నిమ్స్‌కు ఉక్కపోత
► పని చేయని ఏసీలు
► ఉక్కపోతతో బాధితుల అవస్థలు
► రోగులే ఫ్యాన్లు సమకూర్చుకుంటున్న వైనం
సాక్షి, సిటీబ్యూరో: వారు వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు. ఒంటినిండా సిమెం ట్ కట్లు...ఆపై భరించలేని నొప్పి.... చల్లని గాలికి సేద తీరాల్సిన క్షతగాత్రులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో గాయాలు మానక పోగా, ఉక్కపోతకు దురద పెట్టి ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో ఏసీలు, ఫ్యాన్లు పని చేయక రోగుల అవస్థలు వర్ణణాతీతం. సాధారణ వార్డుల్లోని రోగులే కాకుండా..వివిధ శస్త్రచికిత్సలు చేయించుకుని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న రోగులు, ఏసీ గదుల్లో ఉన్నవారు ఉక్కపోతకు అల్లాడుతున్నారు. ఉపశమనం కోసం ప్రత్యామ్నాయంగా ఎవరికి వారే ఫ్యాన్లు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
లీకేజీ వల్ల కొన్ని.. గ్యాస్ లేక మరికొన్నిః
ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా మరో వెయ్యిమందికి పైగా చి కిత్స పొందుతుంటారు. వీరిలో ఎక్కువ మంది క్షతగాత్రులు, హృద్రోగులు, న్యూరో సంబంధ రోగులు, కిడ్నీ బాధితులే ఉన్నారు. వీవీఐపీలు చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో ప్రత్యేకంగా 60 ఏసీ పెయింగ్ గదులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పదేళ్ల క్రితం అమర్చినవి కావడంతో నిర్వహణ లోపం వల్ల తరచూ మెరాయిస్తున్నాయి. 40 పడకలు ఉన్న ఐసీసీయూలో గ్యాస్ లీకై ఏసీలు పని చేయకపోగా, సీటీఐసీయూలో గ్యాస్ కొరత కారణంగా మొండికేశాయి. ఆర్‌ఐసీయూలోనూ ఇదే దుస్థితి. సాధారణ వార్డుల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వార్డు నెంబర్ 10-ఎ లోని 12 పడకలు ఉండగా, నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి. ఇవి ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో సరిగా పని చేయడం లేదు. ఆర్థోపెడిక్ వార్డులో ఒంటినిండా సిమెంట్ కట్లతో ఏటూ కదల్లేపోతున్న క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉక్కపోతకు పట్టీలు వేసిన చోట దురద పుట్టి గాయం మానకుండా చేస్తుంది. డయాలసిస్ వార్డులో కంప్రెషర్ పోవడంతో కిడ్నీ బాధితులు అవస్థలు పడుతున్నారు. ఇక రోగులు డబ్బు చెల్లించి తీసుకున్న ఏసీ గదుల్లోనూ ఏసీలు పని చేయక పోవడంతో వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గడువు తీరినవైనందునే
ఆస్పత్రిలో చాలా వరకు పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్యాన్లే ఉన్నాయి. ఏసీల గడువు కూడా దాటిపోయింది. వీటిని కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికి ఉష్ణోగ్రతల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే వీటిని పునరుద్ధరిస్తాం. రెం డు మూడు రోజుల్లో ఆర్‌ఐసీయూలో ఏసీ సర్వీసులను పునరుద్ధరిస్తాం. రోగులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తాం. -డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్, నిమ్స్