నీటి కష్టాలు : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి మట్టాలు | Mumbai Water concerns Heatwave May Lead To Water Shortages Ahead | Sakshi
Sakshi News home page

నీటి కష్టాలు : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి మట్టాలు

Published Mon, Mar 3 2025 4:24 PM | Last Updated on Mon, Mar 3 2025 4:31 PM

Mumbai Water concerns Heatwave May Lead To Water Shortages Ahead

ఏడు జలాశయాల్లో అడుగంటుతున్న నీటిమట్టాలు ఆందోళనలో ముంబైకర్లు 

50 శాతానికి పడిపోతున్న వైనం ఇదే కొనసాగితే తప్పని నీటి ఇక్కట్లు 

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నీటికి తంటాలు అత్యధికంగా అప్పర్‌ వైతర్ణాలో  నిల్వలు..

తక్కువగా మోడక్‌తగ్గుతున్న నీటి నిల్వలు సాగర్‌లో..  

సాక్షి, ముంబై: ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. ముంబైలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. దీంతో ముంబైకి నీటి సరఫరా చేసే ఏడు జలాశయాల్లో నీటిమట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు అందించిన వివరాల మేరకు ముంబైకి సరఫరా అయ్యే నీటి జలాశయాల్లో నీటి నిల్వలు 50.06 శాతానికి పడిపోయాయి. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నీటి ఇక్కట్టు తప్పేటట్టు లేదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బీఎంసీ అ«ధికారులతోపాటు ముంబైకర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రస్తుత నీటి నిల్వల ప్రకారం నాలుగైదు నెలలపాటు నీటి సరఫరా చేయాల్సిరానుంది. 

అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి మట్టాల కారణంగా ఇబ్బంది పడాల్సిరానుందని చెబుతున్నారు. జూన్‌లో వర్షాలు కురవకపోతే నీటి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో కేవలం 50.06 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. వైతర్ణా, మోడక్‌సాగర్, తాన్సా, మధ్య వైతర్ణా, భాత్సా, విహార్, తులశీ మొదలగు ఏడు జలాశయాల నుంచి ముంబైకి నీటి సరఫరా జరుగుతోంది. ముంబైలో సుమారు 1.30 కోట్ల జనాభా ఉంది. వీరికోసం ప్రతీరోజు 4,450 మిలియన్‌ లీటర్ల నీరు డిమాండ్‌ ఉండగా 3,850 మిలియన్‌ లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. వివిధ కారణాలవల్ల 25 శాతం నీటి లెక్కలు తేలడంలేదు. కాగా, ప్రతీ వ్యక్తికి వివిధ అవసరాల కోసం సుమారు 150 లీటర్ల నీరు అవసరముంటుంది. కానీ లీకేజీ వల్ల పూర్తిగా సరఫరా చేయలేకపోతోంది. అయినప్పటికీ నగరంలో ఇప్పటికీ 20 లక్షల మందికి నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా మురికి కాల్వలు శుభ్రం చేయడం, ఆటో, ట్యాక్సీలు నడుపుకొంటూ, ఇళ్లలో పాచి పనులు చేస్తూ జీవనం సాగించేవారున్నారు. ఇలాంటి వారికే నీటి సరఫరా సరిగా అందడంలేదు. 

చదవండి: ఏసీలు కూడా పేలే అవకాశం : ఎలా గుర్తించాలి? ముఖ్యమైన జాగ్రత్తలు

మోడక్‌సాగర్‌లో అత్యల్పం 
ముంబైకి నీటి సరఫరా చేసే ఏడు జలాశయాల్లో మోడక్‌సాగర్‌ జలాశయంలో అత్యల్పంగా నీటి మట్టాలున్నాయి. మోడక్‌సాగర్‌ జలాశయం సామర్థ్యం 1,28,925 ఎమ్మెల్డీలుండగా ప్రస్తుతం 25,972 ఎమ్మెల్డీలు అంటే కేవలం 20.1 శాతానికి నీటి నిల్వలు చేరుకున్నాయి. ఇక తాన్సా జలాశయం సామర్థ్యం 1,45,080 ఉండగా ప్రస్తుత నీటి నిల్వలు 62,161 ఎమ్మెల్డీలకు అంటే 42.8 శాతానికి చేరుకున్నాయి. మరోవైపు ముంబైకి నీటి సరఫరా జలాశయాల్లో అతిపెద్ద జలాశయమైన అప్పర్‌ వైతర్ణాలో అత్యధికంగా 69.4 శాతం నీటి నిల్వలున్నాయి. అప్పర్‌వైతర్ణా జలాశయం సామర్థ్యం 2,27,07 ఎమ్మెల్డీలు ఉండగా ఈ జలాశయంలో నీటి నిల్వలు 1,57,50 ఎమ్మెల్డీల అంటే 69.4 శాతానికి చేరుకున్నాయి. ఇది సంతృప్తికరమైన విషయమని చెప్పవచ్చు. 

మరోవైపు గత సంవత్సరం వర్షాలు కురిసినప్పటికీ జలాశయాల్లో నీరు అనుకున్నంతగా చేరలేదు. దీంతో నీటి నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం అందిన వివరాల మేరకు ముంబైకి నీటి సరఫరా అయ్యే జలాశయాల్లో కేవలం 50.06 శాతం ఉండటంతో కోత విధించే అవకాశాలుండవని కానీ ఉష్ణోగ్రతలు ఇతర పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో పరిస్థితి మారకపోతే నీటి కోత విధించే అవకాశాలున్నాయని బీంఎసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బీఎంసీ అందించిన వివరాల మేరకు ఒక శాతం నీటిని సుమారు రెండు నుంచి మూడు రోజులపాటు సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. ఈ ప్రకారం నెలకి సుమారు 10 నుంచి 15 శాతం నీరు సరఫరా చేస్తారు. ఈ లెక్కన 50 శాతం నీటిని సుమారు నాలుగు నుంచి ఐదు నెలలపాటు చేయవచ్చని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నీటి నిల్వలు ఆవిరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని నీటి విధించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత జూన్‌లో వర్షాలు కురవనట్టయితే ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement