
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలను, వివిధ ఆలయాలను కలుపుతూ ఐదు సర్క్యూట్‌లలో(రూట్లలో) టెంపుల్ టూరిజంను ప్రారంభించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, చెప్పారు. బుధవారం సచివాలయంలో మంత్రి ఆర్కే రోజాతో కలిసి దేవదాయ, పర్యాటక శాఖల అధికారులతో టెంపుల్ టూరిజం అభివృద్దిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం ఇరువురు మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలు ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగానూ ఆకర్షించే రీతిలో అభివృద్ధి చేసేందుకు రెండు శాఖలు చర్యలు తీసుకుంటున్నట్టు కొట్టు సత్యనారాయణ చెప్పారు. మొత్తం 16 సర్క్యూట్లకు ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు.
విజయవాడ– పంచారామ యాత్ర, విజయవాడ – అష్టశక్తి యాత్ర, విజయవాడ – త్రిలింగ యాత్ర, తిరుపతి – కష్ణదేవరాయ యాత్ర, తిరుపతి– గోల్డెన్ ట్రయాంగిల్ యాత్ర సర్క్యూట్లకు అత్యధిక రేంటింగులు వచ్చాయని తెలిపారు. ఈ ఐదు సర్క్యూట్లలో తొలి విడతగా టెంపుల్ టూరిజంను అభివృద్ది చేస్తామన్నారు.
మంత్రి రోజా మాట్లాడుతూ.. టెంపుల్ టూరిజం సర్క్యూట్లతో యాత్రికులు ఒకే సమయంలో ఆలయాలు, ఆ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చన్నారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment