ఈవీఎంలపై రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్
అవే మాటలను వల్లించిన ఒమర్ అబ్దుల్లా
చర్చనీయాంశంగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది బాగా వాడుకలో ఉన్న నానుడి. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్పరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా తాజా ప్రకటనలు ఇదే తరహాలో ఉన్నాయి. కాషాయ పార్టీకి ఆయన దగ్గరవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంపై ఆయన చేసిన వాఖ్యలు బీజేపీతో సామీప్యతను సంతరించుకోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇదంతా కాకతాళీయంగా జరిగింది కాదన్న అభిప్రాయాలు ప్రత్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత రోజే ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడారు. అయితే స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో విజయాలను తమ ఖాతాలో వేసుకుని, అపజయాలను మాత్రం ఈవీఎంలపైకి నెట్టేయడం సరికాదన్న చందంగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. సరిగ్గా అమిత్ షా ఏదైతే అన్నారో అలాగే కశ్మీర్ సీఎం స్పందించారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నారని, ఈ దశాబ్దంలోనే ఉత్తమ పనితీరు కనబరిచామని పొంగిపోయారని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా కమెంట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచాను కాబట్టి ఈవీఎంలు బాగా పనిచేశాయని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. జార్కండ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈవీఎంలు కరెక్ట్‌గానే పనిచేస్తున్నాయని అనుకున్నారు. మహారాష్ట్రలో ప్రజలు ఓడించేసరికి ఈవీఎంలు వారికి చెడుగా కన్పిస్తున్నాయి. పని చేతగానివాడు పనిముట్లను నిందించిట్టుగా రాహుల్ గాంధీ వ్యవహారం ఉంద’ని అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్‌ను తప్పుబట్టిన ఒమర్ అబ్దుల్లా
మరుసటి రోజు ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే లైన్‌లో మాట్లాడారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదని హితవు పలికారు. ఈవీఎంలతోనే లోక్‌సభ ఎన్నికల్లో 100 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ మహారాష్ట్ర ఫలితాల తర్వాత మాట మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాతీర్పుపై విశ్వాసం లేనట్టుగా మాట్లాడం మానుకోవాలని, ఓటమికి ఈవీఎంలను బాధ్యులు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సీఎం అయ్యాక ఆయన ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో అంటూ ప్రశ్నించింది.
చదవండి: EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?
బీజేపీపై సీఎం అబ్దుల్లా ప్రశంసలు
అయితే ఇక్కడితో ఆగిపోకుండా బీజేపీపై ప్రశంసలు కురిపించారు కశ్మీర్ సీఎం అబ్దుల్లా. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎంతో మంచిదని, కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం అద్భుతమైన ఆలోచన అంటూ కాషాయపార్టీని పొగిడారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారన్న వాదనను ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. జమ్మూకశ్మీర్‌కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్దరణ కోసం అమిత్‌షాను బుధవారం ఢిల్లీలో సీఎం అబ్దుల్లా కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment