గొంతు తడిపితేనే గొప్ప! | dilip reddy opinion on water crisis in india | Sakshi
Sakshi News home page

గొంతు తడిపితేనే గొప్ప!

Published Fri, Apr 22 2016 12:28 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

గొంతు తడిపితేనే గొప్ప! - Sakshi

గొంతు తడిపితేనే గొప్ప!

సమకాలీనం

మంజీరా నది గర్భం తవ్వి 3 మీటర్ల అదనపు లోతు, గట్లు జరిపి 80 మీటర్ల వెడల్పు చేసే కార్యాచరణ ప్రారంభించారు. మే మాసాంతానికి పూర్తి చేయాలని తలపోస్తున్నారు. ఇందుకయ్యే రూ. 7.5 కోట్ల నిధుల్ని విరాళాల రూపంలో సమీకరిస్తున్నారు. ఇప్పటికి రూ. 3.5 కోట్లు జమైంది. ఈ పని పూర్తయితే, జూన్‌లో కురిసే తొలకరి వర్షాల్లోనే, కనీసం 100 మి.మీ. వర్షం కురిసినా...18 ఎంసీఎం నీరు నిలవుంటుంది. అంటే, 5 లక్షల మందికి ఏడాది పొడుగునా ప్రతి మనిషికి సగటున వంద లీటర్ల నీరిచ్చే సామర్థ్యం నెలకొంటుంది.
 
నీటిని నిర్లక్ష్యం చేయడమనే మానవ తప్పిదం మనిషి ప్రాణాల మీదకే తెస్తోంది. మూడో ప్రపంచ యుద్దమంటూ వస్తే అది నీటి తగాదాల వల్లే అని ఎవరన్నారో కానీ అక్షర సత్యమనిపిస్తుంది. యుద్ధం సంగతెలా ఉన్నా, మున్ముందు మహా మానవ వినాశమంటూ జరిగితే నిశ్చయంగా అది నీటి వల్లేనేమోనన్న అనుమానం క్రమంగా బలపడుతోంది. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న, మూడో ప్రపంచ దేశాల్లో, మరీ ముఖ్యంగా మన దేశంలో సాగు-తాగునీటి సమస్య గగుర్పాటుకు గురిచేస్తోంది. అందుకు మహారాష్ట్ర లోని లాతూరు ఒక ఉదాహరణ మాత్రమే! లాతూరే కాకుండా మొత్తం మరా ఠ్వాడా, విదర్భ, రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని అత్యధిక ప్రాంతాలు ఈరోజు తాగునీటి కోసం యాతన పడుతున్నాయి. పశువులు అల్లాడి అసువులు బాస్తున్నాయి.

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 254 జిల్లాలు, 2.56 లక్షల గ్రామాల్లోని 33 కోట్ల భారతీయులు, అంటే.... దేశ జనాభాలో దాదాపు మూడో వంతు కరువు రక్కసి కౌగిట్లో విలవిల్లాడుతు న్నారు. ఇది ఏ విపక్షమో, మీడియానో చేస్తున్న విమర్శ కాదు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభత్వం సమర్పించిన నివేదికలోని కఠోర వాస్తవాలు. మన సౌరమండలంలో ఇతర గ్రహాల కన్నా భిన్నంగా ఒక్క భూమి మీదే జీవరాశి ఉండటానికి కారణం నీరేనని ఇప్పటివరకు ధ్రువపడిన ఆధారాల్ని బట్టి స్పష్టమౌతోంది. భూగోళంపై ఉన్నది మూడొంతులు నీరే అయినా... అత్యధికం సముద్రజలమే! తాగు-సాగు నీటి నిర్వహణ, వినియోగం సవ్యంగా లేకపోవడం నీటి ఎద్దడికి దారి తీసి తీరని జీవన్మరణ సమస్యగా పరిణమిస్తోంది. ఎప్పటిలాగే ఈ రోజు ధరిత్రిదినం పాటిస్తున్న మనం, నీటి నిర్వహణ, వినియోగం, సంరక్షణ విషయంలో ఏ మేరకు వాస్తవికంగా ఉండగలుగుతున్నాం అన్నది కోటి రూకల ప్రశ్న!

'లాతూరు' దారి చూపే ఓ లాంతరయ్యేనా?
 మరాఠ్వాడా 8 జిల్లాల్లో ఒకటైన లాతూరు ఈ రోజు తీవ్ర నీటి ఎద్దడితో నలుగుతోంది. 342 కి.మీ. దూరంలోని సాంగ్లీ జిల్లా మిరాజ్ నుంచి రైల్వే వ్యాగన్లలో తెచ్చే నీటి కోసం జనం కళ్లల్లో వత్తులేసుకొని నిరీక్షిస్తున్నారు. ట్రిప్పుకు 5 లక్షల లీటర్ల చొప్పున వచ్చే నీరు, 5 లక్షల జనాభా ఉన్న లాతూరు పట్టణంలో సగటున మనిషికొక లీటరు చొప్పున లభిస్తోంది. మామూలుగా అయితే ఏడాది పొడుగునా మనిషికి రోజూ వందలీటర్ల సగటు నీటి సరఫరా ఉండేదక్కడ. అరుదుగా లభించే నీటి కోసం జనం ఎగబడుతున్న తీరుకు జడిసిన అధికార యంత్రాంగం, ఒకే చోట అయిదుగురు, అంతకు మించి గుమికూడవద్దనే నిషేదాజ్ఞల్ని (144-సీఆర్పీసీ) లాతూరు, పర్బనీ జిల్లాల్లో విధించింది. మత ఘర్షణలో, వర్గ వైషమ్యాలో తలెత్తినపుడు విధించే నిషే ధాస్త్రాన్ని నీరడుగుతున్న సామాన్యులపై ప్రయోగించడాన్ని వింతగా చూస్తున్నారక్కడి జనం.

అంతకంటే వింతగా, ‘భారత్‌లో ఇదీ... తాగునీటి పరిస్థితి’అని అంతర్జాతీయ మీడియా (పత్రికలు, టీవీలు)చేస్తున్న ‘లాతూరు’ ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా మనదేశం సిగ్గుపడేలా చేస్తోంది.  పౌర సమాజం చేతనతో ఏర్పడ్డ ఒక ప్రయివేటు ట్రస్టుకున్న పాటి నిబద్ధత కూడా ప్రభు త్వానికి లేకపోయిందనే విమర్శ బలంగా ఉంది. ‘‘జలయుక్త లాతూర్’’ అని ప్రచారం చేస్తున్న ఓ ట్రస్టు శాశ్వత పరిష్కారానికి పూనుకుంది. అక్కడి మంజీరా నది గర్భం తవ్వి 3 మీటర్ల అదనపు లోతు, గట్లు జరిపి 80 మీటర్ల అదనపు వెడల్పు చేసే కార్యాచరణ (18 కి.మీ. నిడివి) ప్రారంభించారు. మే మాసాంతానికి పూర్తి చేయాలని తలపోస్తున్నారు. ఇందుకయ్యే రూ. 7.5 కోట్ల నిధుల్ని వారు విరాళాలుగా సమీకరిస్తున్నారు. ఇప్పటికి రూ. 3.5 కోట్లు జమయింది. ఈ పని పూర్తయితే, జూన్‌లో కురిసే తొలకరి వర్షాల్లోనే, కనీసం 100 మి.మీ. వర్షం కురిసినా..... 18 ఎంసీఎం నీరు నిలవుంటుంది. అంటే, 5 లక్షల మందికి ఏడాది పొడుగునా రోజూ ప్రతి మనిషికి వంద లీటర్ల సగటున నీరివ్వగలిగిన సామర్థ్యం నెలకొంటుంది. మరి ప్రభుత్వాలెందుకు పూను కోవు? నిధులు లేకా? అదో అబద్దం! ఎందుకంటే, తాగునీటి అవసరాలకు, మరీ ముఖ్యంగా కరువులో నీటి ఎద్దడి నివారణ కోసం కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ మహారాష్ట్రకిచ్చిన నిధుల్లో, ఖర్చు కాకుండా రూ. 390 కోట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

సుప్రీం చివాట్లకు ఇద్దరి వద్దా జవాబు లేదు!
‘దప్పి పుట్టినపుడే బావి తవ్వుతానంటే ఎలా?’ అన్నది దెప్పిపొడుపు కోసం తెలుగునాట పుట్టిన సామెత. అక్షరాలా అలాగే ఉంటుంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలి. సమస్య మెడ మీదికొచ్చే వరకు నిమ్మకు నీరెత్తినట్టుంటారు. వరుస రెండేళ్ల కరువు, అయినా అప్రమత్తం కాలేదు. వర్ష- వేసవి కాలాల మధ్య నాలుగు మాసాల వ్యవధి (చలికాలం) ఉంటుంది. వర్ష పరిస్థితుల్ని బట్టి రాగల వేసవి తీవ్రత, నీటి ఎద్దడి గురించి తగినంత ముందే ప్రణాళిక చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ కార్యాచరణ (కంటింజెన్సీ ప్లాన్) కూడా రూపొందించొచ్చు. సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తున్నట్టు లేదు. పైగా ఇది అకస్మాత్తుగా ఊడిపడ్డ సమస్య కాదు.

గత పదిహేనేళ్లలో కరువు, నీటిఎద్దడి తరచూ తలెత్తుతున్నదే! 2009లో 15 రాష్ట్రాల్లోని 388 జిల్లాలు, 2004లో 9 రాష్ట్రాల్లోని 223 జిల్లాలు, 2002 లో 17 రాష్ట్రాల్లోని 383 జిల్లాలు కరువు వాతన పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తన నివేదికల్లో (అతి) తెలివిగా ‘కరువు’ ‘తీవ్ర కరువు‘అన్న పదాల స్థానే ‘వర్షాభావం’ ‘అత్యంత వర్షాభావం’ అన్న ప్రత్యామ్నాయ పదాల్ని తెచ్చి తీవ్రతను తగ్గించే గారడీ చేస్తోంది. జనం కళ్లకు గంతలు కడుతోంది. ‘నిధులిచ్చేశాం, మా పనైపోయింది, అని మీరు చేతులు దులిపేసుకుంటే ఎలా?’ అని మొన్న మంగళవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేసింది! వర్షపాతం వివరాలు రాష్ట్రాలకు తెలిపి వారిని కేంద్రం ఎందుకు అప్రమత్తం చేయట్లేదని నిలదీస్తే, అదనపు సొలిసిటర్ జనరల్ పి.ఎ.నర్సింహ ఏదో సమాధానం చెప్పారు.

ఎప్పటికప్పుడు సమాచారం-నిధులు ఇస్తున్నామని, కరువు ప్రకటించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలదేననీ తెలిపారు. ఇదే అవసరాల కోసం కేంద్రమిచ్చే నిధుల్ని కూడా సవ్యంగా ఖర్చు చేసే స్థితిలో రాష్ట్రాలు లేవు. 13 రాష్ట్రాల్లో రూ. 2172 కోట్లు ఖర్చు కాకుండా మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రూ 63 కోట్లు, తెలంగాణలో రూ 41 కోట్లు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో రెండేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో విస్తరించిన బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి దాదాపు పది లక్షల మంది గ్రామీణులు పట్టణ-నగర ప్రాంతాలకు ఉపాధికోసం వలస వెళ్లారు.
2019 నాటికి కరవు రహిత రాష్ట్రం చేస్తామని ‘జలయుక్త శివర్ అభియాన్’ ప్రకటించిన మహారాష్ట్ర ఆ దిశలో ఏం చేసిందో మరాఠ్వాడా, విదర్భల్లో ఆనవాళ్లు కూడా లేవు.

తాగునీటి తంటాలతో ఉత్పత్తికెంత నష్టం?
దేశ జనాభాలో మూడో వంతు, 33 కోట్ల మంది రోజువారీ పనులు ఆపి దాదాపు రెండు నెలలు పాటు తాగునీటి కోసం తంటాలు పడితే దేశీయ ఉత్పత్తి మీద ఎంత ప్రతికూల ప్రభావం పడుతుంది? దేశంలోని నదుల ద్వారా ఏటా 41,637 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. ఒక్క మన గోదావరిలోనే రెండు నుంచి మూడు వేల టీఎంసీల నీరు వృథా అవుతోంది. ఇందులో ఏ కొంత శాతాన్ని తాగునీటి కోసం మళ్లించినా జనానికి ఇంత యాతన ఉండదు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న భూతాపోన్నతి వల్ల రిజర్వాయర్ల పరిస్థితి ఆశాజనకంగా లేదు. దేశంలోని 91 రిజర్వాయర్లలో ప్రస్తుతం నీటి మట్టాలు, వాటి పూర్తి నిల్వ సామర్థ్యంలో సగటు 23 శాతానికన్నా తక్కువకు చేరాయి. ఈ సమయంలో ఇటువంటి దుస్థితి ఒక రికార్డు. జాతీయ, అంతర్జాతీయ పతాక శీర్షికలకెక్కిన మహారాష్ట్రలో ఇది 3 శాతం కన్నా తక్కువకు పడి పోయింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గడచిన 6 మాసాల్లో 341 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక సర్వే (రైతు స్వరాజ్య వేదిక) చెబుతోంది.

పదివేల కోట్లు ఇస్తే, 2019 కల్లా కరువు రహిత రాష్ట్రం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఇవే తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం వేసవి ముగిసే నాటికి ఒక్కో రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా కేవలం వడదెబ్బ వల్ల మరణించారు. తాగునీరు లభించిక అల్లాడి మరణిస్తున్న వారూ ఉన్నారు. భారత్‌లో రక్షిత మంచి నీరు లేకపోవడం వల్లే 21 శాతం జబ్బులు- అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. గ్రాసం-నీరు లభించక నేలకొరుగుతున్న, కబేళాలకు తరలుతున్న పశుసంపదకు లెక్కే లేదు. ఇంకోవైపు నీటి దుబారా కూడా జరుగుతోంది. పేరున్న బహుళజాతి శీతల పానీయోత్పత్తి సంస్థలు ఒక సీసా తయారీకి ఆరు లీటర్ల నీటిని వినియోగిస్తాయన్నది లెక్క. ఐపీఎల్ క్రీడల వేదికైన మైదానాల పచ్చిక నిర్వహణకు నెలకు పది నుంచి పాతిక లక్షల లీటర్ల నీరు అవసరమంటారు.
 
ఏం కావాలి! ఎవరు చేయాలి??
రాజస్థాన్‌లో ఎడారి లాంటి ప్రాంతాన్ని హరిత తివాచీగా మలచిన జలమాంత్రికుడు రాజేందర్‌సింగ్ మనవాళ్లకు కానరాడు. రాళ్ల గుట్టల నడుమ జలధారలను ఆపి, రాలెగావ్‌సిద్దిలో భూగర్భ జలాల్ని భూమి పైపొరల్లోనే నిలిపిన అన్నాహజారే వినబడడు. విదేశీ కన్సల్టెన్సీలు కావాలి, అవి సింగపూర్, చైనా, మలేిసియాల నుంచే రావాలి, ఈ చేతివాటం పనుల్లోనే తమకు వాటాలు దక్కాలి. ఇదీ మనోళ్ల వరస! వాతావరణ మార్పు వల్ల అతివృష్టి-అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు చేస్తున్న నష్టాన్ని మన తప్పిదాలు, వ్యూహలోపాలు రెట్టింపు చేస్తున్నాయి. బుందేల్‌ఖండ్, లాతూర్‌లో కరువయినా, అటు మొన్న హైదరాబాద్‌లో, మొన్న ముంబైలో, నిన్న చెన్నైలో జరిగిన వరద బీభత్సాలైనా... వాటి తీవ్రత, ప్రకృతి విపత్తును మించిన మానవ తప్పిదాల ఫలితమే! నదుల కనీస ప్రవాహాల్ని కాపాడాలి. పరీవాహక ప్రాంతాల్ని రక్షించాలి.

బేసిన్ల సహజత్వాన్ని పరిరక్షించాలి. నదులన్నింటికీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాధికార సంస్థలుండాలి. నీటిని ఎక్కువ పరిమాణంలో వాడుకునే పరిశ్రమలన్నీ, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కింద నీటి సంరక్షణకు నిర్దిష్టమైన చర్యల్ని  చేపట్టాలి. ప్రతి జల వనరుకీ లెక్కలు, గణాంకాలు, నిర్వహణ వ్యవస్థ, జవాబు దారీతనం ఉండే చట్టబద్ధమైన ఏర్పాట్లు జరగాలి. ఎక్కడి నీరక్కడుంటే ఏ సమస్యా లేదు. గ్రామీణాభివృద్ధి శాఖకు కొమ్ముగానో, జలవనరుల-రెవెన్యూ శాఖలకు తోకగానో కాకుండా కరువు నివారణకు ఓ ప్రత్యేక మంత్రిత్వశాఖే ఉండాలి. మిగతా పనుల్ని పక్కన పెట్టయినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ, తాగు నీటి కల్పన, తాపం-వడదెబ్బ నుంచి పేదలకు ఉపశమన చర్యలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. మనిషి ప్రాణానికి మించిందేమీ ఉండదు.
(నేడు ధరిత్రి దినోత్సవం)

వ్యాసకర్త: దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement