nitesh rane
-
నితీశ్ రాణే లొంగుబాటు
ముంబై: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి నారాయణ్ రాణె కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణె బుధవారం సాయంత్రం సింధుదుర్గ్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. దీంతో జిల్లాకోర్టు ఆయనను జ్యూడీషియల్ కస్టడీకి పంపించినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరట్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నితేష్ రాణెను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో వాదించాల్సి ఉందని తెలిపారు. అంతకుముందే బోంబే హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. కోర్టులో రాణె లొంగిపోతానని, విచారణకు సహకరిస్తానని ఒప్పుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. నితేశ్ రాణేకు కోర్టులో చుక్కెదురు బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణెకు సింధుదుర్గ్ జిల్లా సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. అరెస్టుకు ముందు బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తును మంగళవారం సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో నితేష్ రాణె అరెస్టు విషయం ఆయన మెడపై వేలాడుతున్న కత్తిలా తయారైంది. డిసెంబరు 18న సింధుదుర్గ్ జిల్లా బ్యాంకు ఎన్నికల ప్రచార సభలో శివసేన కార్యకర్త సంతోష్ పరబ్‌పై దాడి జరిగింది. ఈ దాడి ఘటన వెనుక నితేష్ రాణెతోపాటు ఆయన సహచరుడు గోట్యా సావంత్ హస్తముందని ఆరోపిస్తూ స్థానిక కణకావ్లీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే రాణే అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని స్థానిక కణకావ్లీ సివిల్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సివిల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించా రు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు సింధుదుర్గ్ జిల్లా సెషన్స్ కోర్టునే ఆశ్రయిం చాలని సలహా ఇచ్చింది. ఆయనకు రక్షణ కల్పిస్తూ పది రోజుల వరకు అరెస్టు చేయవద్దని కూడా ఆదేశించింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే జనవరి 31నాటి విచారణలో నితేష్ రాణె తరఫు న్యాయవాది సతీశ్ మాన్‌షిండే, ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రదీప్ ఘరత్ ఈ అంశంపై వాదనలు విన్పించారు. తీర్పు మంగళవారం మధ్యాహ్నం వెల్లడిస్తామని చెప్పి వాయిదా వేశారు. వాదోపవాదాల అనంతరం నితేష్ రాణె బెయిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తీర్పునిచ్చారు. -
ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు కొనసాగుతుండగా మరోవైపు ముంబైలోషాకింగ్ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ కారిడార్ లో మృతదేహాలు స్ట్రెచర్లపై పడి ఉన్నాయి. ఈ దిగ్భ్రాంతికరమైన ఫోటోను బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇదీ ముంబైలోని కేఈఎం ఆసుపత్రి అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆసుపత్రిలో ఈ కారిడార్ ప్రస్తుతం వినియోగంలో వుందా లేక ఖాళీగా ఉన్న ప్రదేశమా అనేది స్పష్టతలేదు. దీనిపై ఆసుపత్రి వర్గాలు అధికారికంగా స్పందించాల్సి వుంది. (ఉబెర్ : ఇండియాలో 600 మంది తొలగింపు) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, మహారాష్ట్రలో ఇప్పటివరకు 52,667 కోవిడ్-19 కేసులు, 1695 మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో సుమారు 40 వేలకు పైగా కేసులు ఆర్థిక రాజధాని, 'డ్రీమ్స్ సిటీ' ముంబైలో నమోదైనవే. ఇక్కడ వెయ్యికి పైగా మరణాలతో దేశంలోనే భారీగా ప్రభావితమైన నగరంగా ముంబై నిలిస్తే.. రెండవదిగా ఉన్న పూణే నగరంలో 5319 మంది ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు ) కాగా గతంలో కూడా నితేష్ రాణా ఇలాంటి ఒక షాకింగ్ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కరోనా మృతదేహాల మధ్య కరోనా ఐసోలేషన్ వార్డును నిర్వహిస్తున్న తీరుపై ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. This is KEM hospital Mumbai ! pic.twitter.com/5KQQcCrYCH — nitesh rane (@NiteshNRane) May 26, 2020 -
ఇంజినీర్‌పై బురద పోసిన ఎమ్మెల్యే
సాక్షి, ముంబై: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాధికారిని బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్‌వర్గీయా బ్యాటుతో కొట్టిన ఘటన జరిగి పక్షం రోజులైనా గడవక ముందే మహారాష్ట్రలోనూ దాదాపు అలాంటి ఘటనే గురువారం జరిగింది. గుంతలమయంగా మారిన హైవేపై మరమ్మత్తులు చేపట్టాలని వినతిపత్రాలు సమర్పించినా లాభంలేకపోవడంతో కోపంతో కాంగ్రెస్‌కు చెందిన నితేశ్ రాణే అనే ఎమ్మెల్యే ఓ ఇంజినీర్‌ను వంతెన కమ్మీకి కట్టేసి, ఆయనపై బక్కెట్లతో బురదపోశారు. నితేశ్ మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే కొడుకు. ముంబై–గోవా రహదారిపై, సింధుదుర్గ్ జిల్లాలోని కనకవ్లీ పరిసరాల్లో ఈ ఘటన గురువారం జరిగింది. ఇంజినీర్ ప్రకాశ్ ఖేడేకర్పై ఎమ్మెల్యే నితేశ్, కనకవ్లీ పురపాలక మండలి అధ్యక్షుడు సమీర్ నలవాడేలు బకెట్లతో బురద పోశారు. ‘గుంతల్లోంచి వెళ్లే వాహనాల కారణంగా పాదచారులపై బురద పడుతోందని, ఈ రోజు మీ మీదా బురద పడనీయండి’ అని నితేశ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసులు నితేశ్ను అదుపులోకి తీసుకున్నారు. -
చేప విసిరి కొట్టిన ఎమ్మెల్యే అరెస్టు
ముంబయి: ఆగ్రహంతో అధికారి పైకి చేప విసిరి కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నితేష్ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులే ధృవీకరించారు. రాణేతో సహా మొత్తం 23మందిని అరెస్టు చేసి తీర కొంకణ్ కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ అధికారిపై కుట్రపూరితంగా దాడికి పాల్పడటమే కాకుండా అల్లర్లకు పాల్పడటం, నేరపూరిత ఆలోచనతో దాడి చేయడం వంటి ఆరోపణలు వివిధ సెక్షన్ల కింద నమోదు చేశారు. ముంబయిలో గత గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన నితేష్ రాణే ఓ ప్రభుత్వాధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మత్యశాఖకు చెందిన కమిషనర్‌తో మాట్లాడుతూ కోపాన్ని ఆపుకోలేక అక్కడే ఉన్న ఓ చేపను ఆయనపై విసిరి కొట్టాడు. చేయి కూడా చేసుకోబోయి ఊగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్ ఇంట్లో అడుగుపెట్టి తెగ వైరల్ అయింది. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని పలువురు మత్స్యకారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నితేష్‌ను కలిసిన నేపథ్యంలో అడిగేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఇలా దాడికి పాల్పడి బుక్కయ్యారు. -
కోపంతో కమిషనర్‌పై చేప విసిరికొట్టిన ఎమ్మెల్యే
ముంబయి: ముంబయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్యశాఖకు చెందిన కమిషనర్‌తో మాట్లాడుతూ కోపాన్ని ఆపుకోలేక అక్కడే ఉన్న ఓ చేపను విసిరి కొట్టాడు. ఆయనపై చేయి కూడా చేసుకోబోయి ఊగిపోయాడు. గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్ ఇంట్లో అడుగుపెట్టి తెగ వైరల్ అయింది. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని పలువురు మత్స్యకారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నితేష్ రాణేను కలిశారు. ఈ సందర్భంగా సిందుబర్గ్ ప్రాంతానికి చెందిన మత్స్యశాఖ కమిషనర్‌తో తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మత్స్యకారులు, ఇతరులు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి సహనాన్ని కోల్పోయిన ఎమ్మెల్యే అక్కడే వారి మధ్య చేపలబుట్టలో ఉన్న ఒక చేపను తీసుకొని ఆగ్రహంతో విసిరి కొట్టారు. ఈ విషయం రాద్ధాంతం కావడంతో మీడియా ప్రశ్నించగా గతంలోనే మత్స్యకారుల సమస్యలను కమిషనర్ వద్దకు తీసుకెళ్లామని, అయినా ఆయన స్పందించలేదని, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాధికారులను ఏ విధంగా భరించాలంటూ ఆయన మీడియాను ప్రశ్నించారు. మరబోటులతో చేపల వేటకు వెళ్లే వారి వల్ల సంప్రదాయ పద్దతుల్లో చేపలుపట్టే వారికి తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఓ ప్రభుత్వాధికారిగా ఆయన తీసుకోవాలంటూ గుర్తు చేశారు. నితేష్ రాణే మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే కుమారుడు. -
శివసేన పార్టీ ఫ్రస్టేషన్లో ఉంది: నితీష్ రాణె
న్యూఢిల్లీ : శివసేన పార్టీ ప్రస్తుతం ఫ్రస్టేషన్లో ఉందని కాంగ్రెస్ నేత నితీష్ రాణె వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఏమీ చేయలేక, సామాన్య ప్రజలపై ఆ పార్టీ నేతలు తమ ప్రతాపం చూపిస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమమర్శించారు. కాగా ఎయిరిండియా సిబ్బందిపై దాడి చేసిన శివసేన ఎంపీ గైక్వాడ్‌పై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఈ అంశం లోక్‌సభలో శుక్రవారం చర్చకు రాగా, ఎంపీలపై సుమెటో కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని, ఎంపీలు దాడులకు దిగటం సరికాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. మరోవైపు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే... ఎయిరిండియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డ గైక్వాడ్‌ను వివరణ కోరారు. అయితే శివసేన మాత్రం ఎంపీ గైక్వాడ్‌ను ఎయిరిండియా సిబ్బంది రెచ్చగొట్టారని వెనకేసుకొచ్చింది. ఒకవేళ గైక్వాడ్ తప్పు ఉంటే పార్టీ అధినేత చర్యలు తీసుకుంటారన్నారు. ఇక ఎయిరిండియా విమానాల్లో సౌకర్యాలు మెరుగు పరచాలంటూ విమానయాన శాఖ మంత్రికి గైక్వాడ్ లేఖ రాశారు. అలాగే ఎయిరిండియా సిబ్బందికి తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ధైర్యం ఉంటే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. కేసులు సంగతి లాయర్లు, పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే చూసుకుంటారన్నారు. -
తండ్రి ఓడాడు.. కొడుకు గెలిచాడు..
నారాయణ్ రాణే కుటుంబానికి మిశ్రమ ఫలితం సాక్షి, ముంబై: కొన్ని దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నారాయణ్ రాణే ఓడిపోతే... అతడి కుమారుడు మాత్రం మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడు. కుడాల్-మాల్వాణ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన నారాయణ్ రాణే ఓడిపోగా, కొంకణ్ నుంచి పోటీచేసిన అతడి తనయుడు నితేష్ రాణే సమీప ప్రత్యర్థి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమోద్ జఠార్పై విజయఢంకా మోగించాడు. దాంతో కుమారుడిని అభినందించేందుకు రాణే ఎన్నికల కేంద్రానికి రాగా, నితేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా రాణే కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం చరమదశకు చేరినా నితేష్ రాజకీయ జీవితంలో వెలుగు మొదలైందని అన్నారు. కాగా, తండ్రి ఓటమిని జీర్ణించుకోలేకపోయిన నితేష్ తన విజయోత్సవ ర్యాలీని రద్దు చేసుకోవడం గమనార్హం. -
తండ్రీ కొడుకులకు సవాల్
సింధుర్గ్ జిల్లాలో ‘రాణే’కు కష్టకాలం? కంకావ్లి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ రాణే, అతని కుమారుడు నితేష్ రాణేలకు సింధుర్గ్ జిల్లా సవాల్‌గా నిలిచింది. కుడాల్ నియోజకవర్గం నుంచి నారాయణ్ రాణే, కంకావ్లి నుంచి నితేష్‌లు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. రాణే పెద్ద కుమారుడు నీలేష్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రత్నగిరి-సింధుర్గ్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక రాణేకు అత్యంత సన్నిహితులైన గణపత్ కదమ్, సుభాస్ బాణే, రాజన్ తేలీ, రవీంద్ర ఫాఠక్లు అతడిని వీడి బీజేపీ, శివసేనల్లో చేరడంతో ఈసారి తండ్రీకొడుకులు గెలుపుకోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మాజీ సహాయ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే ఉదయ్ సామంత్ రాణేతో విభేదాల కారణంగా శివసేనలో చేరి రత్నగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిపై తన ఆశలను అనేకసార్లు వెల్లడించిన రాణే కుడాల్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వాభిమాన్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న రాణే చిన్న కుమారుడు నితేష్ రాణే ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అయినప్పటికీ అదే పార్టీ అభ్యర్థిగా కంకావ్లి నుంచి బరిలోకి దిగారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు కాస్త సణుగుకున్నప్పటికీ బహిరంగంగా ఎవరూ ఆయన నామినేషన్‌ను వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీకి నేతృత్వం వహిస్తున్న నారాయణ్ రాణేకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో గెలుపు ఎవరినైనా వరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రాణేపై పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన శివసేన అభ్యర్థి వైభవ్ నాయక్ మరోసారి కుడాల్లో రంగంలోకి దిగారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో శివసేనకు 22వేల ఓట్ల ఆధిక్యత లభించిందని, అందువల్ల గెలుపు తనదేనని నాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పటికీ రాణే చేసిందేమీ లేదని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక నితేష్‌పై సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ జాతర్ పోటీ చేస్తున్నారు. జాతర్ గత ఎన్నికల్లో కేవలం 34 ఓట్లతో గట్టెక్కారు. మాజీ ఎన్సీపీ నాయకుడు సుభాష్ మాయేకర్కు శివసేన ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ రెబెల్‌గా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ విజయ్సావంత్ నితేష్ ఓట్లకు గండి కొట్టవచ్చని భావిస్తున్నారు. -
ఉద్ధవ్‌పై పోటీకి సిద్ధం
ముంబై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితేష్ రాణే ప్రకటించారు. ఆయన కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ స్థానం నుంచైనా ఉద్ధవ్ ఠాక్రేపై పోటీచేసి తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘పాపం ఉద్ధవ్ ఠాక్రే.. ముఖ్యమంత్రి కావాలని కలలు గంటున్నాడు.. ఆయన పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ పట్టులేదు.. సీఎం పదవి వరకు ఎందుకు.. ఉద్ధవ్‌కు సర్పంచ్‌గా కూడా గెలిచే సత్తాలేదు..’ అని ఎద్దేవా చేశారు. ‘ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా అనుకోనొచ్చు.. చివరకు ఇటీవల ఆర్పీఐలో చేరిన సినీనటి రాఖీ సావంత్ కూడా సీఎంను కావాలని కలగనొచ్చు.. ’ అని రాణే వ్యాఖ్యానించారు. కన్కవాలీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని, అక్కడి ప్రజలతో సత్సంబంధాలకు ఇప్పటినుంచే కార్యాచరణ చేపట్టాలని తన తండ్రి నారాయణ్ రాణే సూచించారని తెలిపారు. కాగా, ఇప్పటికే తాను స్థానిక నాయకులు, కార్యకర్తలతో మాట్లాడానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను కొన్ని కారణాల వల్ల ఓడిపోయానని, ఈసారి మాత్రం గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారసత్వాలు, బంధుత్వాలకు తావులేదని, గెలుపుగుర్రాలకే ప్రాధాన్యత ఇస్తామని ఇటీవల సీఎం చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. ‘ఆయన నన్ను ఒక్కడినే టార్గెట్ చేశారని అనుకోవడంలేదు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కుమార్తె ప్రణతి షిండే, మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అలాగే ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే కుమారుడు రాహుల్ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.. అందువల్ల సీఎం నన్ను ఒక్కడినే దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్యలు చేశారనుకోవడంలేద’న్నారు. -
చిక్కుల్లో నితేశ్ రాణే
ముంబై: పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే తనయుడు, స్వాభిమాన్ సంఘటన సంస్థ అధ్యక్షుడు నితేశ్ రాణే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్వాభిమాన్ సంఘటన కార్యాలయంలో చింటూ షేక్‌పై కాల్పులు జరిపిన కేసులో రాణే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఫైలును మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ రెండోసారి చేసిన అభ్యర్థనను స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆగస్టు, 2013లో కూడా నితేశ్ రాణే కేసును మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. అప్పుడు తిరస్కరించిన కోర్టు తాజాగా మరోసారి కూడా తిరస్కరించింది. దీంతో కేసు దర్యాప్తును కొనసాగించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై నితేశ్ తరఫు న్యాయవాది పర్వేజ్ మీనన్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ... ‘కేసు మూసివేసేందుకు అనుమతిని ఇవ్వాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను తిరస్కరించడానికిగల రెండు కారణాలను కోర్టు తెలిపింది. సీబీఐ సమర్పించిన నివేదికను తాము అంగీకరించకపోవడం మొదటి కారణమైతే కేసు బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మూసివేతకు అంగీకరించలేమని తెలిపింద’న్నారు. ఆగస్టు, 2013లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చింటూ షేక్ సెప్టెంబర్ 23న పొవాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఖార్లోని స్వాభిమాన్ సంఘటన కార్యాలయంలో తనపై నితేశ్ రాణే రెండుసార్లు కాల్పులు జరిపారని, అందులో ఓ బుల్లెట్ తన చెంపను చీల్చుకుంటూ వెళ్లిందన్నారు. దీంతో తాను తీవ్రంగా గాయపడ్డానని పిటిషన్లో ఆరోపించారు. దీంతో భారత శిక్షాస్మృతి, సెక్షన్ 307 ప్రకారం నితేశ్ రాణేపై పొవాయి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసులో పొవాయి పోలీసుల దర్యాప్తు అనుమానాస్పదంగా ఉందని పేర్కొంటూ బాంబే హైకోర్టు 2011, మార్చిలో సీబీఐకి అప్పగించింది. కేసును దర్యాప్తు చేసిన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నితేశ్ రాణేకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని మార్చి 2012లో ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను సవాలు చేస్తూ చింటూ షేఖ్ కోర్టులో పిటిషన్ వేశారు. మళ్లీ దర్యాప్తు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మళ్లీ దర్యాప్తు ప్రారంభించి ఆగస్టులో కేసును మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అందుకు కోర్టు తిరస్కరించడంతో మళ్లీ ఈ ఏడాది మే 20వ తేదీన తుది నివేదికనిచ్చిన సీబీఐ కేసును మూసివేసేందుకు అనుమతిని ఇవ్వాలని మంగళవారం కోరింది. రెండోసారి కూడా కోర్టు తిరస్కరించింది. -
నితేశ్ రాణే అరెస్టు
సాక్షి, ముంబై: టోల్‌నాకా సిబ్బందిపై దాడికి పాల్పడినందుకు స్వాభిమాన్ సంఘటన్ సంస్థ అధ్యక్షుడు నితేశ్ రాణే సహా పదిమందిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి పొద్దుపోయాక పోలీసులు వీరిని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా నితేశ్ తోపాటు మరో నలుగురిని బెయిల్‌పై విడుదల చేసింది. నితేశ్ని అరెస్టు చేసినట్లు తెలియగానే ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ముందు జాగ్రత్తచర్యగా పోలీసు బలగాలను మోహరించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సింధుదుర్గ్ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ముంబై-గోవా జాతీయ రహదారిపై ధార్గల్-పేడ్నే టోల్ నాకా ఉంది. ఆరు నెలల క్రితం నుంచి గోవాకి వెళ్లే పర్యాటకుల వద్ద నుంచి అక్కడ ప్రవేశ రుసుంవసూలు చేస్తున్నారు. అయితే సింధుదుర్గ్ జిల్లా వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం నితేశ్ రాణే, మరికొందరు ఈ టోల్‌నాకా మీదుగా వాహనంలో వెళుతుండగా ఆపిన అక్కడి సిబ్బంది ప్రవేశ రుసుము చెల్లించాలని అడిగారు. ఇందుకు నితేశ్ స్పందిస్తూ తాను సింధుదుర్గ్ ప్రాంతవాసినేనని, అందువల్ల డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అయితే రాణే వాహన సంఖ్య సింధుదుర్గ్ జిల్లాకు చెందినది కాకపోవడంతో డబ్బులు చెల్లించాల్సిందేనంటూ టోల్‌నాకా సిబ్బంది పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సిబ్బంది, రాణే మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన రాణే మద్దతుదారులు టోల్‌నాకా కార్యాలయం అద్దాలను పగుల గొట్టారు. అంతటితో ఊరుకోకుండా సిబ్బందిపై చేయిచేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పేడ్నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాణేతోపాటు తొమ్మిది మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ సమీపంలోని అంజునా కారాగారానికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరైంది. ఈ విషయం తెలుసుకున్న నితేశ్ సోదరుడు, ఎంపీ నీలేశ్ రాణే తన మద్దతుదారులతో అక్కడి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సోదరుడి తరఫున బహిరంగ క్షమాణలు కోరుతున్నానన్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానన్నారు. సింధుదుర్గ్ జిల్లా పరిధిలోని పేడ్నే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి గారి సుపుత్రుడి కండకావరం
టోల్ గేట్ రుసుం చెల్లించాలని స్నేహితులతో కలసి కారులో వెళ్తున్న మంత్రి గారి కుమారుడిని చెక్‌పోస్ట్ సిబ్బంది కోరారు. అంతే ఆ మంత్రిగారి పుత్రరత్నం అగ్గిమీద గుగ్గిలమైయ్యారు. తన ప్రతాపాన్ని ఆ టోల్ గేట్ సిబ్బందిపై ప్రదర్శించాడు. అంతేకాకుండా ఆ టోల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాడు. దాంతో టోల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మంత్రిగారి కుమారుడిని శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించిన సంఘటన మంగళవారం గోవాలో చోటు చేసుకుంది. గోవా పోలీసుల కథనం ప్రకారం.... మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణె కుమారుడు నితీష్ రాణెను తన స్నేహితులతో కలసి గోవా పయనమైయ్యాడు. ఆ క్రమంలో గోవా సమీపంలో టోల్గెట్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనానికి ట్యాక్స్ చెల్లించాలని కోరారు. దాంతో నితీష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.దాంతో టోల్ సిబ్బందిపై దాడి చేశారు. అతడి స్నేహితులు కూడా తామేమి తక్కువ తినలేదని కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి మంత్రిగారి సుపుత్రుడితోపాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని ప్రినం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నితీష్ ,అతడి స్నేహితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంత్రి గారి పుత్రరత్నం అరెస్ట్ వార్త తెలియడంతో ఆయన అనుచరులు ప్రినం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నితీష్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాంతో నితీష్ తోపాటు అతడి స్నేహితులను మరో పోలీసు స్టేషన్‌కు తరలించారు. గోవా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్ధవ్‌ఠాక్రేపై ట్విటర్లో నితేశ్ రాణే పరోక్ష విమర్శలు
సాక్షి, ముంబై: శివసేన దసరా ర్యాలీ ఈసారి కూడా వార్తల్లోకెక్కింది. శివాజీ పార్కులో ఏటా నిర్వహించే ఈ ర్యాలీపై కోర్టు కొంతకాలంగా అనేక ఆంక్షలు విధిస్తోంది. దీంతో ర్యాలీ నిర్వహణకు కోర్టు అనుమతిని ఇస్తుందా? లేదా? అనే కథనాలతో వార్తల్లో నిలిచే ఈ ర్యాలీ ఈసారి మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలతో వార్తల్లోకెక్కింది. ఇప్పటిదాకా నిర్వహించిన ప్రతి ర్యాలీలో శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్‌ఠాక్రే పాల్గొనేవారు. ఆయన ప్రసంగమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. అయితే ఠాక్రే మరణించడంతో ఆయన లేకుండా జరుపుకుంటున్న తొలి ర్యాలీ ఇదేనని చెప్పవచ్చు. గతంలో బాల్‌ఠాక్రే ఆరోగ్యం బాగాలేకపోయినా ముందుగా రికార్డు చేసిన ప్రసంగాన్ని ర్యాలీలో ప్రసారం చేశారు. అయితే ఈసారి ఆయన ప్రసంగం లేకుండానే ర్యాలీ నిర్వహించాల్సిన పరిస్థితి. దీనిని ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటున్నాయి. పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ రాణే కుమారుడైన నితేశ్ రాణే ఈ ర్యాలీనుద్దేశించి విమర్శలు చేశారు. శివాజీపార్‌కలో ఈ సారి జరగనున్న దసరా ర్యాలీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం ట్విటర్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ‘ఏటా శివాజీ పార్కలోని దసరా ర్యాలీలో పులి గాండ్రించేది. ఇప్పుడు ఆ లోటు ఎవరు తీరుస్తారు. ఈ సారి పులి గాండ్రింపులకు బదులుగా మ్యావ్... మ్యావ్ మంటూ పిల్లి కూతలు వినాల్సిందే. ఎప్పటిలా ధ్వని ఎన్ని డెసిబుల్స దాటిందో లెక్కించాల్సిన అవసరం కూడా ఉండదు’ అంటూ నితేశ్ చేసిన వ్యాఖ్యలపై శివసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నితేశ్ ట్విటర్లో రాసిన ప్రతి అక్షరం తమ నేత ఉద్ధవ్‌ను ఉద్దేశించే రాశారంటూ మండిపడుతున్నారు. ఉద్ధవ్‌ను పిల్లితో పోల్చడాన్ని శివసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉన్న ఇటువంటి సమయంలో నితేశ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రత్యర్థులను రెచ్చగొట్టడమేంటంటూ రాజ కీయ విశ్లేషకులు కూడా తప్పుబడుతున్నారు. రాజకీయంగా ఎంత వైరమున్నా ఠాక్రే లేకుండా ర్యాలీ నిర్వహిస్తున్న శివసేనకు అండగా నిలిస్తే వ్యక్తిగతంగా నితేశ్ ప్రతిష్ట పెరిగేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.