మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్ వరుస మరణాల(Mysterious Deaths)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతుచిక్కని అంటువ్యాధితో మరణిస్తున్నారనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. అయితే విషపూరిత పదార్థాల వల్లే వరుస మరణాలు సంభవించాయని, ఈ వ్యవహారంపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని గురువారం ప్రకటించింది.
రాజౌరీ(Rajouri) జిల్లాలోని ఓ గ్రామంలో నెలవ్యవధిలో 17 మంది వరుసగా ఒకే తరహా లక్షణాలతో జబ్బుపడి మరీ చనిపోయారు. చనిపోయిన వాళ్లలో చిన్నపిల్లలే(13) ఎక్కువగా ఉన్నారు. వాళ్ల మరణాలకు విషపూరిత పదార్థాలే కారణమని కేంద్రం నిర్ధారించింది. అయితే ఆ టాక్సిన్ ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైన్స్&టెక్నాలజీ మంత్రి(స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.
‘‘లక్నోలోని సీఎస్‌ఐఆర్(CSIR) ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో.. ఇది వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షనో కాదని తేలింది. మృతదేహాల నుంచి సేకరించిన నమునాల్లో విషపదార్థాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ విషపదార్థాలు ఏంటన్న దానిని నిర్ధారించుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వారం, పదిరోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది’’ అని ఆయన తెలిపారు. ఇక అన్నికోణాల్లో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఏదైనాకుట్ర ఉందని తేలితే.. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) నిర్వహించిన విశ్లేషణలోనూ ఇంతకు ముందు విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది.
డిసెంబర్ 7 నుంచి జనవరి 19వ తేదీల మధ్యలో రాజౌరీలోని బధాల్ అనే కుగ్రామంలో ఈ వరుస మరణాలు(Serial Deaths) సంభవించాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, విపరీతంగా చెమటలు పోయడం, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. పైగా మూడు కుటుంబాలకే చెందిన వ్యక్తులు వరుసగా జబ్బు చేసి మరణించడం గమనార్హం. పైగా ఆ కుటుంబాలకు చెందిన బంధువులు చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. అయితే అనూహ్యంగా వాళ్లలో కూడా కొందరు ఇదే రీతిలో జబ్బు పడ్డట్లు సమాచారం. అందులోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో బుధవారం అక్కడి అధికారులు బధాల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సుమారు 40 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇక ప్రజల్లో ఆందోళన నెలకొన్న దృష్ట్యా.. బహిరంగా జనం గుమిగూడటంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరుస మరణాలతో జమ్ము కశ్మీర్‌లో హెల్త్ ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటిస్తారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే వైద్య ఆరోగ్య అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. ఆ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు.
నమునాల్లో న్యూరోటాక్సిన్స్ ఉన్నట్లు తేలడంతో.. కుట్ర కోణం తెర మీదకు వచ్చింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు కశ్మీర్ పోలీస్ శాఖ సిట్‌ను ఏర్పాటుచేసింది. మంగళవారం బధాల్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రకటించారు. మరోవైపు.. వరుస మరణాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కశ్మీర్‌కు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment