
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) మీద దుండగుడి దాడి ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్(Yogesh Kadam) పుణెలో శుక్రవారం(జనవరి17) మీడియాతో మాట్లాడారు. సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని కదమ్ పేర్కొన్నారు.
ఈ దాడి అండర్‌వరల్డ్ గ్యాంగ్‌ల ప్రమేయం ఏమీ లేదన్నారు. సైఫ్‌పై దాడి చేసినట్లుగా భావించి ఓ అనుమానితుడి ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి దగ్గర పోలికలు ఉన్న ఈ యువకుడికి నేర చరిత్ర ఉందన్నారు.అయితే, సైఫ్‌పై దాడి ఘటనతో అతడికి సంబంధం లేదని గుర్తించినట్లు చెప్పారు.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో మరో వ్యక్తిపై కూడా పోలీసులు నిఘా ఉంచారని చెప్పారు. దుండగుల నుంచి బెదిరింపు వచ్చినట్లు సైఫ్ నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని,సెక్యూరిటీ కూడా అడగలేదని చెప్పారు.
ఒకవేళ భద్రత కోరితే నిబంధనల ప్రకారం కల్పిస్తామన్నారు. మరోవైపు సైఫ్ శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీసినట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన వెన్నెముకకు తృటిలో ప్రమాదం తప్పిందన్నారు. ఆయన మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముంబై బాంద్రా ప్రాంతంలోని సైఫ్ ఇంట్లోనే అతడిపై దాడి జరిగింది. అర్ధరాత్రి చోరీకి యత్నించిన దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా సైఫ్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అనంతరం తీవ్ర గాయాలతో సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరారు.
ఇదీ చదండి: ఫస్ట్ టార్గెట్ సైఫ్ కాదట..