అత్యవసర వైద్యం.. దయనీయం
క్యాజువా లిటీలో వైద్యుల ఇష్టారాజ్యం
ఎమ్మెల్సీల నిర్వహణలో నిర్లక్ష్యం సీఎంవోల సంతకాల ఫోర్జరీ
కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యవసర వైద్యం అందించే డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంఎల్‌సీ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో కేసుల విషయంలో సాక్ష్యాలు తారుమారవుతున్నాయి. ఫలితంగా దోషులు నిర్దోషులవుతున్నారు. నిర్దోషులు దోషులుగా మారుతున్నారు. రెండురోజుల క్రితం కాలిన రోగి విషయంలో వాంగ్మూలనం తీసుకునేందుకు క్యాజువాలిటీకి న్యాయమూర్తి రాగా, ఆ సమయంలోనూ సీఎంవో లేకపోవడం చూసి వారు మండిపడ్డారు. చివరకు సీఎస్‌ఆర్‌ఎంవో సమక్షంలో వాంగ్మూలం నమోదు చేసుకుని వెళ్లిపోయారు.
క్యాజువాలిటీకి రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు, హత్యాయత్నాలు, హత్యలు, దాడులు, అత్యవసర అనారోగ్య పరిస్థితి ఉన్న వారందరూ చికిత్స నిమిత్తం వస్తారు. వీరికి అత్యవసర పరిస్థితిలో చికిత్స నందించేందుకు రోజుకు మూడు షిఫ్ట్‌లలో వైద్యులను నియమిస్తారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్‌తో పాటు, డ్యూటీ డాక్టర్లుగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఇక్కడ డ్యూటీలు వేస్తారు.
సీఎంవోలకు 8 గంటల పని విధానంలో డ్యూటీ ఉండగా, డ్యూటీ డాక్టర్లు మాత్రం ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 8 గంటల వరకు ఇక్కడ సేవలందించాలి. వీరితో పాటు ఇతర స్పెషాలిటీ వైద్యులు మాత్రం ఆన్‌కాల్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కానీ డ్యూటీ డాక్టర్లు సైతం ఇప్పుడు ఆన్‌కాల్ వైద్యం చేస్తున్నారు. కొందరైతే ఫోన్‌లోనే క్యాజువాలిటీలో విధులు నిర్వర్తించే పీజీలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. శని, ఆదివారాల్లో అయితే ఈ వైద్యులు ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండరు. డ్యూటీ డాక్టర్లు లేని కారణంగా కొన్నిసార్లు అవసరం లేకున్నా ఆపరేషన్లు జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. గుండెజబ్బుల రోగుల విషయంలోనూ సరైన వైద్యం అందక రోగులు కన్నుమూసే పరిస్థితి ఇక్కడ నెలకొంది.
క్యాజువాలిటీ డ్యూటీలంటే కోపం
క్యాజువాలిటీలో డ్యూటీలు చేయాలంటేనే కొందరు వైద్యులకు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇందుకోసం వారు ఉన్నతాధికారులతోనూ ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్తున్నారు. సీఎంవోలుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ కేడర్ వైద్యులను నియమిస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లను రోస్టర్ ప్రకారం డ్యూటీలు వేస్తారు. ప్రభుత్వం కాంట్రాక్టు వైద్యులకు జీతాలు ఇవ్వకపోవడంతో గతంలో ఇక్కడ పనిచేసే వైద్యులు పని మానుకున్నారు. ఫలితంగా ఇటీవల ఫ్యామిలి ప్లానింగ్, ఆర్థోపెడిక్ విభాగాల్లో పనిచేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లనూ డ్యూటీలు వేస్తున్నారు.
క్యాజువాలిటీలో డ్యూటీ అంటే పోలీసు కేసులుంటాయని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని కొందరు వైద్యుల భయం. ఇటీవల ఓ వైద్యుడు ఇక్కడ డ్యూటీ వేయగానే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయాడు. మరికొందరు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నా క్యాజువాలిటీలో మాత్రం ఉండటం లేదు. కొందరు వైద్యులు ఒకేసారి ఎంఎల్‌సీ బుక్‌లలో సీలు వేసి, సంతకాలు చేసి వెళ్తుండగా, మరికొందరు రాకపోవడంతో డ్యూటీలో ఉండే హౌస్‌సర్జన్లే సంతకాలు చేసి ఎంఎల్‌సీ సమాచారాన్ని పోలీసులకు పంపిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామానికి చెందిన సుజాత ఈ నెల 5వ తేదీన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స కోసం ఆమెను కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి 7.30 గంటలకు క్యాజువాలిటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో సీఎంవో లేకపోవడంతో ఆయన పేరుతో సంతకం చేసి క్యాజువాలిటీ సిబ్బంది ఎంఎల్‌సీ పోలీసులకు పంపించారు.