చంద్రబాబు కొత్తరాగం.. మర్మం ఇదేనా? | KSR On AP CM Chandrababu Delhi AAP Model Fail Comment | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కొత్తరాగం.. మర్మం ఇదేనా?

Published Wed, Feb 12 2025 3:27 PM | Last Updated on Wed, Feb 12 2025 5:57 PM

KSR On AP CM Chandrababu Delhi AAP Model Fail Comment

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎన్నికల పలితాలను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి చేసిన  ప్రయత్నాలను జనం నమ్ముతారా? ఢిల్లీ, ఏపీ మోడళ్లు ఫెయిల్ అని చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఈ అంశాలను పరిశీలిస్తే అనేక వాస్తవాలు బోధపడతాయి. 

ఏ పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలచుకుని ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. నిజాలకు పాతరేసి, తనకు కావాల్సిన వాదనను తెరపైకి తెస్తుంటారు. దీన్ని ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా  ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుని అనేక వ్యూహాలను పన్నింది. కేంద్రంలోని తన ప్రభుత్వాన్ని పూర్తిగా వాడుకుంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులూ తోడు కావడంతో ఆ పార్టీ ఓడిపోయింది. లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ బృందాన్ని బదనాం చేయడంలో బీజేపీ సఫలం అయింది. దీంతో అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్‌పై మరక పడింది. 

విశేషం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వాస్తవంగా ఎంత నష్టం జరిగిందన్నది ఇప్పటికీ మిథ్యే. అయినా కేజ్రీవాల్‌తో సహా  ఆప్ నేతలు పలువురు మాత్రం నెలల తరబడి జైలులో ఉండవలసి వచ్చింది. అయినా బీజేపీకి తన విజయంపై నమ్మకం కలగలేదు.అందుకే తన ఎన్నికల మానిఫెస్టోలో అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించింది. అన్నిటికి మించి  పిభ్రవరి ఒకటో తేదీన ప్రకటించిన బడ్జెట్‌లో..  పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి ఐదున పోలింగ్ తేదీని ప్రకటించడంలోని ఆంతర్యం కూడా ఇదే అయి ఉండవచ్చన్న సందేహం కలుగుతుంది. 

ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగవర్గాలు, మధ్యతరగతి వారు ఉంటారు. వారందరికి ఇన్ కమ్ టాక్స్ రాయితీ ద్వారా గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలిగింది. ఒకరకంగా చెప్పాలంటే డిల్లీ ఎన్నికల పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను మదింపుదారులకు ఊరట కలిగిందని అనుకోవచ్చు. అంతేకాదు. ఒకప్పుడు ఉచిత పథకాలకు తాము వ్యతిరేకం అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ ముసుగు తొలగించింది. ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మించి కొత్త వాగ్దానాలు చేసింది. 

వాటిలో ప్రధానమైనది  పేద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇది కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వంటిది. ఏపీలో తన భాగస్వామి టీడీపీ రూ.1500 చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం వంటిది. ఈ మూడు రాష్ట్రాలలో ఈ హామీని ఎలా అమలు చేయాలో తెలియక ఆ పార్టీల ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. ఆ తరుణంలో బీజేపీ ఇలాంటి హామీ ఇచ్చింది. ఆప్ నెలకు రూ.2,100 రూపాయలు ఇస్తామని చెబితే బీజేపీ అంతకన్నా ఎక్కువ ఇస్తామని ప్రజలను, ముఖ్యంగా మహిళలను  ఊరించింది. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని స్కీములను కొనసాగిస్తూ కొత్తవాటిని ఇస్తామని బీజేపీ తెలిపింది. ప్రతి గర్భిణీకి రూ.21 వేలు ఇస్తామని, ఐదు రూపాయలకే భోజనం పెట్టే అటల్ క్యాంటీన్లు నెలకొల్పుతామని, పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీలిచ్చింది. ఆప్ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్తు, నీరు ఉచితంగా అందిస్తూండటం గమనార్హం. 

బీజేపీ ఇంకా పలు హామీలు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు విస్మరించి, బీజేపీ అభివృద్ది మోడల్‌తో గెలిచిందని సత్యదూరమైన ప్రకటన చేశారు. నిజంగానే కేవలం అభివృద్ది ఆధారంగానే ఎన్నికల ప్రణాళిక ప్రకటించి ఉంటే, ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ స్కీములను తాము కొనసాగిస్తామని బీజేపీ ఎందుకు చెబుతుంది? దీనర్థం ఆప్ మోడల్ ఢిల్లీలో సఫలమైంది కనుక దానిని అనుసరిస్తామని చెప్పడమే కదా! ఆప్‌ను దెబ్బతీయడానికి అంతకన్నా ఎక్కువ హమీలు ఇవ్వాలని అనుకోవడంలో అభివృద్ది మోడల్ ఏమి ఉంటుంది? 

ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో కేంద్రం పెత్తనం అధికంగా ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఆప్‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారనే చెప్పాలి. ఆప్ వైపు నుంచి కొన్ని తప్పులు ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉండేది. ఆప్, కాంగ్రెస్‌కు కలిసి సుమారు 49 శాతం ఓట్లు వస్తే బీజేపీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా.. కాంగ్రెస్‌కు వచ్చిన ఆరుశాతం ఓట్లు ఆప్‌ను దెబ్బకొట్టినట్లు అనిపిస్తుంది. కేజ్రీవాల్ తాము గెలుస్తామనే ధీమాతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బోల్తా పడ్డారన్న  విశ్లేషణలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం స్కూళ్లు మెరుగుపరచింది. ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లకు అక్కడ డిమాండ్ వచ్చేలా చేసిందన్నది వాస్తవం. అలాగే ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

చంద్రబాబు ఈ రెండు పాయింట్లను సైతం విమర్శించారు. స్కూళ్లు బాగు చేశామంటున్నారు కాని కాలేజీలు పెట్టలేదని, ప్రజల ఇళ్లవద్దకు  డాక్టర్లను పంపించారని ఒప్పుకుంటూనే సూపర్ స్పెషాలిటి ఆస్పత్రులు నెలకొల్పలేదని అన్నారు. ఢిల్లిలో లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు అదే స్కామ్‌లో అభియోగానికి గురైన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎందుకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారో చెప్పరు.  ఢిల్లీ ఆప్ ఓటమిని ఏపీలో వైఎస్సార్సీపీ పరాజయానికి పోల్చుతూ తాము కూటమి పక్షాన ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు  అనిపిస్తుంది. సంక్షేమం కాదని అభివృద్ధి ముఖ్యమని ఢిల్లీ ఓటర్లు అభిప్రాయపడ్డట్లుగా ఆయన అంటున్నారు. దీనిని ఏపీకి వర్తింపచేసే యత్నం చేశారు. 

నిజంగానే ఏపీలో YSRCP ప్రభుత్వం అమలు చేసిన మోడల్ సక్సెస్ అయిందన్న భావన.. భయం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు లేకుంటే జగన్ స్కీములన్నిటిని కొనసాగిస్తామని ఎందుకు ప్రకటించారో  వివరించాలి కదా!. అమ్మ ఒడి కింద జగన్ ప్రభుత్వం తల్లికి రూ.15 వేలు చొప్పున ఇస్తుంటే, తాము అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని ఎందుకు చంద్రబాబు  హామీ ఇచ్చారు? సూపర్ సిక్స్ అంటూ ఎందుకు ఊదరగొట్టారు? నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, మహిళలకు నెల నెలా రూ.1500, బలహీన వర్గాలకు 50 ఏళ్లకే ఫించన్‌, రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎలా ప్రకటించారు?. 

ఏపీలో జగన్ టైమ్‌లో స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడితే అది అభివృద్ది కాదట. పోనీ చంద్రబాబు 15 ఏళ్లు ఇప్పటికే సీఎంగా పని చేశారు కదా! ఎందుకు స్కూళ్లను బాగు చేసి పేదలకు మంచి విద్య అందించలేదు. అసలు విద్య అనేది ప్రైవేటు రంగ బాధ్యత అని గతంలో అనేవారే! చంద్రబాబు తన పాలనలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయలేపోయారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే అభివృద్ధి కాదట. నాలుగు పోర్టులు నిర్మించడం అభివృద్ది కాదట. వచ్చిన మెడికల్ సీట్లను వెనక్కి ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం అభివృద్ది మోడల్ అట. పోర్టులను ప్రవేటు పరం చేయాలని యోచించడం ప్రగతి అట. జగన్ ఎన్నికల మానిఫెస్టోని చిత్తశుద్దితో అమలు చేస్తే, చంద్రబాబు అండ్ కో ప్రజలను మాయ చేయడానికి వాడుకున్నారు. 

గెలిచిన తర్వాత సంక్షేమం కాదు.. అభివృద్ది అంటూ కొత్తరాగం తీస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2019 లో టీడీపీకి మద్దతుగా కేజ్రీవాల్ ఏపీలో ప్రచారం చేశారు. అప్పుడు ఆయన చాలా గొప్ప వ్యక్తిగా, ఢిల్లీ అభివృద్ది ప్రదాతగా, పాలనదక్షుడిగా చంద్రబాబుకు కనిపించారు. ఇప్పుడేమో అదే కేజ్రీవాల్‌ను రాజకీయ కాలుష్యం సృష్టించిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో  ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే ఉండడానికి అనర్హుడుగా, టెర్రరిస్టుగా, భార్యనే ఏలుకో లేని వ్యక్తిగా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మోదీది అభివృద్ది మోడల్ అని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఫలితాలను విశ్లేషిస్తూ మీడియా తో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీడియా ప్రతినిధి ఈ విషయాలు అడుగుతారేమోనని అనుకుంటే అలా జరిగినట్లు లేదు.  ఆ ప్రశ్నలే రాకుండా ఆయన జాగ్రత్త పడతారేమో తెలియదు. 

చంద్రబాబు ఏది చెబితే అదే కరెక్ట్ అని మీడియా ప్రచారం చేయాలి. అదే ఆయన వ్యూహం కూడా. ఏది ఏమైనా ఢిల్లీ ఫలితాల పేరుతో సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు మంగళం పలకడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారనే భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుది చీటింగ్ మోడల్ అని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుంటారు. మాటలు మార్చడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును మించి రాజకీయ కాలుష్య కాసారాన్ని సృష్టించగల నేత ఇంకెవరైనా ఉన్నారా?..

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement