నడుం నొప్పికి ఆపరేషనా?
న్యూరో కౌన్సెలింగ్
నా వయసు 38 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లడానికీ, అక్కడ్నుంచి రావడానికి అంటూ దాదాపు 50 కి.మీ. పైనే బైక్ మీద తిరుగుతుంటాను. ఇటీవల తీవ్రంగా నడుము నొప్పి బాధిస్తోంది. దీంతో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించారు. ఆయన ఏకంగా నడుముకు శస్త్రచికిత్స చేయాలన్నారు. కేవలం నడుము నొప్పి అంటే సర్జరీ అంటున్నారేమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
- రజనీ, తార్నాక (హైదరాబాద్)
ఈమధ్య కాలంలో చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్‌పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేసుకుంటూ ఆపై ఆఫీసుకు బండి మీద వెళ్లి అక్కడ కూడా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్థమతువోతంది.
మీరు వెన్నుపూసకు ఎక్స్‌రే తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లయితే మీరు ‘స్పాండిలోలిస్తెసిస్’ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందులతోనే నయమైతే, మరికొందరికి నడు కింది భాగంలో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూస లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్క్రూస్, రాడ్స్ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు.
ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్ చేసే విధానాలలో సురక్షితమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్ నిర్వహించగలుగుతారు. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీ-హోల్ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా మర్నాడు రోగిని ఇంటికి పంపించేస్తారు. కాబట్టి మీ ఉద్యోగానికి కూడా ఎక్కువ రోజులు సెలవు పెట్టుకోనవసరం లేదు.
- డాక్టర్ ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం
సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్