
మహారాష్ట్రలో వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి
మల్హార్ సర్టిఫికేషన్ పేరుతో వెబ్‌సైట్
హిందువులంతా జట్కా మటన్ కొనాలని విజ్ఞప్తి
హలాల్ గురించి మాంసం ప్రియులకు తెలిసే ఉంటుంది. ముస్లింల దుకాణాల్లో హలాల్ చేసిన మాంసాన్ని విక్రయిస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా హలాల్ వ్యతిరేక ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో హిందూ మాంసం దుకాణదారులను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం మొదలైంది. ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు నిర్వహిస్తున్న జట్కా మాంసం (jhatka mutton) దుకాణాలను ప్రోత్సహించేందుకు కొత్తగా మల్హార్ సర్టిఫికేషన్ (Malhar certification) అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు.
మల్హార్ సర్టిఫికేషన్ కింద నమోదు చేసుకోవడానికి ఒక పోర్టల్‌ను ప్రారంభించినట్లు మహారాష్ట్ర మత్స్యకార, ఓడరేవుల శాఖ మంత్రి నితేష్ రాణే (Nitesh Rane) సోమవారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జట్కా మటన్, చికెన్ విక్రేతలు అందరూ మల్హార్ సర్టిఫికెట్ పొందాలని ఆయన సూచించారు. హిందువులు మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే మటన్, చికెన్ కొనుగోలు చేయాలని సోషల్ మీడియా పోస్ట్‌లో కోరారు.
"ఈ రోజు మహారాష్ట్రలోని హిందూ సమాజం కోసం మేము ఒక ముఖ్యమైన అడుగు వేశాం. ఈ చొరవ హిందువులకు హిందూ ఆచారాల ప్రకారం లభించే జట్కా మాంసాన్ని విక్రయించే మటన్ దుకాణాలకు ప్రవేశం కల్పిస్తుంద"ని అని మంత్రి నితేష్ రాణే అన్నారు. వినియోగదారులను ధృవీకరించబడిన జట్కా మాంసం విక్రేతలతో అనుసంధానించడానికి వీలుగా MalharCertification.com అనే కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు ప్రకటించారు.
మల్హార్ సర్టిఫికేషన్ అంటే?
హిందూ మాంసం విక్రేతలందరినీ ఒకే వేదిక కిందకు తీసుకురావడానికి మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. జట్కా మాంసం దుకాణాలను ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే నిర్వహిస్తున్నారని మల్హార్ సర్టిఫికేషన్ నిర్ధారిస్తుంది. హిందువులు, సిక్కులకు హలాల్ రహిత మాంసం విక్రయించాలన్న లక్ష్యంతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు హిందూ మత సంప్రదాయాల ప్రకారం మేక, గొర్రె మాంసాన్ని శుభ్రంగా, లాలాజల కాలుష్యం లేకుండా.. మరే ఇతర జంతు మాంసం కలపకుండా విక్రయించేందుకు మల్హార్ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది.
వెబ్‌సైట్‌లో ఏముంది?
జట్కా మటన్, చికెన్ విక్రేతలను ప్రామాణికంగా గుర్తించే ప్రక్రియే మల్హార్. హిందూ మతాచారాల ప్రకారమే మేక, గొర్రెలను వధించి మాంసాన్ని సంగ్రహిస్తారు. ఇది పరిశుభ్రంగా, లాలాజల రహితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి ఇతర జంతువుల మాంసం కలవదు. ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే ప్రత్యేకంగా జట్కా మాంసాన్ని విక్రయిస్తారు. మల్హార్ నిర్ధారించిన దుకాణాల్లో మాత్రమే మటన్ కొనాలని మేము పోత్సహిస్తున్నామని మల్హార్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పేర్కొంది.
జట్కా మాంసాన్ని ఎందుకు ఇష్టపడతారు?
హిందూ సంప్రదాయాలను పాటించే వారు జట్కా మాంసాన్ని ఇష్టపడతారు. మాంసం వినియోగానికి ఇది నైతిక పద్ధతి అని నమ్ముతారు. ఎందుకంటే జట్కా విధాననంలో జంతువుకు ఎక్కువ బాధ లేకుండా వెంటనే వధిస్తారు. హలాల్ మాంసంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో హలాల్ రహిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో గత సంవత్సరం నవంబర్‌లో ఎయిర్ ఇండియా.. హిందూ, సిక్కు ప్రయాణికులకు హలాల్ రహిత ఆహారాన్ని అందించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మహారాష్ట్రలో మల్హార్ సర్టిఫికేషన్‌తో హలాల్ రహిత మాంసాన్ని విక్రయించేందుకు చొరవ చూపారు. దీనిపై మరాఠీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment