బాలీవుడ్ ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. డబ్బు కోసమే ఇదంతా చేశాడని తెలియడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ (Bandra West) ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లోకి తెల్లవారుజామున 2 గంటలకు ఒక దుండగుడు దూరడం ఆపై సైఫ్ అలీ ఖాన్‌పై విచక్షణంగా దాడి చేయడంతో ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి.
కోటి రూపాయలు డిమాండ్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి దాడి చేసిన వ్యక్తి మొదట కోటి రూపాయలు డిమాండ్ చేశాడని అక్కడి పనివారు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీన్స్, టీ–షర్టు ధరించిన దుండుగుడు సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలోకి ప్రవేశించాడు. తొలుత తనను గమనించి కేకలు వేసిన పని మనిషి ఎలియామ ఫిలిప్స్‌పై కత్తితో దాడి చేశాడు.
ఈ క్రమంలో ఆమెను బంధించాడు. కోటి రూపాయలు ఇస్తేనే వదిలేస్తానంటూ బేరం పెట్టాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న సైఫ్ అదేమీ పట్టించుకోకుండా అతడిని ధైర్యంగా ఎదిరించాడు. ఈ క్రమంలో దుండగుడు కత్తితో విచక్షణారహితంగా సైఫ్‌ను పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన సైఫ్‌ను ఆసుత్రికి అతి కష్టం వీద తరలించారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలైనట్లు వారు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి చేరుకుంటారని వెల్లడించారు.
దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. బాంద్రా పోలీసులు అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment