ఆధార్ డేటా : బీజేపీపై శివసేన ఫైర్
సాక్షి, ముంబై : ఆధార్ సమాచార భద్రతపై విస్తృత చర్చ సాగుతున్న క్రమంలో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ తీరుపై శివసేన మండిపడింది. ఆధార్ కార్డుల సమాచారం పూర్తిగా భద్రతతో కూడుకున్నదని ప్రభుత్వం చెబుతుండగా, భద్రతలో డొల్లతనం బయటపడుతున్నదని ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన పార్టీ పత్రిక సామ్నాలో దుయ్యబట్టింది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ విసిరిన ఆధార్ భద్రత సవాల్‌పై ఫ్రెంచ్ హ్యకర్ ఎలియట్ అల్డర్సన్ వెల్లడించన అంశాలు దీని భద్రతను ప్రశ్నార్థకం చేశాయని పేర్కొంది.
యూఐడీఏఐకి పౌరులు సమర్పించిన డేటా ఏమాత్రం సురక్షితం కాదని ఎలియట్ అల్డర్సన్ బహిర్గతం చేశారని శివసేన పేర్కొంది. ట్రాయ్ చైర్మన్ శర్మ తన ఆధార్ నెంబర్‌ను ట్విటర్లో షేర్ చేసి దీన్ని ఉపయోగించి తనకు హాని తలపెట్టాలని ఆధార్ భద్రతను ప్రశ్నిస్తున్న వారిని సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో శర్మ వ్యక్తిగత వివరాలు కొన్నింటిని ఫ్రెంచ్ హ్యాకర్ ట్విటర్లో షేర్ చేయడంతో ఆధార్ భద్రతపై పలు సందేహాలు ముంచుకొస్తున్నాయి.
హ్యాకర్ చేస్తున్న వాదనను తోసిపుచ్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శివసేన పేర్కొంది. ట్రాయ్ చీఫ్ ఆధార్ నెంబర్ ఆధారంగా శర్మ కుమార్తెకు సైతం హ్యాకర్ ఈమెయిల్స్ పంపాడని, కీలక పత్రాలు పబ్లిక్ డొమెయిన్‌లో పెడతానని హెచ్చరించాడని సేన ఆందోళన వ్యక్తం చేసింది. హ్యాకర్ వెల్లడించిన సమాచారం ఎలాంటిదైనా ఈ అంశం ప్రజల రాజ్యాంగ హక్కులు, వారికి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ముడిపడినదని గుర్తించాలని సామ్నా సంపాదకీయంలో శివసేన పేర్కొంది. కాగా, హ్యాకర్ వెల్లడించిన సమాచారం గూగుల్ వంటి ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉందని, తమ డేటాబేస్ నుంచి సమాచార చోరీ జరగలేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
మరోవైపు ఎథికల్ హ్యాకర్‌గా చెప్పుకుంటున్న ఓ ట్విటర్ యూజర్ ట్రాయ్ చీఫ్ బ్యాంక్ ఖాతాలో ఒక రూపాయి డిపాజిట్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ పరిణామాలతో ప్రభుత్వం చెబుతున్న ఆధార్ సమాచార భద్రతలోని డొల్లతనం బయటపడిందని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది.