పర్యాటక కేంద్రంగా అన్నవరం | Tourism Center to Annavaram | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రంగా అన్నవరం

Published Sat, Nov 15 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

పర్యాటక కేంద్రంగా అన్నవరం

పర్యాటక కేంద్రంగా అన్నవరం

* టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
* బడ్జెట్ హోటల్ నిర్మాణానికి టూరిజం శాఖకు రూ.3.41 కోట్లు మంజూరు
* ప్రజాప్రతినిధులతో అధికారుల సమావేశం
అన్నవరం : సత్యదేవుని సన్నిధి.. అన్నవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.3.41 కోట్లతో నాలుగెకరాల్లో అన్ని సౌకర్యాలతో బడ్జెట్ హోటల్ నిర్మించేందుకు పర్యాటక శాఖకు పచ్చజెండా ఊపింది. నిధులు కూడా విడుదల చేసింది. దీంతోపాటు అన్నవరాన్ని ఆలయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో దేవస్థానంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను సంబంధిత అధికారులు నోట్ చేసుకుని వాటిపై తమ అభిప్రాయాలు, వాటికి అయ్యే వ్యయం తదితర అంశాలతో నివేదిక సమర్పించాలని, సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా ప్రణాళిక అధికారి విజయలక్ష్మి ఆదేశించారు. సమావేశంలో పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, దేవస్థానం ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు, పర్యాటక శాఖ డీఎం టి.బాపూజీ, పంచాయతీరాజ్ ఈఈ ఏబీవీ ప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఈ సతీష్‌బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సీహెచ్ అప్పారావు, దేవస్థానం ఈఈ ప్రసాదరావు, తుని ఆర్టీసీ డీఎం వైవీఎన్ మూర్తి, శంఖవరం ఎంపీడీఓ శర్మ, ఎంపీపీ బద్ది మణి, వైస్ ఎంపీపీ బొమ్మిడి సత్యనారాయణ, అన్నవరం సర్పంచ్ రాజాల గంగాభవాని, ఉప సర్పంచ్ బండారు రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 
ఇవీ ప్రజాప్రతినిధుల సూచనలు
* అన్నవరం మెయిన్‌రోడ్, రైల్వేస్టేషన్ రోడ్లను విస్తరించాలి. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి.
* పర్యాటకులకు రెస్ట్‌హౌస్ ఏర్పాటు చేయాలి.పంపా తీరంలో మొక్కలు పెంచి, సందర్శకులు కూర్చోవడానికి వీలుగా బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేయాలి.
* గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలి. కొండ దిగువన సులభ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలి. డ్రైన్‌ల వ్యవస్థను మెరుగుపరచాలి.
* అన్నవరానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలి.
* రైల్వేస్టేషన్ రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంపై బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలి.
* గ్రామంలోని కోనేరు, రిజర్వ్ చెరువులను అభివృద్ధి చేయాలి.
* అన్నవరం బస్ కాంప్లెక్స్ పక్కన ఉన్న స్థలాన్ని ఆర్టీసీ లేదా ప్రభుత్వం అభివృద్ధి చేయాలి.
 
 
పర్యాటక కేంద్రం చేయాలని..
అన్నవరాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు, సమస్యలు తెలుసుకున్నాం. వారి అభిప్రాయాలతో అధికారులను నివేదిక ఇవ్వమని చెప్పాం. ఆ నివేదిక ఇచ్చాక కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకుంటారు.
 - విజయలక్ష్మి, జిల్లా ప్రణాళిక అధికారి

మౌలిక వసతులు కల్పిస్తాం
పర్యాటకాభివృద్ధిలో భాగంగా అన్నవరంలో మౌలిక వసతులు కల్పించాలని ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై ఆయా శాఖల అధికారులతో చర్చించి చర్యలు చేపడతాం.
 - విశ్వేశ్వరరావు, ఆర్డీఓ, పెద్దాపురం
 
గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి
అన్నవరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులివ్వాలి. గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలి.
 - గంగాభవాని, సర్పంచ్, అన్నవరం
 
పర్యాటకులకు కూడా సేవలందిస్తాం
సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా సేవలందిస్తున్నాం. అలాగే పర్యాటకులకు కూడా సేవలందిస్తాం. టూరిజం శాఖకు పంపా నదికి దగ్గరలో కొండమీద స్థలమివ్వడానికి గతంలోనే అంగీకరించాం. పర్యాటకాభివృద్ధికి మేం ఏంచేయాలో చెబితే దానిపై దేవాదాయ శాఖ కమిషనర్‌తో చర్చించి చర్యలు తీసుకుంటాం.
 - జగన్నాథరావు, ఇన్‌ఛార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం
 
బడ్జెట్ హోటల్ నిర్మాణం
అన్నవరంలో నాలుగు ఎకరాల్లో రూ.3.41 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం. ఇందుకు తగిన స్థలం కోసం అన్వేషిస్తున్నాం. అన్నవరం దేవస్థానం స్థలం ఇస్తే అందులోనే హోటల్ నిర్మిస్తాం. 60 గదులు, 20 మందికి సరిపడా నాలుగు డార్మెట్రీలు, ఒక క్యాంటిన్, స్విమ్మింగ్‌పూల్‌వంటివి ఇందులో ఉంటాయి. క్యాంటిన్‌లో ఆహార పదార్థాల ధరలు, హోటల్‌లో రూము అద్దెలు అందరికీ అందుబాటులో ఉంటాయి.
 - బాపూజీ, డీఎం, పర్యాటక శాఖ
 
బోట్ షికార్ ఏర్పాటు చేయాలి
పంపా నదిలో టూరిజం శాఖ బోట్ షికార్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులు దీనిని నిర్వహిస్తున్నారు. పంపా నది ఒడ్డున ఉన్న ఆక్రమణలను కూడా తొలగించాలి.
 - బలువు రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత
 
టూరిస్ట్ బస్సుల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలి
ఏటా అన్నవరానికి సుమారు 600 టూరిస్ట్ బస్సులలో భక్తులు వస్తున్నారు. ఆ బస్సులను రోడ్లమీదే నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆ బస్సులను నిలపడానికి పార్కింగ్ స్థలం కేటాయించాలి. ఘాట్‌రోడ్‌ను అందంగా రూపొందించాలి.
 - ఈర్లు శ్రీనివాస్, వార్డు సభ్యుడు, అన్నవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement