
మెటా అధినేత మార్క జుకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ విజిల్‌బ్లోయర్(వేగు) సారా విన్ విలియమ్స్ సంచలన ఆరోపణలకు దిగారు. జుకర్‌బర్గ్‌కు అమెరికా ప్రయోజనాల కన్నా డబ్బే ముఖ్యమని, ఈ క్రమంలోనే చైనాతో చేతులు కలిపి తన సొంత దేశం జాతీయ భద్రతా విషయంలో రాజీ పడ్డారని వెల్లడించారామె. సెనేటర్ జోష్ హవ్యూలే నేతృత్వంలోని కౌంటర్‌టెర్రరిజం సబ్ కమిటీ ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు.
సీబీఎస్ కథనం ప్రకారం సారా విన్ వాంగ్మూలంలో.. చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాతో మార్క్ జుకర్‌బర్గ్ చేతులు కలిపారు. అందుకే.. పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారామె.
మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్‌షిప్‌ను టూల్స్‌ను రూపొందించింది. తద్వారా కంటెంట్ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్‌బర్గ్.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?. ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు.

సారా విన్ విలియమ్స్ గతంలో ఫేస్‌బుక్‌లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్‌లెస్ పీపుల్ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తంపై మెటా కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది.
అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. ‘‘ఫేస్‌బుక్ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది’’ అని సెనేటర్ జోష్ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్‌బర్గ్‌కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్ విలియమ్స్ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.