Temple Tourism Development
-
హిందూ ధర్మం విశ్వజనీనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజందే ప్రధాన పాత్ర. సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణలో ఆలయాల పాత్ర కీలకం’ అని ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ ప్రమోద్ సావంత్ అన్నారు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న ‘అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ఎక్స్పో’ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 – ఫౌండర్, అంత్యోదయ ప్రతిష్ఠాన్ ప్రవీణ్ దారేకర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు.అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలుఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయాల పరిరక్షణ, భద్రత, ఆర్థిక స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందంజలో ఉన్నప్పటికీ, విశ్వాసం ముందు అవి ఏమీ చేయలేవని చెప్పారు. టీటీడీ పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణ వర్గాలను సభ్యులుగా చేరుస్తామన్నారు. మతపరమైన టూరిజాన్ని పెంచేందుకు అటవీ, ఎండోమెంట్, పర్యాటక శాఖ మంత్రులతో ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అర్చకుల వేతనాన్ని, నిరుద్యోగ వేద పండితులకు గౌరవ వేతనం పెంచుతామని, ఆలయాలు, వేద వ్యవహారాల్లో స్వయంప్రతిపత్తికే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తిరుమల బాలాజీని మోసం చేస్తే ఆయన క్షమించడని చెప్పారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులను సాంస్కృతిక, ఆర్థిక ఉద్యమంలో ఏకం చేయడంలో ఈ సమావేశం చొరవ చూపడం హర్షణీయమని అన్నారు.భారత ఆలయాలు శక్తి స్వరూపాలు : దేవేంద్ర ఫడ్నవీస్ ప్రపంచ దేశాల ప్రజలు భారత ఆలయాలను ఆధ్యాత్మిక నిలయాలుగా, శక్తి స్వరూపాలుగా పరిణగనిస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. దేశంలోని దేవాలయాల చరిత్ర అతి పురాతనమైనదని, దక్షణ భారత్‌లోని ఆలయాలు చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు. వేల ఏళ్ల క్రితం ఇలాంటి ఆలయ నిర్మాణం ఎలా జరిగిందని ఆరా తీస్తూ భక్తి భావానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 55 శాతం మంది ధర్మ పర్యటనల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూడటానికి ఆధ్యాత్మిక సంపద, సంస్కృతే కారణమని వివరించారు. సనాతన భక్తి భావం పెంపొందించడంలో, హిందువుల సమైక్యత, సంస్కృతిని కాపాడడంలో ఈ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో దోహదపడుతుందని తెలిపారు.ధర్మ రక్షణే భారత ప్రజల సిద్ధాతం: డాక్టర్ ప్రమోద్ సావంత్ధర్నాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనేదే భారత ప్రజల సిద్ధాంతమని గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ చెప్పారు. గోవులను పూజించడం, రక్షించడం మన కర్తవ్యం కావాలని అన్నారు. హిందువులు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పవిత్రతకు మూల స్తంభాలైన దేవాలయాలను పరిరక్షించాల్సిన భాద్యత ప్రతి హిందువుకూ ఉందని చెప్పారు.ఎక్స్పో ప్రధాన ఉద్దేశమిదీ..అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో 58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పాల్గొని, 1581 దేవాలయాలను ఓకే వేదికపై అనుసంధానించడం లక్ష్యంగా ఈ ఎక్స్పో నిర్వహించారు. ప్రధానంగా స్థిరత్వ, పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, లక్ష్యాలు, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై మూడు రోజుల పాటు సెమినార్లు నిర్వహించనున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కులకర్ణి, ఐటీసీ పూర్వ చైర్మన్ ప్రసాద్ లాడ్ భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద నాయక్, సాధు ప్రతినిధి ఆచార్య గోవింద్ దేవ్ మహారాజ్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ముకుంద్ తదితరులు ప్రసంగించారు. ఈ సభలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, గోవా రాష్ట్ర మంత్రులు ఆశీష్ షెలార్, విశ్వజిత్ రాణే, ప్రభుత్వ సలహాదారు రోహన్ కౌంటే తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఐదు రూట్లలో టెంపుల్ టూరిజం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలను, వివిధ ఆలయాలను కలుపుతూ ఐదు సర్క్యూట్లలో(రూట్లలో) టెంపుల్ టూరిజంను ప్రారంభించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, చెప్పారు. బుధవారం సచివాలయంలో మంత్రి ఆర్కే రోజాతో కలిసి దేవదాయ, పర్యాటక శాఖల అధికారులతో టెంపుల్ టూరిజం అభివృద్దిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇరువురు మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగానూ ఆకర్షించే రీతిలో అభివృద్ధి చేసేందుకు రెండు శాఖలు చర్యలు తీసుకుంటున్నట్టు కొట్టు సత్యనారాయణ చెప్పారు. మొత్తం 16 సర్క్యూట్లకు ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు. విజయవాడ– పంచారామ యాత్ర, విజయవాడ – అష్టశక్తి యాత్ర, విజయవాడ – త్రిలింగ యాత్ర, తిరుపతి – కష్ణదేవరాయ యాత్ర, తిరుపతి– గోల్డెన్ ట్రయాంగిల్ యాత్ర సర్క్యూట్లకు అత్యధిక రేంటింగులు వచ్చాయని తెలిపారు. ఈ ఐదు సర్క్యూట్లలో తొలి విడతగా టెంపుల్ టూరిజంను అభివృద్ది చేస్తామన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. టెంపుల్ టూరిజం సర్క్యూట్లతో యాత్రికులు ఒకే సమయంలో ఆలయాలు, ఆ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చన్నారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. -
టెంపుల్ టూరిజంలో ఆలయాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: టెంపుల్ టూరిజంలో భాగంగా దేవాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాదం’ పథకం కింద రూ.48 కోట్లతో అన్నవరం దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే రూ.50 కోట్లతో శ్రీశైల దేవాలయం అభివృద్ధి పనులు పూర్తిచేశామని, మరో రూ.50 కోట్లతో సింహాచల ఆలయ అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ పర్యాటక సర్క్యూట్లలో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాల కల్పనతో పాటు మౌలిక వసతులను మెరుగుపరుస్తామన్నారు. రూ.47 కోట్లతో పర్యాటక సంస్థకు చెందిన 15 హోట్లళ్లు, రెస్టారెంట్లను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను తీసుకొస్తున్నామన్నారు. పర్యాటక సంస్థకు ఏడాదిలో ఇప్పటికే రూ.40 కోట్ల ఆదాయం వచ్చిందని, రూ.125 కోట్ల వార్షిక ఆదాయం లక్ష్యంతో ముందుకెళుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సీఈవో, ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీ ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా అన్నవరం
* టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం * బడ్జెట్ హోటల్ నిర్మాణానికి టూరిజం శాఖకు రూ.3.41 కోట్లు మంజూరు * ప్రజాప్రతినిధులతో అధికారుల సమావేశం అన్నవరం : సత్యదేవుని సన్నిధి.. అన్నవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.3.41 కోట్లతో నాలుగెకరాల్లో అన్ని సౌకర్యాలతో బడ్జెట్ హోటల్ నిర్మించేందుకు పర్యాటక శాఖకు పచ్చజెండా ఊపింది. నిధులు కూడా విడుదల చేసింది. దీంతోపాటు అన్నవరాన్ని ఆలయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో దేవస్థానంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను సంబంధిత అధికారులు నోట్ చేసుకుని వాటిపై తమ అభిప్రాయాలు, వాటికి అయ్యే వ్యయం తదితర అంశాలతో నివేదిక సమర్పించాలని, సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా ప్రణాళిక అధికారి విజయలక్ష్మి ఆదేశించారు. సమావేశంలో పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, దేవస్థానం ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు, పర్యాటక శాఖ డీఎం టి.బాపూజీ, పంచాయతీరాజ్ ఈఈ ఏబీవీ ప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ సతీష్‌బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సీహెచ్ అప్పారావు, దేవస్థానం ఈఈ ప్రసాదరావు, తుని ఆర్టీసీ డీఎం వైవీఎన్ మూర్తి, శంఖవరం ఎంపీడీఓ శర్మ, ఎంపీపీ బద్ది మణి, వైస్ ఎంపీపీ బొమ్మిడి సత్యనారాయణ, అన్నవరం సర్పంచ్ రాజాల గంగాభవాని, ఉప సర్పంచ్ బండారు రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవీ ప్రజాప్రతినిధుల సూచనలు * అన్నవరం మెయిన్‌రోడ్, రైల్వేస్టేషన్ రోడ్లను విస్తరించాలి. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. * పర్యాటకులకు రెస్ట్‌హౌస్ ఏర్పాటు చేయాలి.పంపా తీరంలో మొక్కలు పెంచి, సందర్శకులు కూర్చోవడానికి వీలుగా బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేయాలి. * గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలి. కొండ దిగువన సులభ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలి. డ్రైన్ల వ్యవస్థను మెరుగుపరచాలి. * అన్నవరానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలి. * రైల్వేస్టేషన్ రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంపై బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలి. * గ్రామంలోని కోనేరు, రిజర్వ్ చెరువులను అభివృద్ధి చేయాలి. * అన్నవరం బస్ కాంప్లెక్స్ పక్కన ఉన్న స్థలాన్ని ఆర్టీసీ లేదా ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. పర్యాటక కేంద్రం చేయాలని.. అన్నవరాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు, సమస్యలు తెలుసుకున్నాం. వారి అభిప్రాయాలతో అధికారులను నివేదిక ఇవ్వమని చెప్పాం. ఆ నివేదిక ఇచ్చాక కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకుంటారు. - విజయలక్ష్మి, జిల్లా ప్రణాళిక అధికారి మౌలిక వసతులు కల్పిస్తాం పర్యాటకాభివృద్ధిలో భాగంగా అన్నవరంలో మౌలిక వసతులు కల్పించాలని ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై ఆయా శాఖల అధికారులతో చర్చించి చర్యలు చేపడతాం. - విశ్వేశ్వరరావు, ఆర్డీఓ, పెద్దాపురం గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి అన్నవరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులివ్వాలి. గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలి. - గంగాభవాని, సర్పంచ్, అన్నవరం పర్యాటకులకు కూడా సేవలందిస్తాం సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా సేవలందిస్తున్నాం. అలాగే పర్యాటకులకు కూడా సేవలందిస్తాం. టూరిజం శాఖకు పంపా నదికి దగ్గరలో కొండమీద స్థలమివ్వడానికి గతంలోనే అంగీకరించాం. పర్యాటకాభివృద్ధికి మేం ఏంచేయాలో చెబితే దానిపై దేవాదాయ శాఖ కమిషనర్‌తో చర్చించి చర్యలు తీసుకుంటాం. - జగన్నాథరావు, ఇన్‌ఛార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం బడ్జెట్ హోటల్ నిర్మాణం అన్నవరంలో నాలుగు ఎకరాల్లో రూ.3.41 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం. ఇందుకు తగిన స్థలం కోసం అన్వేషిస్తున్నాం. అన్నవరం దేవస్థానం స్థలం ఇస్తే అందులోనే హోటల్ నిర్మిస్తాం. 60 గదులు, 20 మందికి సరిపడా నాలుగు డార్మెట్రీలు, ఒక క్యాంటిన్, స్విమ్మింగ్పూల్వంటివి ఇందులో ఉంటాయి. క్యాంటిన్లో ఆహార పదార్థాల ధరలు, హోటల్లో రూము అద్దెలు అందరికీ అందుబాటులో ఉంటాయి. - బాపూజీ, డీఎం, పర్యాటక శాఖ బోట్ షికార్ ఏర్పాటు చేయాలి పంపా నదిలో టూరిజం శాఖ బోట్ షికార్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులు దీనిని నిర్వహిస్తున్నారు. పంపా నది ఒడ్డున ఉన్న ఆక్రమణలను కూడా తొలగించాలి. - బలువు రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత టూరిస్ట్ బస్సుల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలి ఏటా అన్నవరానికి సుమారు 600 టూరిస్ట్ బస్సులలో భక్తులు వస్తున్నారు. ఆ బస్సులను రోడ్లమీదే నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆ బస్సులను నిలపడానికి పార్కింగ్ స్థలం కేటాయించాలి. ఘాట్‌రోడ్‌ను అందంగా రూపొందించాలి. - ఈర్లు శ్రీనివాస్, వార్డు సభ్యుడు, అన్నవరం