బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత.. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడట! షారూఖ్ నివాసమైన మన్నత్‌లో జనవరి 14న చోరీకి పథకం రచించాడట! కానీ అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడని తెలుస్తోంది. దీంతో అతడు పటిష్ట భద్రత లేని సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎంచుకున్నాడు.
ఏం జరిగిందంటే?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసముండే బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి జనవరి 16న గుర్తు తెలియని దుండగుడు దూరాడు. సైఫ్ చిన్న కుమారుడు జెహ్ (Jehangir Ali Khan) గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను గమనించిన పనిమనిషి బిగ్గరగా కేకలు వేసింది.
ఆ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ పరుగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో దుండగుడు సైఫ్‌ను విచక్షణారహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆరు కత్తిపోట్లతో రక్తమోడుతున్న సైఫ్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారు కూడా సిద్ధంగా లేకపోవడం శోచనీయం. దీంతో నటుడి పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటోలో తండ్రిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరగ్గా ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment