![Ysrcp Leader Kottu Satyanarayana Fires On Chandrababu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/kottusatyanarayana1.jpg.webp?itok=lYYQJ_52)
సాక్షి, తాడేపల్లిగూడెం: టీటీడీ టెండర్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి వినియోగించారంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబులో మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండానే ఇష్టారాజ్యంగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా తప్పడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
కూటమి ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ బయటపెడుతుందనే భయంతో చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు తల్లడిల్లేలా తప్పుడు ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసాయంటూ ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు సెప్టెంబర్ 18వ తేదీన ప్రకటించారు. తరువాత సెప్టెంబర్ 25న కేసు నమోదు చేశారు. 26వ తేదీన రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తరువాత దీనిపై సుప్రీంకోర్ట్ లో వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో సీబీఐ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటయ్యింది.
టెండర్లలో ఉల్లంఘనలను మాత్రమే గుర్తించిన సిట్
నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే అంశంపై విచారణకు వచ్చిన సిట్ ముందుగా టీటీడీ నిర్వహిస్తున్న టెండర్లను పరిశీలించింది. దీనిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తించి, దానికి కారణమైన నలుగురిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసింది. ఈ అంశాన్ని మరోసారి చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా మరోసారి వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు. నెయ్యిలో కల్తీ జరిగిపోయిందని, ఈ కల్తీ నెయ్యి విషయంలోనే నలుగురి అరెస్ట్ జరిగిందంటూ అసత్య ప్రచారానికి తెర తీశారు. నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశాన్ని సిట్ నిర్ధారించక ముందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా నిర్ధారించి తీర్పులు కూడా చెప్పేయడం దుర్మార్గం.
ఆది నుంచి చంద్రబాబు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడం, వైఎస్సార్‌సీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మొదట్లో తప్పుడు ప్రచారం చేశారు. నీచమైన రాజకీయాలకు పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏఅంశాని అయినా సరే వాడుకోగల ఘనుడు. నిత్యం అబద్ధాలతోనే రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా నిలుస్తోంది. చంద్రబాబు చెప్పే ప్రతి దుర్మార్గమైన మాటను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.
నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే ల్యాబ్‌లు టీటీడీకి ఉన్నాయి. 2024 జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిళ్లను తీసి టీటీడీ ల్యాబ్‌లో పరిశీలించారు. ప్రమాణాలకు అనుగుణంగానే ఈ శాంపిళ్లు ఉన్నాయని నిర్థారించడం కూడా జరిగింది. అంటే లడ్డూ తయారీకి వస్తున్న నెయ్యిని పూర్తి స్థాయిలో పరిశీలించే ల్యాబ్‌లు, మెకానిజం టీటీడీకి ఉంది. ఈ పరిశీలనలో ఏ మాత్రం నాణ్యాతా ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు తేలినా ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు.
ఈ విషయాన్ని మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ చెబుతూనే ఉంది. కానీ చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు వాస్తవాలు అక్కరలేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు మరిచిపోయేలా చేయాలంటే ఒక బలమైన అంశంతో ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే వారి లక్ష్యం. హిందూధర్మాన్ని అనుసరించే భక్తులు శ్రీవారి లడ్డూలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని ఉచ్ఛరించడానికే ఇష్టపడరు. అలాంటిది దుర్మార్గమైన కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారు.
వెనక్కి పంపిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎలా వినియోగిస్తారు?
గత ఏడాది జూలై 6, 12వ తేదీల్లో నాలుగు ట్యాంకర్ల ద్వారా కల్తీ నెయ్యి తిరుమలకు వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. వీటి నుంచి ఎన్డీడీపీకి టెస్ట్ కోసం నెయ్యి శాంపిళ్ళను పంపించారు. ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు. దీనిలో కూడా ఈ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా లేదు. ఎన్డీడీపీ తన నివేదికలో ఈ నెయ్యిలో వనస్పతి కలిసి ఉండే అవకాశం ఉందని, మా నివేదిక తప్పు కూడా అయ్యేందుకు అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది.
ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం: వైఎస్ జగన్
అదే విధంగా జూలై 23నే టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఈ నాలుగు ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిని వెనక్కి పంపించేశామని, ప్రసాదంలో ఉపయోగించలేదని కూడా ప్రకటించారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడకపోయినా రెండు నెలల తరువాత అంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు ఆ నెయ్యిని వాడినట్లు ప్రకటించడం రాజకీయ దురుద్దేశంతో కాదా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరఫరా ప్రారంభించారు. దీనిని సీబీఐ కూడా గుర్తించింది. సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీపై మాట్లాడేప్పుడు ఏ ఆధారాలతో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆరోపించారని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో పాటు తప్ప పట్టింది. దీనికి చంద్రబాబు ఎటువంటి సమాధానం చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment