
సంగారెడ్డి, సాక్షి: పటాన్‌చెరులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాత కాంగ్రెస్ క్యాడర్ గురువారం నిరసనకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో కాట వర్గీయులు మహిపాల్ దిష్టిబొమ్మను తగలబెట్టాలని చూశారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రవాగ్వాదంతో తోపులాట జరిగింది.

నిరసనగా.. సీఎం చిత్రపటంతో కొందరు కార్యకర్తలు పోలీసులను దాటుకుని ఎమ్మెల్యే కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆఫీస్‌ను ముట్టడించి.. లోపల సీఎం ఫొటో ఉంచారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్తతల నడుమ.. పటాన్‌చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
గత కొంతకాలంగా పటాన్‌చెరు కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మద్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ పంచాయితీని సర్దుబాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే రానురాను ఆ పరిస్థితులు మరింత ముదిరాయి. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో..బొల్లారంలో ఓ కార్యక్రమానికి హాజరైన గూడెం పాత వర్గాన్ని బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో సేవ్ కాంగ్రెస్ .. సేవ్ పటాన్‌చెరు స్లోగన్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఇవాళ కాంగగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగడం.. పోలీసుల జోక్యం టెన్షన్ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment