![Sakshi Editorial On Artificial Intelligence Technology](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Untitled-3.jpg.webp?itok=djRRw8WX)
ఇప్పటికే సమస్త జీవన రంగాలనూ అల్లుకుపోయిన కృత్రిమ మేధ (ఏఐ)పై పారిస్‌లో వరసగా రెండురోజులపాటు కొనసాగి మంగళవారం ముగిసిన మూడో శిఖరాగ్ర సదస్సు ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బ్రిటన్‌లోని బ్లెచ్‌లీ పార్క్‌లో జరిగిన తొలి ఏఐ శిఖరాగ్ర సదస్సు (సేఫ్టీ సమ్మిట్) పూర్తిగా భద్రతాపరమైన అంశాలపై దృష్టిపెట్టింది. నిరుడు దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సు ప్రముఖ ఏఐ సంస్థల నుంచి భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్దానాలు పొందగలిగింది.
దానికి కొనసాగింపుగా పారిస్ శిఖరాగ్ర సదస్సును ‘ఏఐ యాక్షన్ సమ్మిట్’గా నామకరణం చేశారు. ఏఐ పరిమితు లేమిటో, అంతర్జాతీయ స్థాయిలో అందుకు పాటించాల్సిన నిబంధనలేమిటో ఈ శిఖరాగ్ర సదస్సు నిర్దేశిస్తుందని అందరూ ఊహించారు. కానీ బ్లెచ్‌లీ సదస్సు సాధించిన కొద్దిపాటి విజయాలనూ పారిస్ సదస్సు ఆవిరి చేసింది. దాపరికం లేని, సమ్మిళిత ఏఐ సాధనకు సమష్టిగా కృషి చేయాలన్న పిలుపునైతే ఇచ్చిందిగానీ, ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసేది లేదని అమెరికా, బ్రిటన్‌లు మొరాయించాయి.
మనతోపాటు 60 దేశాలు అంగీకరించిన ఈ డిక్లరేషన్‌ను అగ్రరాజ్యాలు కాదన్నాయంటే ఈ రంగం తీరుతెన్నులు ఎలా వుండబోతున్నాయో అంచనా వేయొచ్చు. ‘కొన్నేళ్ల క్రితం చర్చించిన ఏఐ భద్రత గురించి మాట్లాడటానికి ఇక్కడకు రాలేదు. ఏఐలో వెల్లువలా వచ్చిపడే అవకాశాలే నావరకూ ప్రధానాంశం’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. ఆయన ప్రస్తావించిన ఏఐ భద్రత అనేది నిజానికి 2023లో బ్రిటన్ చొరవతో బ్లెచ్‌లీ పార్క్ శిఖరాగ్ర సదస్సులో లోతుగా చర్చించిన అంశం. కానీ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆ సంగతే గుర్తులేనట్టు వ్యవహరించి అమెరికా తోకపట్టుకుపోయారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశాల వైఖరులు మారితే అంతర్జాతీయంగా వాటికి విశ్వసనీయత ఏముంటుంది? ఇప్పటికే అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒడంబడిక నుంచి బయటికొస్తున్నట్టు ప్రకటించారు. లక్షల కోట్ల పెట్టుబడితో ప్రధాన ఏఐ సంస్థలన్నీ సాగిస్తున్న పరిశోధనలు భవిష్యత్తులో ఎటువంటి కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేస్తాయో, అవి ప్రపంచ పౌరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలవోనన్న ఆందోళన అగ్రరాజ్యాలకు లేశమాత్రమైనా లేదని తేలిపోయింది.
ఏఐతో ఉద్యోగాలకు ముప్పు వచ్చిపడుతుందని, భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని అన్ని దేశాల్లోనూ భయాందోళనలున్నాయి. వందమంది గంటలో చేయగల పని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి చూపటాన్ని గమనిస్తే అవి సహేతుకమైనవేనన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే శిఖరాగ్ర సదస్సుకు సహాధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉద్యోగాల స్వభావం మారు తుంది తప్ప ఉద్యోగాలు పోవు. కొత్త సాంకేతికతలు అడుగుపెట్టినప్పుడు ఆ నైపుణ్యతలను పెంచు కోలేనివారికి ఇబ్బందులుంటాయి.
ఆ సాంకేతికతల్ని లొంగదీసుకోవటమే ఇందుకు పరిష్కారం. ఏఐ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వైద్య, వైజ్ఞానిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిశోధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఊహకందని వినూత్న ఆవిష్కరణలు రంగప్రవేశం చేస్తాయి. చికిత్సకు లొంగని మొండివ్యాధులు పలాయనం చిత్తగిస్తాయి. ఆయుఃప్రమాణాలు పెరుగుతాయి. అయితే రక్షణ, యుద్ధతంత్ర, అంతరిక్ష రంగాల్లో ఇది సృష్టించగల ఉత్పాతాలు చిన్నవేమీ కాదు.
ఇందుకు కొత్త తరం ఏఐ మోడల్స్ ఉదాహరణ. తాజా మోడల్ ఒకటి సవరణలకు అవకాశం లేకుండా తన సృజనకర్తనే పక్కదారి పట్టించేలా తనను తాను కాపీ చేసుకుందని ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వచ్చే అయిదేళ్లలో సూపర్ హ్యూమన్ స్థాయి ఏఐ రూపొందటం ఖాయమని వారంటున్నారు. భద్రతకు సంబంధించి ఏఐలో సాగుతున్న పరిశోధనల్లో తలెత్తే ప్రశ్నలకు పరిష్కారం కనుగొనకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నది వారి హెచ్చరిక.
కానీ అమెరికా తప్పుడు సూత్రీకరణలు చేస్తోంది. భద్రత గురించిన జాగ్రత్తలను సెన్సార్‌షిప్‌గా వక్రీకరిస్తోంది. యూరప్ యూనియన్ (ఈయూ) రూపొందించిన నియంత్రణ చట్టాలు ఆ రంగం పీకనొక్కడానికే పనికొస్తాయని వాన్స్ భాష్యం చెబుతున్నారు. ఏఐ విషయంలో సైద్ధాంతిక పక్షపాతాలకు అతీతంగా వ్యవహరించాలని, స్వేచ్ఛనీయాలని ఆయన డిమాండ్.
తప్పుడు సమాచార వ్యాప్తిని గుర్తించి తొలగించటానికి ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాలు రూపొందించుకున్న ఉపకరణాలను (ట్రంప్ వస్తారనగానే ఆ సంస్థలు స్వచ్ఛందంగా వాటిని ఉపసంహరించుకున్నాయి) సెన్సార్‌షిప్‌గా వక్రభాష్యం చెప్పినవారు ఇంతకుమించి ఆలోచించగలరా? ఏఐ రంగంలో ఇప్పట్లాగే భవిష్యత్తులోనూ తన ప్రాబల్యమే కొనసాగుతుందని, దాన్ని గుప్పెట్లో పెట్టుకుని లక్షల కోట్ల లాభాలు ఆర్జించవచ్చని అమెరికా కలగంటోంది.
కానీ ఇటీవల చైనా నుంచి వచ్చిన డీప్‌సీక్ దూకుడు గమనిస్తే ఈ రంగం ఎవరి జాగీరూ కాదని స్పష్టమవుతోంది. ఇలా నిరంతరం ఊహాతీతంగా చక చకా ఎదుగుతున్న రంగానికి బాధ్యతాయుతమైన మార్గాన్ని నిర్దేశించకపోతే దానివల్ల మానవాళికి ముప్పు కలిగే అవకాశం లేదా? సురక్షిత, హేతుబద్ధ, పారదర్శక ఏఐ రూపొందటానికి దేశాలన్నీ సమష్టిగా కృషి చేయకపోతే, సాధించే అభివృద్ధిని ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి నెలకొల్పనట్టయితే అది స్వీయ వినాశనానికే దారితీస్తుందని అన్ని దేశాలూ గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment