దాదర్: విద్యార్ధులు మోస్తున్న బరువైన స్కూలు బ్యాగుల వల్ల వారికి భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదముందని ఆర్థోపెడిక్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలా సందర్భాల్లో విద్యార్ధుల కంటే వారి సంచీ బరువే ఎక్కువగా ఉంటోందని ఇది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్, స్పైన్ సర్జన్ డాక్టర్ సమీర్ రూపరేల్ పేర్కొన్నారు. పది మంది విద్యార్ధుల్లో ఎనిమిది మంది భుజం, వెన్ను, నడుము నొప్పులతో బాధపడుతున్నారని, ప్రతీరోజు అన్ని సబ్జెక్టుల అచ్చు, నోటు పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని ఓ అధ్యయనంలో తేలిందని, కాబట్టి సాధ్యమైనంత వరకు సంచీ బరువు తగ్గించే ప్రయత్నం చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు.
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు...
విద్యార్ధుల బ్యాగుల బరువు తగ్గించే విషయంపై అనేక సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. స్కూలు సంచీల బరువు మోయలేక విద్యార్ధుల వెన్ను వెనక్కు వాలిపోతోంది. వెన్ను నొప్పితో సతమతమవుతూ చికిత్స చేయాల్సిన పరిస్థితులు కూడా చోటుచేసుకుంటుండటంతో ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది.
బ్యాగు బరువు తగ్గించే విషయంపై అన్ని పాఠశాలల యాజమాన్యాలు స్పందించాలని సూచించింది. టైం టేబుల్ ప్రకారం పుస్తకాలు తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించాలని హోంవర్క్ మినహా ఇతర నోటు పుస్తకాలు తరగతి గదిలోనే భద్రపరచుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని గతంలోనే ఆదేశించినప్పటికీ అన్ని తరగతి గదుల్లో ర్యాక్‌లు నిరి్మంచడం లేదా అందుబాటులో ఉండేలా చూడాల్సిరావడం ఒకింత భారం కావడంతో అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను అటకెక్కించాయి.
దీంతో గత్యంతరం లేక విద్యార్ధులు అన్ని నోటు, అచ్చు పుస్తకాలను మోసుకెళ్లడంవల్ల బ్యాగు బరువు ఎక్కువవుతోంది. దీనికి తోడు ఒక్కో సబ్జెక్టుకు ఒక అచ్చు పుస్తకం, రెండు నోటు పుస్తకాలు, ఒక వ్యాసం లేదా గ్రామర్ పుస్తకం, ఇలా కనీసం నాలుగైదు పుస్తకాలుంటున్నాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి సుమారు 20–25 పుస్తకాలను రోజూ మోయాల్సి రావడం వల్ల విద్యార్ధులు వెన్ను, నడుం భుజాల నొప్పితో బాధపడుతున్నారు.
నిబంధనల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువుకంటే 15 శాతం తక్కువగా ఉండాలి. ఒకటి, రెండో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు కేజీ, మూడు నుంచి ఐదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు రెండున్నర నుంచి మూడు కేజీల మధ్య, ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్ధుల బరువు మూడు నుంచి నాలుగు కేజీల మధ్య ఉండాలి. ఇక తొమ్మిది, పదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు ఐదు కేజీల కంటే ఎక్కువ ఉండరాదని సమీర్ రూపరేల్ తెలిపారు. కానీ అనేక కారణాల వల్ల పరిమితిని మించి విద్యార్థులు స్కూ లు బ్యాగుల బరువును మోస్తున్నారని దీనివల్ల వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విపరీతమైన బరువు కారణంగా విద్యార్ధులు పూర్తిగా ఎదగలేక పోతున్నారని ఈ కారణంగా వారు నిలుచునే భంగిమలో కూడా మార్పు వస్తోందని ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో వారికి మరింత ఇబ్బంది కలిగే ప్రమాదముందని రూపరేల్ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment