ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల మధ్య ఓ తేడా ఉంది. ఇద్దరూ పోటాపోటీగా రాష్ట్రం చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నెట్టేస్తూంటారు. జరిగిన ప్రతి మంచిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూంటారు. కారణమేమిటో తెలియదు కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచిని అనివార్యంగానైనా గుర్తిస్తున్నారు. ఏదో మాటవరసకు బాబుగారిని పొగుడుతూన్నట్టు కనిపిస్తాడేగానీ పవన్ ఆంతర్యం మొత్తం గత ప్రభుత్వం తాలూకేనని తేలికగానే అర్థమైపోతుంది.
పవన్ ఈ మధ్యే కర్నూలు జిల్లా పెన్నాపురం వద్ద ‘గ్రీన్ కో’ సంస్థ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్తు ప్లాంట్లను పరిశీలించారు. వెళ్లకముందు ఆ కంపెనీ అటవీ భూములను ఆక్రమించిందని, విచారించాలని అధికారులకు సూచించారు. కానీ.. ఆ తరువాత మాత్రం ప్రాజెక్టు ఒక అద్భుతమని కొనియాడారు. బహుశా వ్యతిరేక వ్యాఖ్యలు ఎల్లో మీడియా ఈ ప్రాజెక్టుపై రాసిన తప్పుడు కథనాల ఫలితం కావొచ్చు. సుమారు రూ.28 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసింది అందరికీ తెలిసిందే. అంతెందుకు అప్పట్లో టీడీపీ నేతలు కొందరు ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై విమర్శలు చేసినా జగన్ వాటిని పట్టించుకోలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న కృత నిశ్చయంతో కంపెనీకి అవసరమైన వనరులను సమకూర్చారు.
ఈ గ్రీన్ కో కంపెనీలో ముఖ్యుడు చలమలశెట్టి సునీల్ 2024లో వైఎస్సార్‌సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. ఈ కారణంగా ఆ కంపెనీపై టీడీపీ, జనసేన ముఖ్యనేతలకు గుర్రుగా ఉండేది. ఆ క్రమంలోనే గ్రీన్ కో రిజర్వు ఫారెస్ట్ పరిధిలో అటవీభూముల ఆక్రమణకు పాల్పడిందని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందని, అటవీశాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఆరా కూడా తీశారని ఎల్లో మీడియా ఈనాడు ఒక వార్తను రాసింది. గతంలో సునీల్‌కు ప్రజారాజ్యం, టీడీపీ పక్షాలతో కూడా అనుబంధం ఉంది. అయినా గతసారి వైఎస్సార్‌సీపీ పక్షాన పోటీచేశారు కాబట్టి ఎలాగోలా ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా ప్రయత్నించింది. అందులో భాగంగానే గత మార్చిలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ఎంత ఘోరంగా రాసిందో చూడండి..
'అస్మదీయుడికి అదిరేటి ఆఫర్" అంటూ సునీల్ కుటుంబ కంపెనీకి భారీ భూ సంతర్పణ చేశారని, అది కూడా ఎకరా రూ.ఐదు లక్షలకే అని ప్రచారం చేసింది. సుమారు 1500 ఎకరాల భూమిని పరిశ్రమకు ఇవ్వడంపై విషం కక్కింది. అక్కడ విలువ రూ.కోటి ఉంటే తక్కువ ధరకు ఇచ్చారని ఏడ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో కొంతకాలం గ్రీన్ కో పై తప్పుడు రాతలు రాసిందని చెప్పవచ్చు. ఉదాహరణకు 2024 జూలై 18 న ఒక కథనాన్ని వారి టీవీలో ప్రసారం చేస్తూ ‘అడవి తల్లికి గాయం’ అని కంపెనీని ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అదే నెలలో అంతకుముందు వారి పత్రికలో కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని దుర్మార్గంగా రాసింది. ఆ తర్వాత ఏమైందో కాని మొత్తం ప్లేట్ మార్చేసింది.
వారి పత్రికలో 'జల కిరణాలు" అనే శీర్షికన ఈ ప్రాజెక్టును ఆకాశానికి ఎత్తేసింది. ఎత్తైన కొండలు, కశ్మీర్ అందాలు తలపించే లోయలు, జల హోయలు, సౌర ఫలకలు, గాలిమరలు, అబ్బుర పరుస్తున్నాయని ఇదే పత్రిక తెలిపింది. ఎండ, నీరు, గాలి ఆధారంగా చేసే విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ లేని విధంగా నిర్మిస్తున్నారని పేర్కొంది.ఆ కంపెనీతో ఈనాడుకు లాలూచీ అయిందా? లేక బుద్ది తెచ్చుకుని వాస్తవాలు రాసే యత్నం చేసిందా? అన్న ప్రశ్నకు ఎవరు జవాబు ఇస్తారు? ఈ ప్రక్రియలో ఎక్కడా జగన్‌కు క్రెడిట్ ఇవ్వకుండా మాత్రం జాగ్రత్తపడింది.
పవన్‌కు ఆ కంపెనీ వారితో ఉన్న పరిచయాలు లేదా సంబంధ బాంధవ్యాల రీత్యా ప్రత్యేకంగా అక్కడకు వెళ్లారు. దానిని పూర్తిగా తిలకించిన తర్వాత ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని మెచ్చుకున్నారు.ఇది పూర్తి అయితే విదేశాలకు కూడా కరెంటు అమ్మవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగాను, మరో 40 వేల మందికి పరోక్షంగాను ఉపాధి వస్తుందని కూడా ఆయన తెలిపారు. ఈ మాట విన్న తర్వాత ‘‘హమ్మయ్యా.. ఇప్పటికే ఏపీలో పలు విధ్వంసాలు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదలి వేసిందిలే!’’ అనే భావన ఏర్పడింది. ఇది జగన్ ప్రభుత్వ కృషి అని పవన్ ప్రశంసించకపోయినా, ప్రజలందరికి అర్థమైపోయింది. జగన్ ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు ఈ రూపు సంతరించుకుందని.. ఆ రకంగా సోషల్ మీడియాలో విస్తారంగా వీడియోలు వచ్చాయి.
ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లి ఇది ప్రైవేటు స్కూలేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డులు అన్నిటిని గమనించిన ఆయన స్కూల్ ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అంతకుముందు లోకేష్ కూడా ఒక స్కూల్ కు వెళ్లినప్పుడు అదే అనుభవం ఎదురైంది. అంటే ప్రతిపకక్షంలో ఉన్నప్పుడు ఎంత విష ప్రచారం చేసినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తరువాతైనా జగన్ చేసిన మంచిని, అభివృద్దిని ఏదో రకంగా ఒప్పుకోక తప్పలేదు.
జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలు, గ్రామ, గ్రామాన నిర్మించిన సచివాలయ భవనాలు, పోర్టులు మొదలైన వాటిని అప్పుడు ప్రజలు గుర్తించారో లేదో కాని, ఇప్పుడు కూటమి నేతలు పర్యటించినప్పుడు జనానికి అర్థమవుతున్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తన శైలిలోనే ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తన గొప్పతనమని, వైఎస్సార్‌సీపీ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శలు చేస్తుంటారు. దావోస్ పర్యటనలో కూడా ఏపీలో నిర్మాణం చేస్తున్న పది ఓడరేవుల గురించి చంద్రబాబు చెప్పక తప్పలేదు. అవన్నీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నారన్నది తెలిసిన సంగతే.
కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ హరిత ఇంధన హబ్ గా అవుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకుంటే చెప్పుకున్నారు కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. జగన్ తన హయాంలో సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలోకి తీసుకు వచ్చారు. అప్పుడేమో ఎల్లో మీడియా ‘అదానీ వంటి కంపెనీలకు ఏపీని రాసిచ్చేస్తున్నారు’ అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేసింది. భూములను లీజుకు ఇప్పించడాన్ని కూడా తప్పు పట్టింది. ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తోంది. మరి దీనిని ఏమనాలి?
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment