Orthopaedic
-
పిల్లల్లో దొడ్డికాళ్లు, కారణాలు తెలుసుకోండి!
పిల్లల్లో మోకాళ్ల వద్ద దూరం ఎక్కువగా ఉండి, చిన్నారుల అరికాళ్లు దగ్గరగా ఉంచినప్పుడు ఈ రెండు కాళ్లూ బయటివైపునకు విల్లులా ఒంగి ఉండే కండిషన్‌ను ఇంగ్లిష్‌లో బౌడ్ లెగ్స్, వైద్యపరిభాషలో జీనూవేరమ్ అంటారు. తెలుగు వాడుక భాషలో ఈ కండిషన్‌ను ‘దొడ్డికాళ్లు’ అంటుంటారు. నిజానికి పుట్టిన పిల్లలందరూ చిన్నతనంలో కొన్నిరోజుల పాటు ఎంతోకొంత దొడ్డికాళ్ల (బౌడ్ లెగ్స్) కండిషన్‌ను కలిగి ఉంటారు. శిశువు తన పిండ దశలో దగ్గరగా ముడుచుకుని (ఫోల్డెడ్ పొజిషన్లో) ఉండటమే దీనికి కారణం. అందువల్ల అప్పుడే పుట్టిన పిల్లల్లో కాళ్లు ఇలా ఉండటం చాలా సాధారణం. పిల్లలు నడక మొదలు పెట్టాక, వాళ్లు తమ కాళ్లపై కొంత బరువు మోపుతుండటం మొదలుకావడంతో... అంటే... ఒకటిన్నర–రెండు సంవత్సరాలప్పటి నుంచి వాళ్ల కాళ్లు మామూలుగా కావడం మొదలవుతుంది. దాదాపు మూడేళ్ల వయస్సు వచ్చేసరికి కాళ్లు రెండూ నార్మల్ షేప్‌కు వస్తాయి. ఒకవేళ చిన్నారుల్లో వారు మూడేళ్లు పైబడ్డాక కూడా బౌడ్ లెగ్స్ (సివియర్ బౌడ్ లెగ్స్) కండిషన్ ఎక్కువగా కనిపిస్తుంటే అందుకు కారణాలు ఏమై ఉంటాయా అని ముందుగా ఆలోచించాలి. అంటే ఆ పరిస్థితికి... రికెట్స్ వంటి వ్యాధులు గానీ; లేదా లెడ్ (సీసం), ఫ్లోరైడ్స్ వంటి విష పదార్థాల ప్రభావం ఎక్కువ కావడం గానీ; లేదా ఎముకల షేప్ మారడం (బోన్ డిస్ప్లేసియాస్) వంటివి గానీ కారణం కావచ్చా అని ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలతోనే ఒకవేళ బౌడ్ లెగ్స్ వచ్చి ఉంటే, దాన్ని కాస్తంత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ జీనూవేరమ్ కండిషన్ ఉన్న పిల్లలకు ఎక్స్‌రే, రక్తపరీక్షల వంటివి చేసి కారణాలను నిర్ధారణ చేయాలి. కారణం తెలిశాక తగిన చికిత్స అందించాలి. అయితే మొదట్లో ఈ బౌడ్ లెగ్స్ కండిషన్ కనిపిస్తున్నప్పటికీ చిన్నారుల్లో మూడేళ్ల వయసు వచ్చే వరకు ఈ సమస్య గురించి ఆలోచించాల్సిన లేదా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. మూడేళ్ల తర్వాత కూడా అలాగే ఉంటే మాత్రం అప్పుడు పిల్లల నిపుణులను లేదా ఆర్థోపెడిక్ నిపుణులను తప్పక సంప్రదించాలి. -
వీపు ‘మోత’ మోగుతోంది
దాదర్: విద్యార్ధులు మోస్తున్న బరువైన స్కూలు బ్యాగుల వల్ల వారికి భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదముందని ఆర్థోపెడిక్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలా సందర్భాల్లో విద్యార్ధుల కంటే వారి సంచీ బరువే ఎక్కువగా ఉంటోందని ఇది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్, స్పైన్ సర్జన్ డాక్టర్ సమీర్ రూపరేల్ పేర్కొన్నారు. పది మంది విద్యార్ధుల్లో ఎనిమిది మంది భుజం, వెన్ను, నడుము నొప్పులతో బాధపడుతున్నారని, ప్రతీరోజు అన్ని సబ్జెక్టుల అచ్చు, నోటు పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని ఓ అధ్యయనంలో తేలిందని, కాబట్టి సాధ్యమైనంత వరకు సంచీ బరువు తగ్గించే ప్రయత్నం చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... విద్యార్ధుల బ్యాగుల బరువు తగ్గించే విషయంపై అనేక సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. స్కూలు సంచీల బరువు మోయలేక విద్యార్ధుల వెన్ను వెనక్కు వాలిపోతోంది. వెన్ను నొప్పితో సతమతమవుతూ చికిత్స చేయాల్సిన పరిస్థితులు కూడా చోటుచేసుకుంటుండటంతో ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. బ్యాగు బరువు తగ్గించే విషయంపై అన్ని పాఠశాలల యాజమాన్యాలు స్పందించాలని సూచించింది. టైం టేబుల్ ప్రకారం పుస్తకాలు తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించాలని హోంవర్క్ మినహా ఇతర నోటు పుస్తకాలు తరగతి గదిలోనే భద్రపరచుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని గతంలోనే ఆదేశించినప్పటికీ అన్ని తరగతి గదుల్లో ర్యాక్‌లు నిరి్మంచడం లేదా అందుబాటులో ఉండేలా చూడాల్సిరావడం ఒకింత భారం కావడంతో అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను అటకెక్కించాయి. దీంతో గత్యంతరం లేక విద్యార్ధులు అన్ని నోటు, అచ్చు పుస్తకాలను మోసుకెళ్లడంవల్ల బ్యాగు బరువు ఎక్కువవుతోంది. దీనికి తోడు ఒక్కో సబ్జెక్టుకు ఒక అచ్చు పుస్తకం, రెండు నోటు పుస్తకాలు, ఒక వ్యాసం లేదా గ్రామర్ పుస్తకం, ఇలా కనీసం నాలుగైదు పుస్తకాలుంటున్నాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి సుమారు 20–25 పుస్తకాలను రోజూ మోయాల్సి రావడం వల్ల విద్యార్ధులు వెన్ను, నడుం భుజాల నొప్పితో బాధపడుతున్నారు. నిబంధనల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువుకంటే 15 శాతం తక్కువగా ఉండాలి. ఒకటి, రెండో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు కేజీ, మూడు నుంచి ఐదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు రెండున్నర నుంచి మూడు కేజీల మధ్య, ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్ధుల బరువు మూడు నుంచి నాలుగు కేజీల మధ్య ఉండాలి. ఇక తొమ్మిది, పదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు ఐదు కేజీల కంటే ఎక్కువ ఉండరాదని సమీర్ రూపరేల్ తెలిపారు. కానీ అనేక కారణాల వల్ల పరిమితిని మించి విద్యార్థులు స్కూ లు బ్యాగుల బరువును మోస్తున్నారని దీనివల్ల వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విపరీతమైన బరువు కారణంగా విద్యార్ధులు పూర్తిగా ఎదగలేక పోతున్నారని ఈ కారణంగా వారు నిలుచునే భంగిమలో కూడా మార్పు వస్తోందని ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో వారికి మరింత ఇబ్బంది కలిగే ప్రమాదముందని రూపరేల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
సిమ్స్‌లో ముగిసిన ఆర్థోపెడిక్ సదస్సు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ప్రశాంతి గ్రాంలో రెండు రోజులు అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు ఆదివారం ఘనంగా ముగిసింది. సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 100 మంది ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు పాల్గొన్నారు. తుంటె ఎముకల మార్పిడి, పిన్న వయస్కుల్లో వాటి పునర్నిర్మాణం, సత్యసాయి ఆదర్శాల మేరకు వైద్య విధానం, వైద్యరంగంలో మానవతా విలువలు, ఆధ్యాత్మికత అన్న అంశాలపై సదస్సు సాగింది. సదస్సులో ప్రత్యక్ష శస్త్రచికిత్సల ప్రదర్శన, విశ్లేషణ, వర్క్‌షాప్‌లు, మేధావుల ఉపన్యాసాలు సాగాయి. సదస్సులో ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్.జిమ్ సులివన్,చండీగఢ్‌కు చెందిన డాక్టర్ రమేష్‌సెన్, హర్యాణాకు చెందిన మగు, బెంగళూరుకు చెందిన మధుకేష్ ఉపన్యసించారు. సదస్సు ముగిసిన అనంతరం నిపుణులు ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
నడుం నొప్పికి ఆపరేషనా?
న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లడానికీ, అక్కడ్నుంచి రావడానికి అంటూ దాదాపు 50 కి.మీ. పైనే బైక్ మీద తిరుగుతుంటాను. ఇటీవల తీవ్రంగా నడుము నొప్పి బాధిస్తోంది. దీంతో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించారు. ఆయన ఏకంగా నడుముకు శస్త్రచికిత్స చేయాలన్నారు. కేవలం నడుము నొప్పి అంటే సర్జరీ అంటున్నారేమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రజనీ, తార్నాక (హైదరాబాద్) ఈమధ్య కాలంలో చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్‌పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేసుకుంటూ ఆపై ఆఫీసుకు బండి మీద వెళ్లి అక్కడ కూడా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్థమతువోతంది. మీరు వెన్నుపూసకు ఎక్స్‌రే తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లయితే మీరు ‘స్పాండిలోలిస్తెసిస్’ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందులతోనే నయమైతే, మరికొందరికి నడు కింది భాగంలో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూస లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్క్రూస్, రాడ్స్ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్ చేసే విధానాలలో సురక్షితమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్ నిర్వహించగలుగుతారు. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీ-హోల్ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా మర్నాడు రోగిని ఇంటికి పంపించేస్తారు. కాబట్టి మీ ఉద్యోగానికి కూడా ఎక్కువ రోజులు సెలవు పెట్టుకోనవసరం లేదు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నిమ్స్‌కు ఉక్కపోత
► పని చేయని ఏసీలు ► ఉక్కపోతతో బాధితుల అవస్థలు ► రోగులే ఫ్యాన్లు సమకూర్చుకుంటున్న వైనం సాక్షి, సిటీబ్యూరో: వారు వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు. ఒంటినిండా సిమెం ట్ కట్లు...ఆపై భరించలేని నొప్పి.... చల్లని గాలికి సేద తీరాల్సిన క్షతగాత్రులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో గాయాలు మానక పోగా, ఉక్కపోతకు దురద పెట్టి ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో ఏసీలు, ఫ్యాన్లు పని చేయక రోగుల అవస్థలు వర్ణణాతీతం. సాధారణ వార్డుల్లోని రోగులే కాకుండా..వివిధ శస్త్రచికిత్సలు చేయించుకుని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న రోగులు, ఏసీ గదుల్లో ఉన్నవారు ఉక్కపోతకు అల్లాడుతున్నారు. ఉపశమనం కోసం ప్రత్యామ్నాయంగా ఎవరికి వారే ఫ్యాన్లు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లీకేజీ వల్ల కొన్ని.. గ్యాస్ లేక మరికొన్నిః ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా మరో వెయ్యిమందికి పైగా చి కిత్స పొందుతుంటారు. వీరిలో ఎక్కువ మంది క్షతగాత్రులు, హృద్రోగులు, న్యూరో సంబంధ రోగులు, కిడ్నీ బాధితులే ఉన్నారు. వీవీఐపీలు చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో ప్రత్యేకంగా 60 ఏసీ పెయింగ్ గదులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పదేళ్ల క్రితం అమర్చినవి కావడంతో నిర్వహణ లోపం వల్ల తరచూ మెరాయిస్తున్నాయి. 40 పడకలు ఉన్న ఐసీసీయూలో గ్యాస్ లీకై ఏసీలు పని చేయకపోగా, సీటీఐసీయూలో గ్యాస్ కొరత కారణంగా మొండికేశాయి. ఆర్ఐసీయూలోనూ ఇదే దుస్థితి. సాధారణ వార్డుల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వార్డు నెంబర్ 10-ఎ లోని 12 పడకలు ఉండగా, నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి. ఇవి ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో సరిగా పని చేయడం లేదు. ఆర్థోపెడిక్ వార్డులో ఒంటినిండా సిమెంట్ కట్లతో ఏటూ కదల్లేపోతున్న క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్కపోతకు పట్టీలు వేసిన చోట దురద పుట్టి గాయం మానకుండా చేస్తుంది. డయాలసిస్ వార్డులో కంప్రెషర్ పోవడంతో కిడ్నీ బాధితులు అవస్థలు పడుతున్నారు. ఇక రోగులు డబ్బు చెల్లించి తీసుకున్న ఏసీ గదుల్లోనూ ఏసీలు పని చేయక పోవడంతో వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడువు తీరినవైనందునే ఆస్పత్రిలో చాలా వరకు పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్యాన్లే ఉన్నాయి. ఏసీల గడువు కూడా దాటిపోయింది. వీటిని కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికి ఉష్ణోగ్రతల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే వీటిని పునరుద్ధరిస్తాం. రెం డు మూడు రోజుల్లో ఆర్ఐసీయూలో ఏసీ సర్వీసులను పునరుద్ధరిస్తాం. రోగులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తాం. -డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్, నిమ్స్ -
అత్యవసర వైద్యం.. దయనీయం
క్యాజువా లిటీలో వైద్యుల ఇష్టారాజ్యం ఎమ్మెల్సీల నిర్వహణలో నిర్లక్ష్యం సీఎంవోల సంతకాల ఫోర్జరీ కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యవసర వైద్యం అందించే డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంఎల్సీ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో కేసుల విషయంలో సాక్ష్యాలు తారుమారవుతున్నాయి. ఫలితంగా దోషులు నిర్దోషులవుతున్నారు. నిర్దోషులు దోషులుగా మారుతున్నారు. రెండురోజుల క్రితం కాలిన రోగి విషయంలో వాంగ్మూలనం తీసుకునేందుకు క్యాజువాలిటీకి న్యాయమూర్తి రాగా, ఆ సమయంలోనూ సీఎంవో లేకపోవడం చూసి వారు మండిపడ్డారు. చివరకు సీఎస్‌ఆర్‌ఎంవో సమక్షంలో వాంగ్మూలం నమోదు చేసుకుని వెళ్లిపోయారు. క్యాజువాలిటీకి రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు, హత్యాయత్నాలు, హత్యలు, దాడులు, అత్యవసర అనారోగ్య పరిస్థితి ఉన్న వారందరూ చికిత్స నిమిత్తం వస్తారు. వీరికి అత్యవసర పరిస్థితిలో చికిత్స నందించేందుకు రోజుకు మూడు షిఫ్ట్‌లలో వైద్యులను నియమిస్తారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్‌తో పాటు, డ్యూటీ డాక్టర్లుగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఇక్కడ డ్యూటీలు వేస్తారు. సీఎంవోలకు 8 గంటల పని విధానంలో డ్యూటీ ఉండగా, డ్యూటీ డాక్టర్లు మాత్రం ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 8 గంటల వరకు ఇక్కడ సేవలందించాలి. వీరితో పాటు ఇతర స్పెషాలిటీ వైద్యులు మాత్రం ఆన్‌కాల్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కానీ డ్యూటీ డాక్టర్లు సైతం ఇప్పుడు ఆన్‌కాల్ వైద్యం చేస్తున్నారు. కొందరైతే ఫోన్లోనే క్యాజువాలిటీలో విధులు నిర్వర్తించే పీజీలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. శని, ఆదివారాల్లో అయితే ఈ వైద్యులు ఫోన్లో కూడా అందుబాటులో ఉండరు. డ్యూటీ డాక్టర్లు లేని కారణంగా కొన్నిసార్లు అవసరం లేకున్నా ఆపరేషన్లు జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. గుండెజబ్బుల రోగుల విషయంలోనూ సరైన వైద్యం అందక రోగులు కన్నుమూసే పరిస్థితి ఇక్కడ నెలకొంది. క్యాజువాలిటీ డ్యూటీలంటే కోపం క్యాజువాలిటీలో డ్యూటీలు చేయాలంటేనే కొందరు వైద్యులకు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇందుకోసం వారు ఉన్నతాధికారులతోనూ ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్తున్నారు. సీఎంవోలుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ కేడర్ వైద్యులను నియమిస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లను రోస్టర్ ప్రకారం డ్యూటీలు వేస్తారు. ప్రభుత్వం కాంట్రాక్టు వైద్యులకు జీతాలు ఇవ్వకపోవడంతో గతంలో ఇక్కడ పనిచేసే వైద్యులు పని మానుకున్నారు. ఫలితంగా ఇటీవల ఫ్యామిలి ప్లానింగ్, ఆర్థోపెడిక్ విభాగాల్లో పనిచేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్లనూ డ్యూటీలు వేస్తున్నారు. క్యాజువాలిటీలో డ్యూటీ అంటే పోలీసు కేసులుంటాయని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని కొందరు వైద్యుల భయం. ఇటీవల ఓ వైద్యుడు ఇక్కడ డ్యూటీ వేయగానే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయాడు. మరికొందరు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నా క్యాజువాలిటీలో మాత్రం ఉండటం లేదు. కొందరు వైద్యులు ఒకేసారి ఎంఎల్సీ బుక్‌లలో సీలు వేసి, సంతకాలు చేసి వెళ్తుండగా, మరికొందరు రాకపోవడంతో డ్యూటీలో ఉండే హౌస్సర్జన్లే సంతకాలు చేసి ఎంఎల్సీ సమాచారాన్ని పోలీసులకు పంపిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామానికి చెందిన సుజాత ఈ నెల 5వ తేదీన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స కోసం ఆమెను కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి 7.30 గంటలకు క్యాజువాలిటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో సీఎంవో లేకపోవడంతో ఆయన పేరుతో సంతకం చేసి క్యాజువాలిటీ సిబ్బంది ఎంఎల్సీ పోలీసులకు పంపించారు. -
ఒక్క రోజే హడావుడి
తాత్కాలికంగా రోగుల తరలింపు ప్రక్రియ నిలిపివేత అడ్మిట్ అయిన రోగులను నేరుగా కింగ్‌కోఠికి సగానికి పైగా తగ్గిన అడ్మిషన్లు అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. బుధవారం ఆగమేఘాలపై 24 మంది ఆర్థోపెడిక్ రోగులను తరలించిన ప్రభుత్వం గురువారం ఒక్క రోగిని కూడా తరలించలేదు. దశల వారిగా రోగులను తరలిస్తామని చెప్పిన వైద్యులు తమకు ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొన్నారు. ఆర్థో విభాగంలోని రోగులను తరలించాలన్నా వారి ఆరోగ్య పరిస్థితిని, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతలను బేరీజు వేసుకుని గురువారం తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. ఓపీ నుంచి నేరుగా కింగ్‌కోఠికి... ఉస్మానియా ఆసుపత్రి ఓపీ బ్లాక్‌లో చికిత్సలు నిర్వహించిన వైద్యులు ఆర్థోపెడిక్ ఇన్పేషెంట్లను నేరుగా కింగ్‌కోఠి ఆసుపత్రికి తరలిస్తున్నారు. గురువారం 6 గురు రోగులను కింగ్‌కోఠికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రోగులకు పూర్తి వైద్యసేవలు అందించి ఇక్కడి నుంచే డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించనట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వైద్యసేవలు ఇక్కడే.... ఉస్మానియా ఆసుపత్రి పాత భవనంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి ఇక్కడే పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించి డిశ్చార్జ్ చేయాలని, కొత్త అడ్మిషన్లను నేరుగా కింగ్‌కోఠికి తరలించేలా చర్యలు తీసుకున్నాట్లు సమాచారం. తగ్గిన రోగుల సంఖ్య... ఉస్మానియా ఆసుపత్రిని తరలిస్తున్నారన్న వార్తలతో ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఓపీ బ్లాక్‌లో రోజు సగటున 150 నుంచి 200 మంది అడ్మిట్ అవుతుండగా, ప్రస్తుత వారి సంఖ్య 70 నుంచి 80 వరకు ఉంది. ఇక ఔట్ పేషెంట్ల సంఖ్య రోజుకు సగటున 1500 నుంచి 1800ల వరకు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 800 నుంచి 900 పడిపోయింది. ఉస్మానియాను తరలిస్తున్నారని తెలియడంతో రోగులు ఆస్పత్రికి రావడంలేదని వైద్యులు తెలిపారు. -
గాంధీ’ సాక్షిగా వైద్యుల తగాదా
విధులను బహిష్కరించిన అనస్థీషియా వైద్యులు నిలిచిపోయిన 90 శస్త్రచికిత్సలు ఇబ్బందుల్లో రోగులు రాజీ కుదిర్చిన సూపరింటెండెంట్ గాంధీ ఆస్పత్రి, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యుల మధ్య జరిగిన వివాదం రోగులకు శాపంగా మారింది. అనస్థీషియా వైద్యులు విధులను బహిష్కరించడంతో గురువారం జరగాల్సిన 90 శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్.. రాజీ కుదర్చడంతో విధులకు హాజరయ్యారు. గాంధీ ఆస్పత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓడీ రవిబాబు బుధవారం.. మొదటి అం తస్తులోని ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లేటప్పటికీ అతని కుర్చీలో అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగార్జున కూర్చున్నారు. ‘నా కుర్చీలోనే ఎందుకు కూర్చున్నావు.. లెగు’ అన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన నాగార్జున విషయాన్ని సహచర వైద్యులకు చెప్పడంతో వివాదం ముదిరింది. సూపరింటెండెంట్ ఇరువురికి సర్దిచెప్పిడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. గురువారం ఉదయం అనస్థీషీయా విభాగ వైద్యులంతా సమావేశమై రవిబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు హఠాత్తుగా విధులను బహిష్కరించారు. శస్త్రచికిత్సల్లో వీరే కీలకం కావడంతో ఆస్పత్రిలోని 26 థియేటర్లలో ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆపరేషన్ టేబుల్‌పై గంటల తరబడి ఎదురుచూసినా వైద్యులు రాకపోవడంతో విషయం తెలుసుకున్న రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఇరువర్గాలకు చెందిన వైద్యులను సమావేశపర్చి చర్చించారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడంతో విధులకు హజరయ్యేందుకు అన స్థీషియా వైద్యులు అంగీకరించారు. చివరకు వివాదం సద్దుమణిగింది. పోలీసుల ఆరా.. గాంధీ ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిలిచిపోయావని మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు పెద్దసంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. ఉత్తరమండలం డీసీపీ జయలక్ష్మీ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీసీ పీవై గిరి, గోపాలపురం ఏసీపీ వసంతరావు, చిలకలగూడ సీఐ మోహన్‌లతోపాటు స్పెషల్‌బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు గాంధీలో జరుగుతున్న వివాదాంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎలర్ట్‌గా ఉన్నట్లు ఈ ఘటన రుజువుచేసింది. ఆరోగ్యశ్రీ నుంచి తప్పించాలనే.. గాంధీ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ ర్యాంకో చీఫ్‌గా ఉన్న తనను ఆ పదవి నుంచి తప్పించాలనే తప్పడు ఆరోపణలు చేస్తున్నారు. నా కుర్చీలో కూర్చున్న నాగార్జునను అక్కడి నుంచి లెమ్మని చెప్పానే తప్ప మరే మీ అనలేదు. కావాలనే నాపై తప్పడు ప్రచారం చేస్తున్నారు. - రవిబాబు, ఆర్థోపెడిక్ హెచ్ఓడీ పునరావృతమైతే చర్యలు చిన్నవిషయమే వివాదానికి కారణం. ఫలితంగా మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 45 ఆపరేషన్లు నిలిచిపోయాయి. అందుకే వివాదానికి కారణమైన వైద్యులిద్దరికీ మెమోలు ఇచ్చాం. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు. - చంద్రశేఖర్, సూపరింటెండెంట్