మరీ ముఖ్యంగా కరువులో నీటి ఎద్దడి నివారణ కోసం కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ మహారాష్ట్రకిచ్చిన నిధుల్లో, ఖర్చు కాకుండా రూ. 390 కోట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సుప్రీం చివాట్లకు ఇద్దరి వద్దా జవాబు లేదు! ‘దప్పి పుట్టినపుడే బావి తవ్వుతానంటే ఎలా?’ అన్నది దెప్పిపొడుపు కోసం తెలుగునాట పుట్టిన సామెత. అక్షరాలా అలాగే ఉంటుంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలి. సమస్య మెడ మీదికొచ్చే వరకు నిమ్మకు నీరెత్తినట్టుంటారు. వరుస రెండేళ్ల కరువు, అయినా అప్రమత్తం కాలేదు. వర్ష- వేసవి కాలాల మధ్య నాలుగు మాసాల వ్యవధి (చలికాలం) ఉంటుంది. వర్ష పరిస్థితుల్ని బట్టి రాగల వేసవి తీవ్రత, నీటి ఎద్దడి గురించి తగినంత ముందే ప్రణాళిక చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ కార్యాచరణ (కంటింజెన్సీ ప్లాన్) కూడా రూపొందించొచ్చు. సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తున్నట్టు లేదు. పైగా ఇది అకస్మాత్తుగా ఊడిపడ్డ సమస్య కాదు. గత పదిహేనేళ్లలో కరువు, నీటిఎద్దడి తరచూ తలెత్తుతున్నదే! 2009లో 15 రాష్ట్రాల్లోని 388 జిల్లాలు, 2004లో 9 రాష్ట్రాల్లోని 223 జిల్లాలు, 2002 లో 17 రాష్ట్రాల్లోని 383 జిల్లాలు కరువు వాతన పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తన నివేదికల్లో (అతి) తెలివిగా ‘కరువు’ ‘తీవ్ర కరువు‘అన్న పదాల స్థానే ‘వర్షాభావం’ ‘అత్యంత వర్షాభావం’ అన్న ప్రత్యామ్నాయ పదాల్ని తెచ్చి తీవ్రతను తగ్గించే గారడీ చేస్తోంది. జనం కళ్లకు గంతలు కడుతోంది. ‘నిధులిచ్చేశాం, మా పనైపోయింది, అని మీరు చేతులు దులిపేసుకుంటే ఎలా?’ అని మొన్న మంగళవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేసింది! వర్షపాతం వివరాలు రాష్ట్రాలకు తెలిపి వారిని కేంద్రం ఎందుకు అప్రమత్తం చేయట్లేదని నిలదీస్తే, అదనపు సొలిసిటర్ జనరల్ పి.ఎ.నర్సింహ ఏదో సమాధానం చెప్పారు. ఎప్పటికప్పుడు సమాచారం-నిధులు ఇస్తున్నామని, కరువు ప్రకటించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలదేననీ తెలిపారు. ఇదే అవసరాల కోసం కేంద్రమిచ్చే నిధుల్ని కూడా సవ్యంగా ఖర్చు చేసే స్థితిలో రాష్ట్రాలు లేవు. 13 రాష్ట్రాల్లో రూ. 2172 కోట్లు ఖర్చు కాకుండా మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రూ 63 కోట్లు, తెలంగాణలో రూ 41 కోట్లు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో రెండేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో విస్తరించిన బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి దాదాపు పది లక్షల మంది గ్రామీణులు పట్టణ-నగర ప్రాంతాలకు ఉపాధికోసం వలస వెళ్లారు. 2019 నాటికి కరవు రహిత రాష్ట్రం చేస్తామని ‘జలయుక్త శివర్ అభియాన్’ ప్రకటించిన మహారాష్ట్ర ఆ దిశలో ఏం చేసిందో మరాఠ్వాడా, విదర్భల్లో ఆనవాళ్లు కూడా లేవు. తాగునీటి తంటాలతో ఉత్పత్తికెంత నష్టం? దేశ జనాభాలో మూడో వంతు, 33 కోట్ల మంది రోజువారీ పనులు ఆపి దాదాపు రెండు నెలలు పాటు తాగునీటి కోసం తంటాలు పడితే దేశీయ ఉత్పత్తి మీద ఎంత ప్రతికూల ప్రభావం పడుతుంది? దేశంలోని నదుల ద్వారా ఏటా 41,637 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. ఒక్క మన గోదావరిలోనే రెండు నుంచి మూడు వేల టీఎంసీల నీరు వృథా అవుతోంది. ఇందులో ఏ కొంత శాతాన్ని తాగునీటి కోసం మళ్లించినా జనానికి ఇంత యాతన ఉండదు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న భూతాపోన్నతి వల్ల రిజర్వాయర్ల పరిస్థితి ఆశాజనకంగా లేదు. దేశంలోని 91 రిజర్వాయర్లలో ప్రస్తుతం నీటి మట్టాలు, వాటి పూర్తి నిల్వ సామర్థ్యంలో సగటు 23 శాతానికన్నా తక్కువకు చేరాయి. ఈ సమయంలో ఇటువంటి దుస్థితి ఒక రికార్డు. జాతీయ, అంతర్జాతీయ పతాక శీర్షికలకెక్కిన మహారాష్ట్రలో ఇది 3 శాతం కన్నా తక్కువకు పడి పోయింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గడచిన 6 మాసాల్లో 341 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక సర్వే (రైతు స్వరాజ్య వేదిక) చెబుతోంది. పదివేల కోట్లు ఇస్తే, 2019 కల్లా కరువు రహిత రాష్ట్రం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఇవే తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం వేసవి ముగిసే నాటికి ఒక్కో రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా కేవలం వడదెబ్బ వల్ల మరణించారు. తాగునీరు లభించిక అల్లాడి మరణిస్తున్న వారూ ఉన్నారు. భారత్‌లో రక్షిత మంచి నీరు లేకపోవడం వల్లే 21 శాతం జబ్బులు- అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. గ్రాసం-నీరు లభించక నేలకొరుగుతున్న, కబేళాలకు తరలుతున్న పశుసంపదకు లెక్కే లేదు. ఇంకోవైపు నీటి దుబారా కూడా జరుగుతోంది. పేరున్న బహుళజాతి శీతల పానీయోత్పత్తి సంస్థలు ఒక సీసా తయారీకి ఆరు లీటర్ల నీటిని వినియోగిస్తాయన్నది లెక్క. ఐపీఎల్ క్రీడల వేదికైన మైదానాల పచ్చిక నిర్వహణకు నెలకు పది నుంచి పాతిక లక్షల లీటర్ల నీరు అవసరమంటారు. ఏం కావాలి! ఎవరు చేయాలి?? రాజస్థాన్‌లో ఎడారి లాంటి ప్రాంతాన్ని హరిత తివాచీగా మలచిన జలమాంత్రికుడు రాజేందర్‌సింగ్ మనవాళ్లకు కానరాడు. రాళ్ల గుట్టల నడుమ జలధారలను ఆపి, రాలెగావ్సిద్దిలో భూగర్భ జలాల్ని భూమి పైపొరల్లోనే నిలిపిన అన్నాహజారే వినబడడు. విదేశీ కన్సల్టెన్సీలు కావాలి, అవి సింగపూర్, చైనా, మలేిసియాల నుంచే రావాలి, ఈ చేతివాటం పనుల్లోనే తమకు వాటాలు దక్కాలి. ఇదీ మనోళ్ల వరస! వాతావరణ మార్పు వల్ల అతివృష్టి-అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు చేస్తున్న నష్టాన్ని మన తప్పిదాలు, వ్యూహలోపాలు రెట్టింపు చేస్తున్నాయి. బుందేల్‌ఖండ్, లాతూర్‌లో కరువయినా, అటు మొన్న హైదరాబాద్‌లో, మొన్న ముంబైలో, నిన్న చెన్నైలో జరిగిన వరద బీభత్సాలైనా... వాటి తీవ్రత, ప్రకృతి విపత్తును మించిన మానవ తప్పిదాల ఫలితమే! నదుల కనీస ప్రవాహాల్ని కాపాడాలి. పరీవాహక ప్రాంతాల్ని రక్షించాలి. బేసిన్ల సహజత్వాన్ని పరిరక్షించాలి. నదులన్నింటికీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాధికార సంస్థలుండాలి. నీటిని ఎక్కువ పరిమాణంలో వాడుకునే పరిశ్రమలన్నీ, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కింద నీటి సంరక్షణకు నిర్దిష్టమైన చర్యల్ని చేపట్టాలి. ప్రతి జల వనరుకీ లెక్కలు, గణాంకాలు, నిర్వహణ వ్యవస్థ, జవాబు దారీతనం ఉండే చట్టబద్ధమైన ఏర్పాట్లు జరగాలి. ఎక్కడి నీరక్కడుంటే ఏ సమస్యా లేదు. గ్రామీణాభివృద్ధి శాఖకు కొమ్ముగానో, జలవనరుల-రెవెన్యూ శాఖలకు తోకగానో కాకుండా కరువు నివారణకు ఓ ప్రత్యేక మంత్రిత్వశాఖే ఉండాలి. మిగతా పనుల్ని పక్కన పెట్టయినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ, తాగు నీటి కల్పన, తాపం-వడదెబ్బ నుంచి పేదలకు ఉపశమన చర్యలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. మనిషి ప్రాణానికి మించిందేమీ ఉండదు. (నేడు ధరిత్రి దినోత్సవం) వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ఈ మంత్రిని ఏమనాలి?
మంచినీళ్ల కోసం జనం 'అలో లక్ష్మణా..' అని అరుస్తోంటే, మరో పక్క అవే మంచినీళ్లను మట్టిపాలుచేసిన మంత్రిగారి ఉదంతమిది. గడిచిన 100 ఏళ్లలో మహారాష్ట్ర కనీవినీ ఎరుగని రీతిలో కరువు ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ బీటలు వేడటంతో పక్కరాష్ట్రం నుంచి రైళ్ల ద్వారా మంచినీళ్లు తెప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజష్థాన్ లోని మిరాజ్ డ్యామ్ నుంచి మహారాష్ట్రలోని కరువు ప్రభావిత లాతూర్ సహా ఇతర జిల్లాలకు రైళ్ల ద్వారా ప్రతిరోజు 5లక్షల లీటర్ల నీటిని సరఫరాచేస్తున్నారు. రైళ్ల రాకపోకలు, నీటి పంపకం తదితర వ్యవహారాలను ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్నే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగు రోజులుగా లాతూర్ లోనే మకాం వేసిన ఆయన శుక్రవారం ఓ కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది. లాతూర్ నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న భేల్ కుండ్ గ్రామంలో జరిగే కార్యక్రమానికి రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్ ద్వారా వెళ్లాలని మంత్రి గారు నిర్ణయించుకున్నారు. దీంతో చకచకా ఏర్పాట్లు చేశారు అధికారులు. హెలికాప్టర్ టేకాఫ్ అయ్యేచోట, ట్యాండ్ అవ్వాల్సిన చోట దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించారు. ఇందుకోసం దాదాపు 10వేల లీటర్ల నీటిని మట్టిపై చల్లారు. అసలే బంగారమైన నీటిని మంత్రిగారు ఇలా వృథాచేయటాన్ని స్థానికులు సహా ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 'ఏక్ నాథ్ వెళ్లాలనుకున్న ఊరు లాతూర్ నుంచి తిప్పికొడితే 40 కిటోమీటర్ల దూరం ఉండదు. ఆ మాత్రం దూరానికే ఆయన హెలికాప్టర్ వాడటం, ట్యాంకుల కొద్దీ నీళ్లను వృథాచేయటం దారుణం'అని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సచిన్ సావంత్ అన్నారు. చేసిన పనికి ప్రజలకు క్షమాపణలు చెప్పి, మరోసారి అలా జరగదని మంత్రి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
'ఛా.. దీన్ని కూడా వాడేసుకుంటున్నారు!'
లాతూర్: ఒకడి కష్టం మరొకడికి సంపాదన, పేరు ప్రతిష్టలు అంటే ఇదేనేమో. ప్రతి అంశాన్ని తమ ఎదుగుదలకు వాడుకోవడంలో రాజకీయ రంగానికి మించిన పరిశ్రమ మరొకటి లేదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ పక్క తీవ్రనీటి ఎద్దడి, కరువు, దాహార్తి విలయతాండవంలో లాతూర్ మునిగి ఉండగా అక్కడ రాజకీయం మాత్రం పచ్చగా కళకళలాడుతోంది. ఈ విషయం ఎంతో స్పష్టంగా కళ్లకు దర్శనమిచ్చింది. లాతూర్ నెలకొన్న కరువు నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ప్రత్యేక రైల్వే ట్యాంకర్లను నీటితో నింపి తరలించిన విషయం తెలిసిందే. ఈ రైలు కూడా సురక్షితంగా విజయవంతంగా ఆ ప్రాంతాన్ని చేరుకుంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా తమకు నీళ్లొచ్చాయండోయ్ అని సంబంరాల్లో మునిగి ఉండగా కొంతమంది మాత్రం తమ రాజకీయాలు తాము చేసుకుపోయారు. రైలు వ్యాగన్ అలా వచ్చి ఆగిందో లేదో వెంటనే బీజేపీ కార్యకర్తలు రైలు నీళ్ల ట్యాంకర్లపైకి ఎక్కి వాటికి ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో కూడా పోస్టర్లను అంటించి పార్టీ జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా తామేం తక్కువ కాదని లాతూర్ ప్రాంతంలోని తమ నాయకుల ఒత్తిడి వల్లే ఇది సాధ్యమైందని, తమ నాయకుల పోరాటం వల్లే ట్యాంకర్ల ద్వారా నేడు నీళ్లు వచ్చాయని బీజేపీకన్నా వేగంగా పోటీపడి ప్రచారం చేసుకుంటున్నాయి. ఏదేమైన కరువులు చేస్తున్న సాయాన్ని కూడా తమ క్రెడిట్ లోకి వేసుకోవాలని పార్టీలు ప్రయత్నించడం ఛీ కొట్టేలా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ట్యాంకర్లో 50 వేల లీటర్ల నీటిని నింపడం ద్వారా మొత్తం 50 లక్షల లీటర్ల నీటిని లాతూర్కు పది రైలు ట్యాంకర్లతో తరలించిన విషయం తెలిసిందే. పశ్చిమ మహారాష్ట్రలోని మిరాజ్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన ఈ రైలు మంగళవారం ఉదయం చేరుకుంది. -
లాతూర్ చేరుకున్న వాటర్ ట్రైన్
ముంబై: మరఠ్వాడ ప్రజలకు 50 లక్షల లీటర్ల నీటితో బయల్దేరిన వాటర్ ట్రయిన్ మంగళవారం ఉదయం లాతూర్ చేరుకుంది. తీవ్ర కరువు, నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న మరఠ్వాడలోని లాతూర్కు నీరు అందించేందుకు ఈ రైలు పశ్చిమ మహారాష్ట్రలోని మిరాజ్ రైల్వేస్టేషన్ నుంచి నిన్న బయల్దేరింది. పది వ్యాగన్లతో చేరుకున్న ఈ రైలును చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు లాతూర్కు తరలివచ్చారు. రైలులో చేరుకున్న నీటిని పైప్ లైన్ల ద్వారా తరలిస్తున్నారు. అక్కడి నుంచి త్వరలోనే నీటిని లాతూర్కు పంపిణీ చేయనున్నారు. కాగా భయంకర నీటి ఎద్దడిని పారదోలేందుకు మహారాష్ట్ర సర్కార్ నడుం బిగించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని కోట ప్రాంతం నుంచి కేంద్ర రైల్వేశాఖ సహాయంతో రైళ్లలో నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అక్కడ నుంచి 50 వ్యాగన్ల రైలు ఆదివారం మిరాజ్ కు చేరుకుంది. మరో 50 వ్యాగన్లతో కూడిన రెండో రైలు ఈ నెల 15న మిరాజ్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. మహారాష్ట్ర మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. ఇటు ముంబైలోనూ నీటి ఎద్దడి కొనసాగుతోంది. -
మహా దుర్భిక్షం: రైళ్ల ద్వారా మంచినీటి సరఫరా
తినడానికి గింజలులేవు.. కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా దొరకటంలేదు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వచ్చిన పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. పరిస్థితి విషమించి ఆసుపత్రులకు తీసుకెళితే డాక్టర్లు సైతం చేతులెత్తేసే పరిస్థితి. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క ఆసుపత్రిలోనూ నీళ్లు లేవు. అత్యవసర ఆపరేషన్లను సైతం వైద్యులు వాయిదావేస్తున్నారు. గడిచిన 100 ఏళ్లలో తీవ్ర దుర్భిక్షంగా భావిస్తోన్న మహారాష్ట్ర కరువుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి. వాస్తవ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మంచినీరు అందించేందుకు బృహత్ కార్యక్రమం చేపట్టింది మహారాష్ట్ర సర్కారు. రాజస్థాన్ లోని ఒక డ్యామ్ నుంచి రైలుద్వారా నీళ్లను తరలించేందుకు భారీ సన్నాహాలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా నీటి రవాణాకు వినియోగించే 60 బోగీల(ట్యాంకుల) రైలును ఏర్పాటుచేశారు రైల్వే అధికారులు. రాజస్థాన్ లోని మిరాజ్ డ్యామ్ నీళ్లను మోటార్ల ద్వారా ట్యాంకుల్లో నింపి కరువు కేంద్రం లాతూర్ పట్టణానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే డ్యామ్ నుంచి నీళ్లను నింపటం ఆసత్యమవుతున్నందున తొలి విడతగా 10 బోగీ(ట్యాంకు)లతో కూడిన రైలు ఆదివారం సాయంత్రం లాతూర్ కు బయలుదేరింది. శుక్రవారంలోగా మిగిలిన 50 బోగీల నీటిని కూడా తరలిస్తామని అధికారులు చెప్పారు. రైలు ద్వారా మొత్తం 5 లక్షల లీటర్ల నీటిని కరువు ప్రాంతానికి చేరవేయనున్నారు. మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్రదుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. ఇటు ముంబైలోనూ నీటి ఎద్దడి కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటివారానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక మే నెలలో అధికం కానున్న ఎండలకు ఎలా తట్టుకోవాలా? అని జనం బెంబేలెత్తిపోతున్నారు.