
డీప్‌సీక్ దెబ్బకు దిగొస్తున్న దిగ్గజాలు
వాషింగ్టన్: కృత్రిమ మేధ చాట్‌బాట్ సేవలరంగంలో తొలిసారిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. వందలా కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన తమ అత్యాధునిక ఏఐ చాట్‌బాట్ సేవలను ‘ప్రీమియం’ వంటి ఖరీదైన చందాలు కట్టేవారికే అందిస్తున్న బైదూ, ఓపెన్‌ఏఐ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు ‘ఉచిత’ జపం చేస్తున్నాయి. చైనా ఏఐ సంచలనం డీప్‌సీక్ తమ అత్యాధునిక ఏఐ చాట్‌బాట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తుండటంతో అవి కూడా అదే బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి.
ఏప్రిల్ ఒకటి నుంచి ఉచితం!
బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న చైనాకు చెందిన ఇంటర్నెట్ దిగ్గజం బైదూ ‘ఎర్నిబాట్’ పేరుతో ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తుండటం తెలిసిందే. ఇది ఏఐ పెయింటింగ్ వంటి అత్యాధునిక సేవలను చందా కట్టిన ప్రీమియం కస్టమర్లకే అందిస్తోంది. ఈ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందరికీ ఉచితంగా అందిస్తామని బైదూ గురువారం వీచాట్ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అంతకు కొన్ని గంటల ముందే మరో దిగ్గజ ఏఐ సంస్థ ‘ఓపెన్‌ఏఐ’ కూడా ఉచిత సేవల అంశాన్ని ప్రకటించింది.
తమ అధునాతన ఏఐ మోడల్ జీపీటీ–5ను ఉచితంగా అందిస్తామని సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘జీపీటీ–5ను ఇక అందరూ ఉచితంగా పొందొచ్చు. ఈ సేవల కోసం ఇప్పటికే చందా కట్టినవారికి మరింత అత్యాధునిక స్థాయి ఏఐ సేవలను అందిస్తాం’’ అని స్పష్టం చేశారు. తర్వాత బైదూ మరో ప్రకటన చేసింది.
జూన్ చివరికల్లా నూతన తరం ఏఐ మోడల్‌ను తెస్తామని తెలిపింది. ఇది డీప్‌సీక్ ఓపెన్ సోర్స్ మోడల్ తరహాలో ఉంటుందని భావిస్తున్నారు. డీప్‌సీక్ ఆర్1 ఏఐ మోడల్ ఉచితంగా అత్యాధునిక ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తుండటంతో పోటీలో నిలదొక్కుకునేందుకు ఇతర అగ్రగామి సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉచితాల బాట పడుతున్నాయని ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు తమ బేసిక్ చాట్‌బాట్ సేవలను ఉచితంగా అందిస్తున్నా ఖరీదైన సేవలను ఉచితం చేస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment