రోడ్డు ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన చేయి గోల్డెన్ అవర్ దాటిన తర్వాత అపోలో ఆస్పత్రికి రోగి.. 8 గంటల పాటు శ్రమించి అతికించిన వైద్య బృందం
సాక్షి, హైదరాబాద్: రోడ్డుప్రమాదంలో పూర్తిగా తెగిపడిపోయిన చేయిని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్తి వైద్యులు విజయవంతంగా అతికించారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన తొలి గంట)సమయం దాటిపోయిన తర్వాత కూడా అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించటం గమనార్హం. మంచిర్యాలకు చెందిన పవన్‌కుమార్ అనే వ్యక్తి అక్టోబర్ 11న బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగి మోచేయి పై భాగంవరకు తెగి పడిపోయింది. తెగిన చేయిని ఓ కవర్‌లో చుట్టి అతడిని హుటాహుటిన మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి డాక్టర్లు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రిఫర్ చేశారు. పవన్‌కుమార్‌ను హైదరాబాద్‌కు తరలించే సమయానికి అప్పటికే గోల్డెన్ అవర్ కూడా దాటిపోయింది.
అయినప్పటికీ 8 గంటల పాటు శ్రమించి క్లిష్టమైన మైక్రోవ్యాసు్కలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి చేయిని తిరిగి అతికించారు. సాధారణంగా వేలు కానీ, చిన్న అవయవం కానీ తెగిపడిపోతే సులువుగానే అతికించవచ్చని, పూర్తి చేయిని అతికించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స వివరాలను బుధవారం మీడియా సమావేశంలో అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ మైక్రో సర్జన్ డాక్టర్ జీఎన్ భండారి వెల్లడించారు. 26 రోజుల్లోనే పవన్ కోలుకున్నాడని తెలిపారు. అతికించిన చేయి వేళ్లు తిరిగి పనిచేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని, ఇందుకోసం మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
తెగిన వెంటనే జాగ్రత్త చేయాలి
తెగిపోయిన శరీర భాగాలను అతికించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భండారి అన్నారు. తెగిపోయిన శరీర భాగాలను నీటితో కడిగి, పాలిథీన్ కవర్ లేదా అల్యూమినియం కవర్‌లో ఉంచాలని తెలిపారు. ఆ కవర్‌ను ఐస్‌ప్యాక్‌లో పెట్టి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అయితే నేరుగా ఐస్‌లో ఉంచితే అవయవం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అప్పుడు తిరిగి అతికించడం సాధ్యం కాదని వివరించారు.
పుట్టుకతో లోపాలు, విరిగిపోయిన చేతులు, పక్షవాతం వంటి వ్యాధుల కారణంగా చేతులు, కాళ్లు పనిచేయకపోతే బ్రెయిన్ డెడ్ అయిన వారి భాగాలను అతికించే అవకాశం ఉందని తెలిపారు. మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ బాబు, శస్త్ర చికిత్సలో పాలుపంచుకున్న డాక్టర్ గురుప్రసాద్ (ప్లాస్టిక్ సర్జన్), డాక్టర్ వివేక్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ శరణ్య (అనస్తీషియా) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment