మంచి పోషకాహారంతోనే క్యాన్సర్‌కు చెక్! | Good nutrition with cancer to check | Sakshi
Sakshi News home page

మంచి పోషకాహారంతోనే క్యాన్సర్‌కు చెక్!

Published Mon, Feb 8 2016 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

Good nutrition with cancer to check

హోమియో కౌన్సెలింగ్
 
నా వయస్సు 34 ఏళ్లు. నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూడేళ్ల క్రితం కిడ్నీలో రాళ్ల సమస్యకి శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు కొంత కాలం నుండి మళ్లీ విపరీతమైన నడుం నొప్పితో పాటు మూత్రంలో మంటగా ఉంటుందని డాక్టరు గారిని సంప్రదిస్తే మళ్లీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. అసలు ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి. నా ఈ సమస్యకి పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? - సత్యనారాయణ, అమలాపురం

మీరు ఆందోళన చెందకండి. మీ ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణ సమస్యగా మారుతోంది. మన శరీరంలో మూత్ర పిండాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి శరీరంలోని లవణాల సమతుల్యతను కాపాడతాయి. మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటిక రూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్ర వ్యవస్థలో భాగం అయిన మూత్రపిండాలు, మూత్రకోశంలో ఎక్కడైనా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నిటినీ వాడుక భాషలో కిడ్నీలో రాళ్లు అని అంటుంటాం.

కారణాలు: చాలామందిలో కిడ్నీలో రాళ్లు అనగానే పాలకూర, టొమాటో తినడం ద్వారా ఏర్పడతాయనే అపోహ ఉంటుంది కానీ ఇవి ప్రేరేపకాలు మాత్రమే. అధిక మోతాదులో ఆక్సలేట్స్, కాల్షియం, యూరిక్ యాసిడ్, సిస్టీన్ వంటి కరగని పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రకోశం ఇన్ఫెక్షన్లు, మూత్ర మార్గంలో అడ్డంకులు ఏర్పడటం, హైపర్ పారాథైరాయిడిజం, హైపర్ కాల్సేమియా, చిన్న ప్రేగు ఆపరేషన్లు, రేనల్ ట్యూబులార్ అసిడోసిన్, ఆస్ప్రిన్, ఆంటాసిడ్స్, విటమిన్-సి వంటి కొన్ని మందుల వల్ల, కాల్షియం సప్లిమెంట్లు వల్ల, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం, శరీరంలోని విటమిన్-ఎ శాతం తగ్గడం, అధిక మోతాదులో సోడియం (ఉప్పు) తీసుకోవడం, మంచి నీరు రోజుకి 1.5 లీటర్ల కంటే తక్కువ మోతాదులో సేవించటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి. తగిన వైద్యచికిత్స తీసుకుంటే, హోమియో ద్వారా వీటిని మళ్లీ రాకుండా చేయవచ్చు.
 
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
 
 నా వయసు 44 ఏళ్లు. నాకు కుడిపైపు తుంటి భాగంలో నొప్పి వస్తోంది. గత ఆర్నెల్లుగా ఈ నొప్పి ఉంటోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. మా దగ్గర ఎముకల నిపుణుడిని సంప్రదిస్తే ఇది తుంటి ఎముక చివరలో ఉండే బంతి లాంటి భాగం దెబ్బతిన్నదనీ, అది ఒక రకం ఆర్థరైటిస్ అనీ చెప్పారు. నాకు హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరమని అన్నారు. కానీ నేను పనిచేసే చోట ఉన్న ఉన్న మిత్రులు మాత్రం అది పనివల్ల వస్తోందనీ, సర్జరీ అవసరం లేదనీ అంటున్నారు. నేను చాలా మెల్లిగా మాత్రమే నడవగలుగుతున్నాను. వేగంగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఇది నన్ను చాలా ఆందోళన పరుస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - సుధాకర్, కోదాడ

 మీ ఫ్రెండ్స్ చెప్పినట్లే చాలామందిలో తుంటి ఎముక మార్పిడి (టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ) అనే శస్త్రచికిత్స మీద చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. ఒకవేళ మీ ఆర్థోపెడిక్ సర్జన్ అదే సమస్య అని నిర్ధారణగా చెబితే, మరో నిపుణుడి నుంచి రెండో అభిప్రాయం (సెకండ్ ఒపీనియన్) తీసుకోవడంలో తప్పులేదు. అయితే తుంటి ఎముక మార్పిడి మీద ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలు సరికాదు. అది గత 30 ఏళ్లుగా సురక్షితంగా చేస్తున్న ప్రక్రియ. నిపుణులైన డాక్టర్లు దాన్ని చేయడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ రావు. పైగా అది చేశాక ఆటలాడవద్దు అని ముందుజాగ్రత్తగా డాక్టర్లు చెప్పినా, పాశ్చాత్య దేశాల్లో చాలామంది సోర్ట్స్ వంటివి ఆడుతూనే ఉంటారు. టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీతో దుష్ర్పభావాలు (కాంప్లికేషన్లు) కనిపించే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే. కాబట్టి మీరు సర్జరీ గురించి అపోహలు పెట్టుకోవద్దు. కాకపోతే నిపుణులను సంప్రదించి, రెండో అభిప్రాయం మాత్రం తీసుకోండి.
 
నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. తగిన సలహా ఇవ్వండి.
 - సుజాత, తిరుపతి

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తాం. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ) అవసరమవుతుంది.

డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్
హైదరాబాద్
 
క్యాన్సర్ హెల్త్ కౌన్సెలింగ్

 
మా బాబు వయసు తొమ్మిదేళ్లు. గత కొంతకాలంగా బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కీమోథెరపీ ద్వారా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నాం. అయితే... వాడు సరిగ్గా తినడం లేదు. ఎంత బతిమాలినా మెతుకు ముట్టడం లేదు. ఒకవైపు ట్రీట్‌మెంట్ ఇస్తుండటం మరోవైపు సరిగా తినకపోవడంతో వాడు చాలా నీరసంగా తయారవుతున్నాడు. వాడికి నయమవుతుందా... వాడూ అందరు పిల్లల్లా ఎదగగలుగుతాడా అని మాకు చాలా బెంగగా ఉంది. దయచేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపండి.
 - మాలతి, హైదరాబాద్

క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు మంచి పోషకాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నప్పటికీ సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోతే అది వృథానే అవుతుంది. క్యాన్సర్ నిర్మూలనకు పోషకాహారం చాలా ముఖ్యపాత్రను పోషిస్తుంది. సంపూర్ణ పోషకాహారం లేకపోయినా క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. మీ బాబుకి కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు కాబట్టి కొన్ని తాత్కాలికమైన సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల నోరు ఎండిపోయినట్టు అయి, నాలుకకు రుచిలేకపోవడం, వాంతులు, డయేరియాలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే... బాబుకు పోషకాహారం అందించడం చాలా అవసరం. ఇందుకు మీరు ఒక డైట్‌చార్ట్ తయారు చేసుకోవాలి. బాబుకు ఏది ఇష్టంగా అనిపిస్తే అది వండిపెడుతుండాలి. అది తినకూడదు... ఇది తినకూడదు అని చెప్పకుండా అతడికి ఏది ఇష్టంగా తింటుంటాడో అది పెడుతూనే మరోపక్క సంపూర్ణ పోషకాహారంపై దృష్టిపెట్టాలి. ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండే ఆహారాన్ని ఎక్కువస్థాయిలో బాబుకు అందించాలి. ఒక్కసారే ఎక్కువగా పెట్టకుండా కొంచెం ఎక్కువసార్లు తినేలా చూడండి. అలాగే మధ్యమధ్యన ఫ్లూయిడ్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ లాంటివి ఇవ్వండి. డల్‌గా కాకుండా యాక్టివ్ ఎప్పుడుంటాడో గమనించి ఆ సమయాల్లో కాస్త ఎక్కువగా తినిపించండి. చల్లనివి, సాల్టీవీ, స్పైసీగా ఉండేవి, ఫ్లేవర్స్‌తో కూడుకున్న ఆహారం ఈ సమయల్లో నోటికి బాగుంటుంది. కొవ్వు, స్వీట్స్ జోలికి వెళ్లకండి. అందరూ కలిసి అతడితో భోంచేయండి. మీరు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి.
 
డాక్టర్ భరత్ వాస్వానీ
సీనియర్ హెమటో ఆకాంలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement