నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చివరకు నిందితుడు పట్టుబడడంతో ప్రతిపక్షాల విమర్శలకు పుల్‌స్టాప్ పడింది. అయితే ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఘటన జరిగాక ఐదు రోజులకు నటుడు సైఫ్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ పరిణామం ఆధారంగా నితేష్ రాణే తన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే దాడి జరిగిందా? లేక ఆయన నటించారా? అని ప్రశ్నించారాయన. పనిలో పనిగా ప్రతిపక్షాలను ఆయన తిట్టిపోశారు.
పుణేలో జరిగిన ఓ ఈవెంట్‌లో రాణే మాట్లాడుతూ.. ఆస్పత్రి నుంచి ఆయన బయటకు వచ్చేటప్పుడు చూశా. ఆయన్ని నిజంగానే పొడిచారా? లేకుంటే నటిస్తున్నారా? అనే అనుమానం కలిగింది నాకు అని అన్నారు. అలాగే ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతం కూడా నాకు అలాగే అనిపించింది. కేవలం ఖాన్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు స్పందిస్తారా?.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించరా? అని ప్రశ్నించారాయన.
సుప్రియా సూలే.. సైఫ్ అలీ ఖాన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. షారూక్ కొడుకు గురించి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ గురించి బాధపడ్డారు. కానీ, ఓ హిందూ నటుడి కష్టాల గురించి ఆమె ఏనాడైనా ఆలోచించారా?. అన్నారు.
గతంలో బంగ్లాదేశీయులు ముంబై ఎయిర్‌పోర్టు వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లలో చొరబడుతున్నారు. బహుశా వాళ్లు ఆయన్ని(సైఫ్)ను తీసుకెళ్లడానికే వచ్చి ఉంటారేమో! అని రాణే సెటైర్ వేశారు.
మహా మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే తనయుడే ఈ నితీశ్ నారాయణ రాణే. శివసేనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. కాంగ్రెస్, ఆపై బీజేపీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనకవల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాటట్రిక్ ఎమ్మెల్యే ఘనత అందుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
నితీశ్ నారాయణ రాణేకు వివాదాలూ కొత్తేం కాదు. 2009లో మరాఠీ చిత్రం ‘జెండా’లో తన తండ్రి నారాయణ రాణే పాత్రను అభ్యంతరకంగా చూపించారంటూ నిరసనలకు దిగి తొలిసారి ఆయన మీడియాకు ఎక్కారు. ఆపై ఓ చిరువ్యాపారిపై హత్యాయత్నం చేశారనే కేసు నమోదు అయ్యింది. 2013లో ముంబైని గుజరాతీలు విడిచివెళ్లిపోవాలంటూ మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అదే ఏడాదిలో గోవాలో ఓ టోల్‌బూత్‌ను ధ్వంసం చేసిన కేసులో అరెస్టయ్యారు. 2017లో ఓ ప్రభుత్వ అధికారిపైకి చేపను విసిరిన కేసులో, 2019లో ఓ అధికారిపై దాడి చేసిన కేసులో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. తాజాగా.. కిందటి నెలలో కశ్మీర్‌ను మినీ పాకిస్థాన్‌గా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆపై కేరళ అంటే అందరికీ ఇష్టమేనంటూ మాట మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment