
జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు చంద్రబాబు, ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్ తదితరులు
అభివృద్ధికి ఆలయాలు ప్రధాన వనరులు
దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర
ఆలయాల అనుసంధానానికి ఎక్స్‌పో సహకారం అభినందనీయం
అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ఎక్స్‌పోలో ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజందే ప్రధాన పాత్ర. సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణలో ఆలయాల పాత్ర కీలకం’ అని ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ ప్రమోద్ సావంత్ అన్నారు.
టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న ‘అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ఎక్స్‌పో’ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో 2025 – ఫౌండర్, అంత్యోదయ ప్రతిష్ఠాన్ ప్రవీణ్ దారేకర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు.
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు
ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయాల పరిరక్షణ, భద్రత, ఆర్థిక స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందంజలో ఉన్నప్పటికీ, విశ్వాసం ముందు అవి ఏమీ చేయలేవని చెప్పారు. టీటీడీ పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణ వర్గాలను సభ్యులుగా చేరుస్తామన్నారు.
మతపరమైన టూరిజాన్ని పెంచేందుకు అటవీ, ఎండోమెంట్, పర్యాటక శాఖ మంత్రులతో ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అర్చకుల వేతనాన్ని, నిరుద్యోగ వేద పండితులకు గౌరవ వేతనం పెంచుతామని, ఆలయాలు, వేద వ్యవహారాల్లో స్వయంప్రతిపత్తికే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తిరుమల బాలాజీని మోసం చేస్తే ఆయన క్షమించడని చెప్పారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులను సాంస్కృతిక, ఆర్థిక ఉద్యమంలో ఏకం చేయడంలో ఈ సమావేశం చొరవ చూపడం హర్షణీయమని అన్నారు.
భారత ఆలయాలు శక్తి స్వరూపాలు : దేవేంద్ర ఫడ్నవీస్
ప్రపంచ దేశాల ప్రజలు భారత ఆలయాలను ఆధ్యాత్మిక నిలయాలుగా, శక్తి స్వరూపాలుగా పరిణగనిస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. దేశంలోని దేవాలయాల చరిత్ర అతి పురాతనమైనదని, దక్షణ భారత్‌లోని ఆలయాలు చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు. వేల ఏళ్ల క్రితం ఇలాంటి ఆలయ నిర్మాణం ఎలా జరిగిందని ఆరా తీస్తూ భక్తి భావానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తున్నారన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 55 శాతం మంది ధర్మ పర్యటనల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూడటానికి ఆధ్యాత్మిక సంపద, సంస్కృతే కారణమని వివరించారు. సనాతన భక్తి భావం పెంపొందించడంలో, హిందువుల సమైక్యత, సంస్కృతిని కాపాడడంలో ఈ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్‌పో దోహదపడుతుందని తెలిపారు.
ధర్మ రక్షణే భారత ప్రజల సిద్ధాతం: డాక్టర్ ప్రమోద్ సావంత్
ధర్నాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనేదే భారత ప్రజల సిద్ధాంతమని గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ చెప్పారు. గోవులను పూజించడం, రక్షించడం మన కర్తవ్యం కావాలని అన్నారు. హిందువులు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పవిత్రతకు మూల స్తంభాలైన దేవాలయాలను పరిరక్షించాల్సిన భాద్యత ప్రతి హిందువుకూ ఉందని చెప్పారు.
ఎక్స్‌పో ప్రధాన ఉద్దేశమిదీ..
అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో 58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పాల్గొని, 1581 దేవాలయాలను ఓకే వేదికపై అనుసంధానించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌పో నిర్వహించారు. ప్రధానంగా స్థిరత్వ, పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, లక్ష్యాలు, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై మూడు రోజుల పాటు సెమినార్లు నిర్వహించనున్నారు.
సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కులకర్ణి, ఐటీసీ పూర్వ చైర్మన్ ప్రసాద్ లాడ్ భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద నాయక్, సాధు ప్రతినిధి ఆచార్య గోవింద్ దేవ్ మహారాజ్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ముకుంద్ తదితరులు ప్రసంగించారు. ఈ సభలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, గోవా రాష్ట్ర మంత్రులు ఆశీష్ షెలార్, విశ్వజిత్ రాణే, ప్రభుత్వ సలహాదారు రోహన్ కౌంటే తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment