![Central Govt Advisory on China AI Deepseek](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Deepseek.jpg.webp?itok=XPlyo9XD)
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ రంగంలో సంచలనం సృష్టించిన చైనాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘డీప్‌సీక్’తో భారతీయ కంప్యూటర్లలో డేటా గోప్యత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళనలు రేకత్తడంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. డీప్‌సీక్ వంటి ఏఐ వినియోగంపై తగు సూచనలు, సలహాలు, హెచ్చరికలతో అధికారిక అడ్వైజరీని జారీ చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. సైబర్ సెక్యూరిటీ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను హెచ్చరిస్తూ ఈ ఉత్తర్వులు తీసుకురానుంది.
డీప్‌సీక్ తన ఏఐ చాట్‌బాట్ ఆర్1 ద్వారా సున్నితమైన యూజర్ డేటాను ఎలా యాక్సెస్ చేస్తోందనే దానిపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ–ఇన్) సమగ్రస్థాయిలో దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పూర్తయ్యాక చర్యలు చేపడుతుంది. యూజర్ ప్రాంప్‌్ట్స, డివైజ్ ఇన్ఫర్మేషన్, యాప్ ఇంటరాక్షన్స్, కీ స్ట్రోక్‌లతో విస్తృత శ్రేణి డేటాను డీప్‌సీక్ సేకరిస్తోందని సీఈఆర్‌టీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతా ప్రయోజనాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని భద్రతా చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు..
భారత్ మాత్రమే కాదు ఆ్రస్టేలియా, ఇటలీ, దక్షిణ కొరియాతో సహా అనేక దేశాలు గోప్యత, భద్రతా ప్రమాదాల దృష్ట్యా ప్రభుత్వ విభాగాలు, అధికారిక కంప్యూటర్ల, కీలక వ్యవస్థల్లో డీప్‌సీక్ టూల్స్ వినియోగంపై ఆయా దేశాల ప్రభుత్వాలు నిషేధం విధించాయి. విడుదల నాటినుంచే ప్రపంచవ్యాప్తంగా డీప్‌సీక్ సంచలనం సృష్టించడంతోపాటు కొత్త భయాందోళనలకు తెరలేపింది. అత్యద్భుతమైన పనితీరుతో ఏఐ మోడల్ మొదట ప్రశంసలు పొందినా.. దాని డేటా సేకరణ పద్ధతులతో పలు దేశాల ప్రభుత్వాలు ఆందోళనలో పడ్డాయి.
ప్రైవసీ, మాల్‌వేర్ ప్రమాదాల కారణంగా డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా నిషేధించింది. తైవాన్ దీనిని దేశ భద్రతా ముప్పుగా పేర్కొంది. యూజర్ డేటాను ఉపయోగించడంలో పారదర్శకతను చూపకపోవడంతో దక్షిణ కొరియా దీనిని జాతీయ భద్రతా ప్రమాదంగా ప్రకటించింది. తమ పౌరుల డేటాను ప్రాసెస్ చేయకుండా ఇటలీ డీప్‌సీక్‌ను అడ్డుకుంటోంది. డీప్‌సీక్ వారి ఆర్1 మోడల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఉచిత సేవలు అందించే డీప్‌సీక్ వంటి యాప్‌లు యూజర్ల డేటాను సేకరించి దానికి ముడిసరకుగా వినియోగిస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా డీప్‌సీక్ కేవలం చైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పనిచేస్తుంది.
ప్రామాణిక డేటాను మించి..
ప్రామాణిక డేటా సేకరణ పద్ధతులతోపాటు ఇతర మార్గాల్లోనూ వినియోగదారుల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కార్యకలాపాలను డీప్‌సీక్ ట్రాక్ చేస్తోందని సీఈఆర్‌టీ పరిశోధనలో తేలింది. చాట్‌బాట్ ఆర్1 వినియోగించడం మొదలుపెట్టిన తరువాత.. చాట్ జీపీటీ లేదా గూగుల్‌కు చెందిన జెమినీ వంటి పోటీ యాప్‌లను యూజర్లు ఉపయోగించడం మానేశారా లేదా అనే విషయాన్ని కూడా ఈ యాప్ చెక్‌చేస్తోంది. తాము సేకరించిన సున్నితమైన డేటా తమ వద్ద భద్రంగా ఉంటుందని, చైనా ప్రభుత్వానికి చేరబోదు అనే సరైన వివరణ డీప్‌సీక్ ఇవ్వట్లేదు. దీంతో డీప్‌సీక్‌కు జవాబుదారీతనం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ యాప్‌తో వ్యక్తిగత డేటా చైనాకు చేరుతోంది. దీంతో డీప్‌సీక్ యూజర్లు నిఘా లేదా సైబర్ గూఢచర్యం వంటి దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది. చాట్‌జీపీటీ, డీప్ సీక్ వంటి ఏఐ టూల్స్‌ను ప్రభుత్వ అధికారులు ఉపయోగించరాదని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment